Tollywood Box Office: 'కీడా కోలా', 'మా ఊరి పొలిమేర 2' రెండూ హిట్స్, ఎంత కలెక్టు చేసాయంటే...
ABN , First Publish Date - 2023-11-06T13:36:05+05:30 IST
గత వారం చాలా సినిమాలు విడుదలయ్యాయి, అందులో తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన 'కీడా కోలా', ఇంకొకటి 'మా ఊరి పొలిమేర 2' ఈ రెండు సినిమాలు విజయం సాధించాయని ట్రేడ్ అనలిస్ట్స్ చెపుతున్నారు.
గత వారం చాలా సినిమాలు విడుదలయ్యాయి, అన్నీ బడ్జెట్ సినిమాలే. తరుణ్ భాస్కర్ (TharunBhascker) నటించి, దర్శకత్వం వహించిన సినిమా 'కీడా కోలా' #KeedaaCola విడుదలవగా, డాక్టర్ అనిల్ విశ్వనాధ్ (DrAnilViswanath) దర్శకత్వం వహించిన 'మా ఊరి పొలిమేర 2' #MaaOoriPolimera2 కూడా విడుదలైంది. తరుణ్ భాస్కర్ సినిమా సురేష్ ప్రొడక్షన్స్ (SureshProductions) ద్వారా విడుదలవ్వగా, 'మా ఊరి పొలిమేర' గీత ఆర్ట్స్ (GeethaArts) ద్వారా విడుదలైంది. రెండు సినిమాల కన్నా, 'మా ఊరి పొలిమేర' ప్రచారాల్లో చాలా ముందుండి ప్రచారం చేశారు.
దానికి తోడు 'మా ఊరి పొలిమేర' మొదటి పార్టు ఓటిటి లో విడుదలై పెద్ద హిట్ అయింది. అందుకే ఆ సినిమాకి సీక్వెల్ గా వచ్చిన ఈ 'మా ఊరి పొలిమేర 2' మీద ప్రేక్షకులకి చాలా ఆసక్తికాగా వుండింది. ఇక తరుణ్ భాస్కర్ ముందు రెండు సినిమాలు 'పెళ్లి చూపులు' #PelliChoopulu, 'ఈ నగరానికి ఏమైంది' #EeNagaranikiEmaindi రెండూ బడ్జెట్ సినిమాలే, కానీ రెండూ హిట్ అయ్యాయి, ఇప్పుడు ఈ మూడో సినిమా 'కీడా కోలా', ఇది కూడా బడ్జెట్ సినిమానే.
'మా ఊరి పొలిమేర' సినిమా విజువల్స్ చాలా బాగుండటం, సినిమాలో అక్కడక్కడా మంచి త్రిల్లింగ్ పాయింట్స్ ఉండటం, ఓటిటి లో వచ్చిన సినిమా మంచి హిట్ అవటంతో ప్రేక్షకులు ఆ సినిమా మీద ఎక్కువ ఆసక్తి చూపించినట్టుగా తెలిసింది. ఆ సినిమా థియేటర్ హక్కులు సుమారు రూ .4 కోట్లకి అమ్ముడు అయ్యాయని తెలిసింది. ఈ సినిమా మొత్తం మూడు రోజులకి గాను రూ. 10 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ చేసిందని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు. ఈ సినిమా అప్పుడే బ్రేక్ ఈవెన్ కూడా అయిపోయిందని, ఇప్పుడు లాభాల బాటలో ఉందని తెలుస్తోంది. సత్యం రాజేష్ (SatyamRajesh) నటన, అలాగే కథానాయిక అయిన కామాక్షి భాస్కర్ల (KamakshiBhaskarla) అద్భుత ప్రతిభ కనపరిచిందని ఈ ఇద్దరూ సినిమాకి హైలైట్ అని అంటున్నారు. అయితే ప్రేక్షకులు ఆశించినంత రెండో పార్టులో కథ చెప్పలేదని అందుకని కొంచెం నిరాశ కూడా పడ్డారు అని తెలిసింది.
ఇక తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన 'కీడా కోలా' సినిమాలో తరుణ్ భాస్కర్, బ్రహ్మానందం (Brahmanandam) మాత్రమే తెలిసిన నటులు, మిగతా చాలామంది ఇప్పుడిప్పుడే పైకి వస్తున్న నటులు. ఈ సినిమా కూడా తక్కువ బడ్జెట్ లో తీయడం వలన ఈ సినిమా మొదటి వారాంతం లోనే బ్రేక్ ఈవెన్ అయింది అని ట్రేడ్ అనలిస్ట్స్ అంటున్నారు. ఈ సినిమా కూడా మొత్తం మూడు రోజులకి గాను రూ.12 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్టు చేసిందని చెపుతున్నారు. తరుణ్ భాస్కర్ సినిమా విదేశీ మార్కెట్ లో పెద్ద హిట్ అయిందని చెప్పొచ్చు. ఈ రెండూ కాకుండా ఇంకోలా కొన్ని చిన్న సినిమాలు కూడా విడుదలయ్యాయి కానీ వాటి ప్రభావం అంత లేదని చెపుతున్నారు.