Marriage: ఈ సినిమా తర్వాత అనుష్క.. టాలీవుడ్ యంగ్ హీరోతో రష్మిక..
ABN , First Publish Date - 2023-02-12T10:52:24+05:30 IST
కథానాయికలకు తరచూ ఎదురయ్యే ప్రశ్న ‘మీ పెళ్లెప్పుడు?’ అని.! వాళ్లకు చికాకు తెప్పించే ప్రశ్న కూడా ఇదే.
కథానాయికలకు తరచూ ఎదురయ్యే ప్రశ్న ‘మీ పెళ్లెప్పుడు?’ అని.! వాళ్లకు చికాకు తెప్పించే ప్రశ్న కూడా ఇదే. అయితే నవ్వుతూ సమాధానం దాటేస్తారు. టాలీవుడ్లో పెళ్లీడుకొచ్చిన హీరోయిన్లు చాలామందే ఉన్నారు. వాళ్లలో ఇప్పుడు కొంతమంది మనసు పెళ్లివైపు లాగుతోంది. వాళ్ల ప్రేమ - పెళ్లి విషయాలు మీడియాకు లీక్ అవుతున్నాయి. అలా నిత్యం పెళ్లి వార్తలతో మీడియాకి టచ్‌లో ఉంటున్న ఆ కథానాయికలెవరో చూద్దామా?
హింట్ ఇస్తున్నారు..
అనుష్క శెట్టి (Anushka Shetty) వయసు 41 ఏళ్లు. టాలీవుడ్లో అత్యంత సీనియర్ హీరోయిన్ స్వీటీ (Sweety)నే అని చెప్పొచ్చు. గత నాలుగైదేళ్లుగా ప్రతీసారీ స్వీటీ పెళ్లి మేటర్ బయటకు వస్తూనే ఉంది. ఓ టాప్ హీరోతో అనుష్క పెళ్లి కుదిరిపోయిందని.. పెళ్లి ముహూర్తం పెట్టేశారని... ఇలా రకరకాల వార్తలు. ఇప్పటికీ అదే హాట్ టాపిక్ నడుస్తోంది. కానీ అనుష్క వీటిపై ఎప్పుడూ స్పందించలేదు. మీడియా ముందు కూడా ఒక్కసారి కూడా నోరు జారలేదు. సినిమాలతోనే ప్రేమ... అంటూ రొటీన్ డైలాగే వల్లె వేస్తుంది. అయితే ఈయేడాది మాత్రం అనుష్క పెళ్లి ఖాయమన్నది టాలీవుడ్ టాక్. కొంతకాలం అనుష్క సినిమాలేం ఒప్పుకోవడం లేదు. చేతిలో యూవీ సంస్థ నిర్మిస్తున్న ప్రాజెక్టు ఒక్కటే ఉంది. అది కూడా సగం పూర్తయ్యింది. ఈ సినిమా అయ్యాక... స్వీటీ పెళ్లి చేసేసుకోబోతోందని చెప్పుకొంటున్నారు. ఓ వ్యాపార వేత్తతో అనుష్క పెళ్లి జరగబోతోందని సన్నిహితులు సైతం హింట్ ఇస్తున్నారు.
ఇది కూడా చదవండి: Mahesh - Namrata Wedding Anniversary: ‘ఇప్పటికి 18 ఏళ్లు.. జీవితాంతం ఇలాగే’
ఇష్టసఖుడితో...
శ్రుతిహాసన్ (Shruti Haasan) ప్రేమ వ్యవహారాలపై మీడియా ఎప్పటి నుంచో ఫోకస్ పెడుతూ వస్తోంది. శాంతానూ హజారికా అనే ఆర్టిస్ట్‌తో శ్రుతి కొంతకాలంగా ప్రేమలో ఉంది. వీరిద్దరి ఫొటోలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. శాంతానుని ఈ యేడాది శ్రుతి పెళ్లి చేసుకోబోతోందని టాక్. పెళ్లయ్యాక కూడా సినిమాల్లో కొనసాగుతుందట శ్రుతి. పెళ్లి విషయంలో కమల్‌హాసన్ శ్రుతికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని, ఈ విషయంలో జోక్యం చేసుకోనని శ్రుతికి చెప్పేశారని కోలీవుడ్ వర్గాల టాక్. ప్రస్తుతం వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. ‘‘పెళ్లి పూర్తిగా నా సొంత వ్యవహారం. నాకు నచ్చిన వాడినే పెళ్లి చేసుకుంటా’’ అంటున్నట్టుగానే తన ఇష్టసఖుడ్ని పెళ్లాడబోతోంది. అయితే.. పెళ్లెప్పుడు అనేది మాత్రం శ్రుతినే చెప్పాలి.
ఏదో జరుగుతున్నట్టే..
టాలీవుడ్లో దూసుకుపోతున్న కథానాయిక రష్మిక మందన్నా (Rashmika Mandanna). ఇదివరకే రక్షిత్ శెట్టి (Rakshith Shetty)తో ప్రేమలో పడింది. పెళ్లి కూడా నిశ్చయమయ్యాక.. ఇద్దరూ విడిపోయారు. ఆ తరవాత రష్మిక పూర్తిగా సినిమాలపై ఫోకస్ పెట్టింది. అపూర్వమైన విజయాలు అందుకొంది. ఇప్పుడు ఓ టాలీవుడ్ యువహీరోతో రష్మిక ప్రేమలో పడిందని టాక్. అంతేకాదు.. వీరిద్దరూ ఇటీవలే మాల్దీవులు విహారయాత్రలకు వెళ్లొచ్చారు. ఈ వ్యవహారం పెళ్లి వరకూ వెళ్లిందని, వేసవిలో ఇద్దరికీ నిశ్చితార్థం చేయాలని ఇంట్లోవాళ్లు నిర్ణయించుకున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. పెళ్లిపై ఎన్ని వార్తలొస్తున్నా... రష్మిక స్పందించడం లేదు. బేసిగ్గా తనపై ఎలాంటి రూమర్లు వచ్చినా ఖండించే రష్మిక.. ఈ విషయంలో సైలెంట్‌గా ఉందంటే, తెర వెనుక ఏదో జరుగుతున్నట్టే. సో.. త్వరలోనే రష్మిక పెళ్లి కబురు వినిపించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
ఇది కూడా చదవండి: Rakhi Sawant: ‘నా భర్త నా న్యూడ్ వీడియోలను అమ్ముకున్నాడు’
చిన్ననాటి స్నేహితుడే..
జాతీయ ఉత్తమ నటిగా గుర్తింపు తెచ్చుకొంది కీర్తి సురేష్ (Keerthy Suresh). అటు కమర్షియల్, ఇటు లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. కొంతకాలంగా కీర్తి పెళ్లి గురించి కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తోంది. తన చిన్ననాటి స్నేహితుడ్ని కీర్తి ప్రేమించి పెళ్లి చేసుకోబోతోందని ఈమధ్య ఓ వార్త చక్కర్లు కొడుతోంది. కీర్తి బాయ్‌ఫ్రెండ్ ఓ వ్యాపార వేత్త అని, తనకు దేశంలోని ప్రధాన నగరాల్లో కొన్ని రెస్టారెంట్లు ఉన్నాయని తెలుస్తోంది. దీనిపై కీర్తి ఇప్పటి వరకూ స్పందించలేదు. కీర్తి తల్లి, ఒకప్పటి కథానాయిక మేనక మాత్రం ‘‘కీర్తి దృష్టి ఇప్పుడు పూర్తిగా సినిమాలపైనే ఉంది. పెళ్లి గురించి ఆలోచించడం లేదు’’ అని చెప్పుకొచ్చినా.. బాయ్‌ఫ్రెండ్ విషయాన్ని మాత్రం ఖండించలేదు. కీర్తి మీడియా ముందుకు వస్తే తప్ప.. దీనిపై ఓ క్లారిటీ రాదు.
మనసులో మాట..
దేవదాసుతో.. తెలుగువాళ్ల మనసుల్ని దోచుకొంది ఇలియానా (Ileana). ఇప్పుడు తన వయసు 36 ఏళ్లు. పెళ్లీడు వచ్చి.. దాటేస్తున్నట్టే. అందుకే తన దృష్టిని పెళ్లి వైపు మరల్చిందని టాక్. కొంతకాలం ఆండ్రూ అనే విదేశీ ఫొటోగ్రాఫర్ తో సహజీవనం చేసింది. ఇద్దరూ పెళ్లి చేసుకొన్నారని ఓ దశలో వార్తలొచ్చాయి. అయితే.. ఇప్పుడు ఇద్దరూ విడిపోయారు. తాజాగా ఇలియానా మళ్లీ ప్రేమలో పడిందని, ఈ యేడాది పెళ్లి చేసుకోవడం ఖాయమని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇలియానా మాటలు కూడా పెళ్లి వార్తలకు బలం చేకూర్చుతున్నాయి. ‘‘జీవితంలో ఎవరో ఒకరి తోడుండాలి. అప్పుడే జీవితానికి ఓ భరోసా దొరుకుతుంది’’ అంటూ ఆమధ్య మనసులోని మాట బయపెట్టింది ఇలియానా.