Venkatesh - Rana naidu: ‘విడిపోదాం..రా’ అంటున్న వెంకీ మామ!
ABN , First Publish Date - 2023-03-07T21:32:02+05:30 IST
‘‘అప్పుడు నేను చేసింది ‘కలిసుందాం.. రా(Kalisundam raa)!’ అయితే ఇప్పుడు చేసింది ‘విడిపోదాం..రా (Vidipodam raa)!’ అని నవ్వులు పూయించారు విక్టరీ వెంకటేశ్ (venkatesh).
‘‘అప్పుడు నేను చేసింది ‘కలిసుందాం.. రా(Kalisundam raa)!’ అయితే ఇప్పుడు చేసింది ‘విడిపోదాం..రా (Vidipodam raa)!’ అని నవ్వులు పూయించారు విక్టరీ వెంకటేశ్ (venkatesh). రానా (Rana Daggubati) దగ్గుబాటితోపాటు ఆయన నటించిన ‘రానా నాయుడు’ సిరీస్ గురించి ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఈ నెల 10న ‘నెట్‌ఫ్లిక్స్’ ఓటీటీలో విడుదల కానుంది. ఈ సందర్భంగా వెంకటేశ్, రానా సిరీస్ విషయాలను చెప్పుకొచ్చారు. ‘‘నేను నటించిన తొలి వెబ్ సిరీస్ ఇది. రానా నాయుడు’ (Rana naidu) నాకు కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. దీనితో చాలా విషయాలు నేర్చుకున్నా. రానాతో కలిసి స్ర్కీన్ షేర్ చేసుకోవడం ఆనందంగా ఉంది. కెరీర్‌లో ఇప్పటి వరకూ పోషించని పాత్రను పోషించా. రెగ్యులర్ రోల్స్‌కు భిన్నంగా సవాల్ విసిరే పాత్ర ఇది. రానాతో కలిసి నటించాలనే నా కల ఈ సిరీస్‌తో నెరవేరింది. కొన్ని సినిమాల్లోని పాత్రలు, ఆ పాత్రలు పోషించిన వారిని చూసి ‘ఇలాంటి క్యారెక్టర్ మనకెప్పుడు వస్తుంది’ అని అనుకుంటూ ఉండేవాణ్ని. ఆ అవకాశాన్ని ఈ సిరీస్ ఇచ్చింది’’ అని అన్నారు.
రానా దగ్గుబాటి (Rana daggubati)మాట్లాడుతూ ‘‘నాకు, బాబాయ్‌కి ఇలాంటి కథ చాలా కొత్త. ఆయనతో కలిసి నటించిన తొలి సన్నివేశం ఇంకా గుర్తుంది. అది మర్చిపోలేని అనుభూతి. ఇందులో మంచీ చెడూ రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తా. భర్తకు భార్యతో, తండ్రికి కొడుకుతో.. ఇలా కుటుంబమంతా వివాదాలే. ఇలాంటి ఎమోషన్స్ ఉన్న కాన్సెప్ట్‌తో సినిమా చేయడం చాలా కష్టం. ఈ సిరీస్‌లో కనిపించే ఫ్యామిలీని బయట చూడడం కష్టం. వెబ్‌సిరీస్‌ల్లో ఇప్పటి వరకూ రాని కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు రావాలనే ‘రానా నాయుడు’ ఎంపిక చేసుకున్నా. ముంబైలో ఉండే రాజకీయవేత్తలు, పెద్ద వ్యాపారవేత్తలు సినీ ప్రముఖులకు సమస్య వస్తే దాన్ని పరిష్కరించే వ్యక్తిగా నేను కనిపిస్తా. ఎవరికీ అవసరం ఉన్నా నాకే కాల్ చేస్తారు" అని అన్నారు.