NTR Centenary: తారక రాముని శతజయంతి - శత విశేషాలు
ABN , First Publish Date - 2023-05-28T13:54:39+05:30 IST
తరాలు మారినా తరగని కీర్తి కొందరికే సాధ్యం. కథానాయకుడిగానే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా అగ్రశ్రేణి పీఠాన్ని అందుకున్న విశ్వవిఖ్యాతుడు ఎన్టీఆర్ (NTR). తెరమీద అనన్య సామాన్యమైన, అజరామరమైన ఎన్నో పాత్రలకు జీవం పోసిన ఆ మహానటుడి ‘శతజయంతి’ (NTR Centenary)ని పురస్కరించుకుని జనాలు ఆయనకు నీరాజనాలు పడుతున్నారు.
తరాలు మారినా తరగని కీర్తి కొందరికే సాధ్యం. కథానాయకుడిగానే కాకుండా రాజకీయ నాయకుడిగా కూడా అగ్రశ్రేణి పీఠాన్ని అందుకున్న విశ్వవిఖ్యాతుడు ఎన్టీఆర్ (NTR). తెరమీద అనన్య సామాన్యమైన, అజరామరమైన ఎన్నో పాత్రలకు జీవం పోసిన ఆ మహానటుడి ‘శతజయంతి’ (NTR Centenary)ని పురస్కరించుకుని జనాలు ఆయనకు నీరాజనాలు పడుతున్నారు. తెలుగుదనానికి నిలువెత్త నిర్వచనం, తెలుగువారి ఆత్మగౌరవ పతాక అయిన ఆ శకపురుషునికి సంబంధించిన శత విశేషాలివే..
సినిమా రంగం
1. ఎన్టీఆర్ నటించిన తొలి చిత్రం ‘మనదేశం’ (1949). చివరి చిత్రం ‘మేజర్ చంద్రకాంత్’ (1993). రెండు సినిమాల్లోనూ బాధ్యతాయుత ప్రభుత్వ అధికారి పాత్రల్లో నటించారు.
2. ఎన్టీఆర్ హీరోగా విడుదలైన తొలి చిత్రం ‘షావుకారు’ (1950). హీరోగా తొలి చిత్రం ‘పల్లెటూరి పిల్ల’ (1950).
3. తొలి జానపద చిత్రం ‘పల్లెటూరి పిల్ల’. తొలి పౌరాణిక చిత్రం ‘మాయారంభ’ (పాత్ర - నలకూబరుడు). తొలి చారిత్రక (నేపథ్యం) చిత్రం ‘మల్లీశ్వరి’.
4. ఎన్టీఆర్‌ను సూపర్‌స్టార్‌గా నిలిపిన చిత్రం ‘పాతాళభైరవి’ (1951).
5. తెలుగునాట ఫస్ట్ డైరెక్ట్ 200 రోజుల చిత్రం ‘పాతాళభైరవి’.
6. ఫిబ్రవరి 29న విడుదలై విజయఢంకా మోగించిన ఏకైక చిత్రం ‘పెళ్ళిచేసిచూడు’ (1952).
7. తెలుగు, తమిళ భాషల్లో రూపొంది తరువాత హిందీలో తెరకెక్కి మూడు భాషల్లో విజయం సాధించిన తొలి భారతీయ చిత్రం ‘పాతాళభైరవి’.
8. తొలి పాన్ ఇండియా మూవీ ‘చండీరాణి’ (1953). తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకే రోజు విడుదలయ్యింది.
9. సొంత నిర్మాణ సంస్థ యన్.ఏ.టి.పై నిర్మించిన తొలి చిత్రం ‘పిచ్చిపుల్లయ్య’ (1953). నలభై ఏళ్ళ కాలంలో నటిస్తూ నిర్మించిన చిత్రాలు 32.
10. పేరులో ‘రామ’ అన్న పదం కలిగి, ‘రాముడు’ పేరుతో రూపొందిన అత్యధిక చిత్రాలలో నటించిన నటుడు ఎన్టీఆర్. ‘రాముడు’ టైటిల్‌తో ఎన్టీఆర్ హీరోగా 16 చిత్రాలు రూపొందాయి.
11. ఎన్టీఆర్ తొలిసారి శ్రీకృష్ణ పాత్రలో కనిపించిన చిత్రం ‘ఇద్దరు పెళ్ళాలు’ (1954). తొలిసారి శ్రీకృష్ణ పాత్రలో పూర్తి స్థాయిలో నటించిన చిత్రం ‘మాయాబజార్’ (1957).
12. ఎన్టీఆర్ మొట్టమొదటిసారి శ్రీరాముడి పాత్రలో నటించినది ‘చరణదాసి’ (1956). మొదటిసారి శ్రీరాముని పాత్రను పూర్తిస్థాయిలో పోషించిన చిత్రం ‘సంపూర్ణ రామాయణం’(1958).
13. ఎన్టీఆర్ శ్రీనివాసునిగా నటించిన చిత్రాలు - శ్రీవేంకటేశ్వర మహాత్మ్యం (1960), శ్రీతిరుపతి వేంకటేశ్వర కళ్యాణం (1979).
14. తొలిసారి రావణునిగా నటించిన చిత్రం ‘భూకైలాస్’. తరువాత ‘‘సీతారామకళ్యాణం, శ్రీకృష్ణ సత్య, శ్రీరామపట్టాభిషేకం, బ్రహ్మర్షి విశ్వామిత్ర’’ (పౌరాణికాలు), ‘తిక్కశంకరయ్య’ (సాంఘికం)లో రావణునిగా కనిపించారు.
15. ఎన్టీఆర్ తొలిసారి దుర్యోధనునిగా నటించిన చిత్రం ‘శ్రీక్రిష్ణపాండవీయం’ (1966). తరువాత ‘‘దానవీరశూరకర్ణ, శ్రీమద్విరాట పర్వము’’ (పౌరాణికాలు), ‘చండశాసనుడు’ (సాంఘికం)లో సుయోధునునిగా కనిపించారు.
16. తొలిసారి అర్జున పాత్రలో కనిపించిన చిత్రం ‘జయసింహ’ (1955). తరువాత నర్తనశాల, బభ్రువాహన, ప్రమీలార్జునీయం, శ్రీమద్విరాటపర్వము పౌరాణికాల్లో అర్జున పాత్ర పోషించారు. ‘సంగీతలక్ష్మి’ (సాంఘిక)లో కూడా అర్జునునిగా కనిపించారు.
17. కేవలం 39 ఏళ్ల వయసులో శతాధికవత్సరాల కురువృద్ధుడు ‘భీష్మ’ (1962) పాత్రలో నటించారు.
18. ఎన్టీఆర్ భీమునిగా తొలిసారి తెరపై కనిపించిన చిత్రం ‘రాముడు-భీముడు’ (1964). తరువాత పూర్తిస్థాయిలో భీమునిగా ఎన్టీఆర్ నటించిన చిత్రం ‘పాండవవనవాసము’ (1965).
19. తొలిసారి తెరపై ద్విపాత్రల్లో కనిపించిన చిత్రం ‘సంతోషం’ (1955). తరువాత ఐదు పాత్రల్లో ‘జగదేకవీరుని కథ’ (1961)లో ‘శివశంకరి...’ పాటలో కనిపించారు. ఎన్టీఆర్ పూర్తి స్థాయిలో ద్విపాత్రాభినయం చేసిన తొలి చిత్రం ‘రాముడు-భీముడు’.
20. ద్విపాత్రాభినయంతో ఒకే యేడాది (1964) వరుసగా నటించిన చిత్రాలు రాముడు-భీముడు, శ్రీసత్యనారాయణ మహాత్మ్యం, అగ్గి-పిడుగు.
21. ఎన్టీఆర్ తొలిసారి బృహన్నలగా తెరపై కనిపించిన చిత్రం ‘నర్తనశాల’ (1963).
22. తొలిసారి స్త్రీవేషంలో తెరపై కనిపించిన చిత్రం ‘అన్న-తమ్ముడు’ (1958). కార్తవరాయని కథ, దేవాంతకుడు, పిడుగు రాముడు చిత్రాల్లోనూ స్త్రీ వేషంతో అలరించారు.
23. రామాయణంలో శ్రీరామ, రావణ పాత్రలను రెండుసార్లు ఒకేచిత్రంలో పోషించి అలరించిన నటుడు ఎన్టీఆర్. అవి ‘శ్రీకృష్ణసత్య’, ‘శ్రీరామపట్టాభిషేకం’.
24. మహాభారతంలోని శ్రీకృష్ణ, దుర్యోధన పాత్రల్లో ‘‘శ్రీక్రిష్ణపాండవీయం, దానవీరశూరకర్ణ, శ్రీమద్విరాటపర్వము’’ చిత్రాలలో నటించారు.
25. తెలుగునాట తొలిసారి త్రిపాత్రాభినయం (తాత, తండ్రి, మనవడు) చేసిన నటుడు ఎన్టీఆర్. చిత్రం ‘కులగౌరవం’ (1972).
26. తెలుగునాట పౌరాణిక చిత్రంలో త్రిపాత్రాభినయం చేసిన తొలి నటుడు ఎన్టీఆర్ - దానవీరశూర కర్ణ. పంచపాత్రల్లో ఎన్టీఆర్ నటించిన చిత్రం ‘శ్రీమద్విరాటపర్వము’.
27. తెలుగు చిత్రసీమలో అత్యధిక చిత్రాలలో (35) ద్విపాత్రాభినయం చేసిన నటుడు ఎన్టీఆర్.
28. భక్తునిగా, భగవంతునిగా ఒకే నటుడు నటించిన తొలి చిత్రం ‘శ్రీసత్యనారాయణ మహాత్మ్యం’ (1964).
29. ఎన్టీఆర్ నూరవ చిత్రం ‘గుండమ్మ కథ’(1962). ఇండియాలోనే తొలిసారి వంద చిత్రాలు పూర్తి చేసుకున్న హీరో!
30. ఎన్టీఆర్ 200వ చిత్రం ‘కోడలు దిద్దిన కాపురం’ (1970). యావద్భారతావనిలో 200 చిత్రాల్లో నటించిన తొలి హీరో.
31. ఎన్టీఆర్ 300వ చిత్రం ‘మేజర్ చంద్రకాంత్’ (1993). తెలుగునాట 300 సినిమాలు పూర్తి చేసిన తొలి కథానాయకుడు.
32. తెలుగునాట ఒకేసారి పది కేంద్రాలలో నేరుగా శతదినోత్సవం చూసిన తొలి చిత్రం ‘పాతాళభైరవి’.
33. తెలుగునాట తొలిసారి నూటికి నూరుశాతం కేంద్రాలలో శతదినోత్సవం చూసిన చిత్రం ‘లవకుశ’. 26 కేంద్రాలలో విడుదలై అన్నిటా వందరోజులు ప్రదర్శితమయింది. మొత్తం 72 కేంద్రాలలో శతదినోత్సవం, 18 కేంద్రాలలో రజతోత్సవం, ఒక కేంద్రంలో 470 రోజులు ప్రదర్శితమైన తొలి చిత్రం - ఏకైక పౌరాణిక చిత్రం ‘లవకుశ’.
34. ఏకకాలంలో 30కి పైగా కేంద్రాలలో నేరుగా వందరోజులు చూసిన తొలి సినిమా ‘అడవి రాముడు’ (1977). కోటి రూపాయలే అసాధ్యమైన రోజుల్లో ‘అడవిరాముడు’ ఏకంగా నాలుగు కోట్లు వసూలు చేసింది.
35. స్టూడియో అవసరం లేకుండా రూపొందిన తొలి చిత్రం ‘అడవిరాముడు’.
36. తెలుగునాట ఆంధ్ర, సీడెడ్, నైజామ్, ఉత్తరాంధ్ర ఏరియాల్లో ఏకకాలంలో స్వర్ణోత్సవం చూసిన ఏకైక చిత్రం ‘అడవిరాముడు’.
37. ఒకేసారి 50కి పైగా కేంద్రాలలో శతదినోత్సవం చూసిన తొలి చిత్రం ‘శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’(1984).
38. దేశంలోనే ఏడాదిలో 8 చిత్రాలు డైరెక్టుగా శతదినోత్సవాలు చూసిన ఏకైక నటుడు ఎన్టీఆర్ (1965లో).
39. దేశంలోనే అత్యధిక బ్లాక్‌బస్టర్స్ హీరో ఎన్టీఆర్.
40. ఎన్టీఆర్ స్వర్ణోత్సవాలు-పాతాళభైరవి, లవకుశ, అడవిరాముడు, వేటగాడు, బొబ్బిలిపులి, నయా ఆద్మీ(హిందీ), సంపూర్ణ రామాయణం(తమిళం).
41. దక్షిణ భారతంలో కోటి రూపాయలు చూసిన తొలి చిత్రం ‘లవకుశ’(1963). ఒకే యేడాది (1977)కోటి రూపాయలు వసూలు చేసిన మూడు చిత్రాలు - దానవీరశూర కర్ణ, అడవి రాముడు, యమగోల. తెలుగునాట కోటి రూపాయలు చూసిన అత్యధిక చిత్రాల హీరో ఎన్టీఆర్. ఆయన చిత్రసీమ నుండి 1982లో నిష్క్రమించే దాకా తెలుగునాట కోటి రూపాయలు చూసిన 15 చిత్రాలలో 13 సినిమాలు ఆయనవే.
42. ఎన్టీఆర్ దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘సీతారామకళ్యాణం’ (1961). స్వీయ దర్శకత్వం లోనే ఎన్టీఆర్ ఎక్కువసార్లు (18 చిత్రాల్లో) నటించారు.
43. సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రకాల్లో బ్లాక్‌బస్టర్స్ చూసిన ఏకైక నటుడు, దర్శకుడు.
44. ‘తాతమ్మకల’(1974)తో ఉత్తమ కథా రచయితగా నంది అవార్డు స్వీకరించారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా కూడా అవార్డులు స్వీకరించిన ఏకైక హీరో.
45. ఆదికవి వాల్మీకిగా రెండుసార్లు తెరపై కనిపించారు. అవి వాల్మీకి (1962), అడవిరాముడు (1977).
46. రిపీట్ రన్స్‌లోనూ వందరోజులు చూసిన ఎన్టీఆర్ చిత్రాలు (మొత్తం 17 సార్లు)- లవకుశ (2 సార్లు), శ్రీక్రిష్ణ పాండవీయం, కంచుకోట, వరకట్నం, కర్ణ, శ్రీకృష్ణావతారం, కన్యాశుల్కం (3 సార్లు), శ్రీతిరుపతమ్మకథ, బభ్రువాహన, శకుంతల, రక్తసంబంధం, బొబ్బిలిపులి, మాయాబజార్, కర్ణన్ (తమిళం)- వీటిలో ‘లవకుశ, బొబ్బిలిపులి, కన్యాశుల్కం’ రిపీట్ రన్ లోనూ రజతోత్సవాలు జరుపుకున్నాయి.
47. చారిత్రక ప్రాధాన్యం గల యుద్ధాలు ‘బొబ్బిలియుద్ధం, పల్నాటియుద్ధం’ రెండింటా ప్రధాన పాత్రల్లో నటించారు.
48. ఒకే యేడాది (1980) నటించిన అన్ని చిత్రాలలో టైటిల్ రోల్స్ పోషించిన చిత్రాలు... ఛాలెంజ్ రాముడు, సర్కస్ రాముడు, ఆటగాడు, సూపర్‌మేన్, రౌడీ రాముడు- కొంటెకృష్ణుడు, సర్దార్ పాపారాయుడు, సరదా రాముడు.
49. ముగ్గురు పద్మశ్రీ అవార్డు పొందిన (ఎన్టీఆర్, ఏయన్నార్, శివాజీగణేశన్) వారిని డైరెక్ట్ చేసిన ఎన్టీఆర్ - చాణక్య-చంద్రగుప్త (1977). మరోమారు ముగ్గురు పద్మశ్రీల (ఎన్టీఆర్, భానుమతి, బి.సరోజాదేవి)ను సమ్రాట్ అశోక (1992)లో డైరెక్ట్ చేశారు.
50. తెలుగులో కేంద్రప్రభుత్వ నగదు బహుమతి చూసిన తొలి చిత్రం ఎన్టీఆర్ నటించి, దర్శకత్వం వహించిన ‘వరకట్నం’ (1969).
51. తెలుగునాట తొలి సోషియో-ఫాంటసీ ‘దేవాంతకుడు’ (1960)
52. తెలుగులో మొదటి సైన్స్ ఫిక్షన్ ‘దొరికితే దొంగలు’ (1965)
53. అంతర్జాతీయ చిత్రోత్సవం (1952)లో పాల్గొన్న తొలి దక్షిణాది చిత్రం ‘పాతాళభైరవి’.
54. విదేశాలలో ప్రదర్శితమైన తొలి తెలుగు చిత్రం ‘మల్లీశ్వరి’. విదేశాలలో షూటింగ్ చేసిన తొలి తెలుగు సినిమా ‘సాహసవంతడు’ (1978).
55. తొలి తెలుగు సస్పెన్స్ థ్రిల్లర్ ‘లక్షాధికారి’ (1963)
56. తెలుగులో తొలి మాస్ మసాలా సినిమా ‘అగ్గిరాముడు’ (1954)
57. ఎన్టీఆర్ దర్శకత్వంలో నటించి తరువాత స్టార్స్ అయిన నటులు - హరనాథ్, శోభన్ బాబు, నందమూరి బాలకృష్ణ.
58. తెలుగువారి తొలి రంగుల చిత్రం ‘లవకుశ’. ఎన్టీఆర్ నిర్మించిన తొలి రంగుల చిత్రం ‘శ్రీకృష్ణసత్య’. ఎన్టీఆర్ నటించిన తొలి రంగుల సాంఘికం ‘దేశోద్ధారకులు’.
59. ఎన్టీఆర్ నటించిన తొలి సినిమా స్కోప్ - ఈస్ట్‌మన్ కలర్ ‘అడవిరాముడు’
60. ఎన్టీఆర్ దర్శకత్వంలో తొలి సినిమా స్కోప్ - ‘శ్రీమద్విరాటపర్వము’.
61. ఎన్టీఆర్ చివరి చారిత్రక చిత్రం ‘శ్రీనాథ కవిసార్వభౌముడు’. చివరగా విడుదలైన ఎన్టీఆర్ సినిమా కూడా ఇదే!
62. ఎన్టీఆర్‌కు నేపథ్యగానం చేసిన మేటి గాయకులు - ఘంటసాల, ఏయమ్ రాజా, పిబి శ్రీనివాస్, మాధవపెద్ది, పిఠాపురం, మంగళంపల్లి, రామకృష్ణ, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఏసుదాస్, మహ్మద్ రఫీ, తలాత్ ముహమ్మద్ (హిందీ పాతాళభైరవి), సౌందరరాజన్.
63. ఎన్టీఆర్‌కు నేపథ్యగానం చేసిన గాయని ఎల్.ఆర్.ఈశ్వరి - ‘పిడుగురాముడు’లోని ‘రంగులు రంగులు...’ పాట. ఈమెతో కలిపి మొత్తం 13 మంది నేపథ్యగానం చేశారు.
64. ఎన్టీఆర్ సరసన అత్యధిక చిత్రాలలో నటించిన నాయిక జమున.
65. సావిత్రి హీరోయిన్‌గా తొలి చిత్రం ‘పల్లెటూరు’ (1952), చివరి సినిమా ‘నిండుదంపతులు’ (1971) - రెండూ ఎన్టీఆర్‌వే కావడం విశేషం!
66. తల్లీకూతుళ్ళ (సంధ్య-జయలలిత; జయశ్రీ- జయచిత్ర) సరసన నాయకునిగా నటించిన ఏకైక హీరో ఎన్టీఆర్.
67. మనవరాలి పాత్ర (1972లో) పోషించిన శ్రీదేవితోనే హిట్ పెయిర్‌గా (1979 నుండి) సాగిన ఎన్టీఆర్.
68. వరుసగా నాలుగేళ్ళు బ్లాక్ బస్టర్స్ చూసిన హిట్ పెయిర్ ఎన్టీఆర్- శ్రీదేవి- వేటగాడు (1979), సర్దార్ పాపారాయుడు (1980), కొండవీటి సింహం (1981), బొబ్బిలిపులి (1982). ఈ రికార్డ్ ఇండియాలో ఏ జోడీకీ లేదు.
69. ప్రజల సంక్షేమం కోసం, పోలీసు నిధి ఏర్పాటు, దేశరక్షణ నిధి వంటి పలు కార్యక్రమాల కోసం విరాళాలు సేకరించారు ఎన్టీఆర్.
ప్రపంచ రికార్డులు
70. అత్యధిక పౌరాణిక చిత్రాలలో (48) నటించిన ఏకైక నటుడు ఎన్టీఆర్.
71. అత్యధిక జానపద చిత్రాలలో (57) కథానాయకునిగా నటించిన ఏకైక హీరో ఎన్టీఆర్.
72. ఒకే పాత్రను 25 సార్లు తెరపై ప్రదర్శించిన ఏకైక నటుడు ఎన్టీఆర్. అది శ్రీకృష్ణభగవానుని పాత్ర కావడం విశేషం! ఈ పాత్రను 27 ఏళ్లలో (1953-1979) ఒకే గెటప్‌లో అభినయించారు.
73. పౌరాణికాలలో బహుపాత్రలు చేసిన ఏకైక నటుడు - శ్రీకృష్ణసత్య (శ్రీరామ, రావణ, శ్రీకృష్ణ), దానవీరశూర కర్ణ (శ్రీకృష్ణ, కర్ణ, సుయోధన), శ్రీమద్విరాటపర్వము (శ్రీకృష్ణ, అర్జున, బృహన్నల, కీచక, సుయోధన).
74. ఒకే చిత్రంలో ఐదు చారిత్రక పాత్రలు - బుద్ధ, శంకరాచార్య, రామానుజాచార్య, వేమన, వీరబ్రహ్మేంద్రస్వామిగా నటించిన ఎన్టీఆర్. చిత్రం ‘శ్రీమద్విరాట వీరబ్రహ్మేంద్ర స్వామిచరిత్ర’(1984).
75. ఓ నటుడు 35 ఏళ్ళ పాటు (1950-1984) వరుసగా ఏటా వందరోజుల విజయాలు చూసిన ఏకైక నటుడు ఎన్టీఆర్.
76. సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రక చిత్రాలలో బ్లాక్ బస్టర్స్ చూశారు ఎన్టీఆర్.
77. అత్యధిక చిత్రాలలో ‘మారువేషాలు’ వేసి అలరించిన ఏకైక నటుడు.
78. పౌరాణిక (సీతారామకళ్యాణం, శ్రీక్రిష్ణపాండవీయం, దానవీరశూర కర్ణ), జానపదం (గులేబకావళి కథ), చారిత్రకం (శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర), సాంఘికం (వరకట్నం, తల్లాపెళ్ళామా, చండశాసనుడు)చిత్రాలతో డైరెక్టు సెంచరీ విజయాలు చూసిన ఏకైక నట-దర్శకుడు ఎన్టీఆర్.
79. 123 కాస్ట్యూమ్ డ్రామా చిత్రాలు (48 పౌరాణికం, 57 జానపదం, 18 చారిత్రకం) చేసిన ఏకైక నటుడు.
రాజకీయరంగం
80. 1982 మార్చి 29న ‘తెలుగుదేశం’ పార్టీ నెలకొల్పిన తొమ్మిది నెలల్లోనే అధికారం కైవసం చేసుకొని ప్రపంచ రికార్డ్ సృష్టించారు.
81. సమైక్యాంధ్రలో తొలి కాంగ్రేసేతర ముఖ్యమంత్రి ఎన్టీఆర్.
82. వరుసగా మూడేళ్ళు (1983,1984,1985) ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన ఏకైక రాజకీయ నాయకుడు ఎన్టీఆర్.
83. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన నాయకుడు.
84. 1984 ఆగస్టులో బర్తరఫ్ అయిన నెల రోజులకే తిరిగి అధికారం దక్కించుకున్నారు.
85. గెలిచిన ప్రతీసారి 200 పైగా సీట్లు సాధించారు. 1983 (201), 1985 (202), 1994 (221)
86. కాంగ్రెస్‌కు 1994లో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసిన ఎన్టీఆర్.
87. దేశమంతా 1984లో ఇందిరాగాంధీ హత్య సానుభూతి పవనాలు వీచినా, తెలుగునాట తెలుగుదేశం 30 ఎంపీ సీట్లు సాధించింది.
88. నేషనల్ ఫ్రంట్ ఛైర్మన్‌గా వ్యవహరించిన ఎన్టీఆర్.
89. 1989లో ప్రతిపక్ష నాయకునిగానూ తనదైన బాణీ పలికించారు.
90. రూ.2కిలో బియ్యం పథకం రూపశిల్పి ఎన్టీఆర్.
91. కుడి, ఎడమ పక్షాలైన బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలను ఒకే వేదికపై నిలిపి నడిపించిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్.
92. కేంద్రంలో నేటికీ కొనసాగుతున్న ఫ్రంట్ (ఐక్యసంఘటిత) ప్రభుత్వాలకు నాంది పలికిన తొలి నాయకుడు. (నేషనల్ ఫ్రంట్ చైర్మన్‌గా).
93. పేదవాడికి కూడు, గూడు, గుడ్డ అనే నినాదంతో కులరహితంగా సంక్షేమ పథకాలు అందించారు.
94. వెనుకబడిన తరగతులకు రాజకీయ రిజర్వేషన్లు దేశంలోనే తొలిసారిగా అందించారు.
95. మహిళలకు రిజర్వేషన్లు, ఆస్తి హక్కు కల్పించిన తొలి నాయకుడు ఎన్టీఆర్.
96. మహిళా విశ్వవిద్యాలయం, వైద్య ఆరోగ్య విశ్వ విద్యాలయం, తెలుగు విశ్వ విద్యాలయం వంటివి తొలిసారిగా నెలకొల్పిన నేత.
97. క్యాపిటేషన్ ఫీజ్‌ను నిషేధించిన ఏకైక నాయకుడు.
98. తెలుగుగంగ, నెట్టెంపాడు... వంటి ప్రాజెక్టులు తీసుకొచ్చిన నేత ఎన్టీఆర్.
99. 72 ప్రభుత్వ రంగ సంస్థలకు గాను 64 సంస్థలను లాభాలబాటల్లో నడిపారు.
100. టీటీడీలో 1985లో నిత్యాన్నదానం ప్రారంభించారు.
- కొమ్మినేని వెంకటేశ్వరరావు
ఇవి కూడా చదవండి:
************************************************
*LegendNTR: కత్తితో దాడి చేసిన జగ్గారావు.. ఎన్టీఆర్ చేతికి రక్తం కారుతున్నా కూడా..
*NTR Centenary Celebrations: చిరంజీవి ఇలా.. పవన్ కల్యాణ్ అలా!
*Hero Sharwanand: హీరో శర్వానంద్‌కు రోడ్డు ప్రమాదం.. కారు బోల్తా!
*Miss Shetty Mr Polishetty: నవీన్ పాడుతుంటే.. హీరో ధనుష్ వాయిస్ వినిపిస్తోంది.. ఏంటి కథ?
*Sivaji Raja: ‘రాజు’లు చాలా మంది ఉంటారు కానీ.. అందులో మంచివారు కొందరే!
*Vijayashanthi: ఎన్టీఆర్‌తో ఆ సంఘటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది