Shruti Haasan: ‘శృతి’ మించని మేకప్ ఇష్టం..
ABN , First Publish Date - 2023-01-22T10:45:48+05:30 IST
శృతిహాసన్‌ది ఎప్పుడూ తళతళా మెరిసిపోయే ముఖం. కాంతిమంతమైన చర్మ సౌందర్యం ఆమె రహస్యం. ‘వాల్తేరు వీరయ్య’లో చిరంజీవి, ‘వీరసింహారెడ్డి’లో బాలకృష్ణల సరసన మెరిసిందీ భామ. శృతిహాసన్ అందం కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది? వివిధ సందర్భాలలో ఆమె చెప్పిన ఉపాయాలు ఏమిటి..?
శృతిహాసన్‌ది (Shruti Haasan)ఎప్పుడూ తళతళా మెరిసిపోయే ముఖం. కాంతిమంతమైన చర్మ సౌందర్యం ఆమె రహస్యం. ‘వాల్తేరు వీరయ్య’లో చిరంజీవి(Chiranjeevi, ‘వీరసింహారెడ్డి’లో బాలకృష్ణల సరసన మెరిసిందీ భామ. శృతిహాసన్ అందం (Glamour tips) కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుంది? వివిధ సందర్భాలలో ఆమె చెప్పిన ఉపాయాలు ఏమిటి..?
అది హానికరం..
పదే పదే అవసరమైన మేకప్‌లను ముఖంపైన, చర్మంపైన అప్లయ్ చేయకూడదు. దానివల్ల స్వేదగ్రంథుల్లోకి రసాయనాలు వెళతాయి. ఒక్కోసారి హార్మోన్ల అసమతుల్య సమస్యలు తలెత్తుతాయి. మొటిమలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. కొన్నాళ్లకు చర్మం జిడ్డుగా తయారవుతుంది. వివిధ సందర్భాల్లో చర్మం రంగు, కాంతి మారుతుంటుంది. అవసరమైనప్పుడు చర్మసౌందర్యానికి కావాల్సిన సప్లిమెంట్లను వైద్యుల సలహాతో వాడాలి. నేను వాడుతుంటాను.(sankranthi heroine)
వంటగదే బ్యూటీపార్లర్..
కెమికల్స్ ఎక్కువగా ఉన్న కాస్మొటిక్స్ వాడను. రసాయనాలు ఎప్పుడూ చర్మానికి హాని చేస్తాయి. అందుకే నేను జుట్టుకు శుద్ధమైన కొబ్బరి నూనెను రాసుకుంటాను. జుట్టు ఒత్తుగా పెరగడానికి కొబ్బరినూనె దోహదపడుతుంది. అప్పుడప్పుడు కొబ్బరి నూనె, బేకింగ్ సోడా కలిపి ఫేస్‌మాస్క్ వేసుకుంటాను. అయితే ఈ మాస్క్ వారి వారి చర్మాన్ని బట్టి ఉంటుంది. కొందరికి పడుతుంది, కొందరికి పడదు. ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. వంటగదిలో దొరికే దినుసులు, పదార్థాలతో సహజసిద్ధమైన ఫేస్‌మాస్క్‌లను వేసుకోవడం అలవాటు. తేనె, పెరుగు, పసుపు, అలొవేరా, టొమాటో, స్ట్రాబెర్రీ ఇలా రకరకాల వాటితో మాస్క్‌లు తయారుచేసుకోవచ్చు.
కొబ్బరి నీళ్లు తప్పనిసరి..
టొమాటో, నిమ్మ, తేనె కలిపి తయారుచేసిన కాస్మొటిక్స్‌ను వాడతాను. ఏ ఉత్పత్తిలో అయినా సరే.. మితిమీరిన రసాయనాలు ఎక్కువ ఉంటే మాత్రం అస్సలు వాడను. నా సౌందర్య రహస్యంలో మరొకటి.. ప్రతి రోజూ కొబ్బరి నీళ్లు తాగడం. ఇవంటే నాకు చాలా ఇష్టం. తలకు కొబ్బరి నూనె, తాగడానికి కొబ్బరి నీళ్లు తప్పనిసరిగా ఉండాల్సిందే!.
బంగాళాదుంపల రసంతో..
కొన్నిసార్లు ఎండలో తిరగాల్సి వస్తుంది. షూటింగ్‌లు ఉంటే తప్పదు. అలా చేసినప్పుడు ముఖంపైన లేదా చేతులపైన నల్లగా కందిపోయినట్లు అనిపిస్తుంది. అలాగే వదిలేస్తే సమస్య ఎక్కువ అవుతుంది. ముఖ్యంగా ముఖంపైన చర్మం సున్నితంగా ఉంటుంది కాబట్టి కందిపోయిన చోట నల్లటి మచ్చలు దీర్ఘకాలం ఉండే ప్రమాదం ఉంది. అందుకే నేను బంగాళాదుంపల రసాన్ని రాస్తాను. ఫలితం బాగుంటుంది.
అల్పాహారంలో పండ్లు..
ఉదయాన్నే అల్పాహారాన్ని తినడం తప్పనిసరి అలవాటుగా పెట్టుకున్నాను. అయితే రెండు ఇడ్లీలు, ఒక కోడిగుడ్డు, ఒక పెద్ద కప్పు తాజాపండ్లు నా ప్లేట్‌లో ఉండేలా చూసుకుంటాను. మధ్యాహ్న భోజనంలో అన్నం లేదా పాస్తా, సలాడ్స్ తింటాను. చర్మ సౌందర్యానికి సమతుల ఆహారం ఎంతో అవసరం.