Shriya Saran: పాపను వదిలి వస్తున్నా అంటే.. అలా చేయాల్సిందే!
ABN , First Publish Date - 2023-05-09T12:06:40+05:30 IST
‘‘ప్రస్తుతం నా కెరీర్ బావుంది. నాకు సూటయ్యే, నేను భాగమైతే బావుంటుంది అనే కథల్నే అంగీకరిస్తున్నా. ఆ విషయంలో మాత్రం చాలా గర్వంగా ఉంది.
‘‘ప్రస్తుతం నా కెరీర్ బావుంది (Shriya Saran). నాకు సూటయ్యే, నేను భాగమైతే బావుంటుంది అనే కథల్నే అంగీకరిస్తున్నా. ఆ విషయంలో మాత్రం చాలా గర్వంగా ఉంది. నా పాపను రాధను ఇంట్లో వదిలి నేను సెట్‌కు వస్తున్నా అంటే నేను చేసే పాత్ర ఎంత విలువతో ఉండాలి? తను ఎదిగాక నా సినిమాలు చూసినా, నా మాటలు విన్నా మా పాప గర్వపడాలి. అలాంటి కథల్లో నేను చేయాలనుకుంటున్నా’’ అని శ్రియా శరన్ (Shriya Saran) అన్నారు. తాజాగా ఆమె నటించిన చిత్రం ‘మ్యూజిక్ స్కూల్’ (Music school. పాపారావు బియ్యాల దర్శకనిర్మాత. ఈ శుక్రవారం ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా శ్రియ విలేకర్లతో మాట్లాడారు.
మనసుకి నచ్చిన పాత్రలో నటించినప్పుడు కలిగే ఆనందం వేరు. ఇది అలాంటి పాత్రే. ఒక అందమైన కథ ఇది. సీరియస్ అంశాన్ని సంగీతానికి ముడిపెట్టి ఈ చిత్రం తీశారు. వినోదం, సున్నితమైన భావోద్వేగాలతో పక్కా వాణిజ్య చిత్రంగా రూపుదిద్దుకుని ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇందులో మ్యూజిక్ టీచర్‌గా కనిపిస్తా. ‘నేనున్నాను’ సినిమాలో సంగీతం నేర్చుకునే యువతిగా నటించా. ఇందులో టీచర్‌గా నటించా. ఈ పాత్ర కోసం కసరత్తులు ఏమీ చేయలేదు. కానీ నటిస్తున్నప్పుడు సవాళ్లు ఎదురయ్యాయి. కళలు జీవితంలో ఎంత కీలకమో ఈ సినిమాలో చూపిస్తున్నాం. డాన్స్, సంగీతం నా జీవితంలో ముఖ్యమైనవి. చిన్నతనంలో కథక్ నేర్చుకున్నా. కథక్‌లో గానం కీలకం. అలా సంగీతంతో కూడా నాకు అనుబంధం ఉంది. ఆ అనుభవంతోనే ఈ సినిమాలో నటించా.
వయసుకి మించిన ఒత్తిడి పెరుగుతోంది...
చదువుల పేరుతో ఈతరం పిల్లలపై చాలా భారం మోపుతున్నాం. చిన్నారులు వయసుకి మించిన ఒత్తిడితో సతమతమవుతున్నారు. నా బాల్యంలోనూ అలాంటి అనుభవాల్ని ఎదుర్కొన్నా. మా ఇంట్లో అంతా బాగా చదువుకున్న వాళ్లే. నాన్న ఇంజినీర్. మా అమ్మ టీచర్, తాతయ్య కూడా విద్యాధికులే. నేను స్కూల్‌కి వెళస్త్ల్ర రోజుల్లో డాక్టర్, ఇంజనీర్ అదే జీవితం అన్నట్లు మాట్లాడేవారు. పదో తరగతి నుంచి చదువు తప్ప మిగతా వ్యాపకాలేవీ ఉండేవి కావు. దాంతో నేనూ ఒత్తిడికి గురయ్యేదాన్ని. కల్చరల్ యాక్టివిటీస్‌కి దూరం చేసేశారు. అదృష్టవశాత్తూ మా అమ్మ నన్ను నృత్యంవైపు ప్రోత్సహించారు. కథక్ నేర్చుకున్నా. నా ప్రతిభని గమనించి చదువుపై ఎంత శ్రద్థ తీసుకునేవారో, నృత్యంపరంగా కూడా అంతే ప్రోత్సహించేవారు. ఆ ప్రోత్సాహమే నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది. ఈ కథ విన్నప్పుడు నా చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కళ్ల ముందు మెదిలాయి. కథానాయికగా నా ప్రయాణంతో పాటు ఇప్పటి దశ కూడా నాకు తృప్తినిచ్చింది. నటిగా గర్వపడేలా చేసింది.
అదే మనమిచ్చే బహుమతి...
మనమున్న ఒత్తిడి పరుగుల ప్రపంచంలో పిల్లలకు కళల పట్ల అవగాహన ఉండాల్సి అవసరం ఉంది. ఒకప్పుడు 100కి 90 మార్కులొచ్చాయంటే చాలనుకునేవారు. ఇప్పుడేమో 99 మార్కులు రావల్సిందే అని ఇంట్లో, స్కూల్స్‌లోనూ ఒత్తిడి తెస్తున్నారు. ప్రస్తుతం చిన్నారులను కళలవైపు ప్రోత్సహించే వారు చాలా తక్కువ. కళలు, ఆటల వైపు పిల్లిల్ని ప్రోత్సహిస్తే ఫలితం వేరుగా ఉంటుంది. జీవితాంతం అమే మనతో ఉండేవి. వాటితో క్రమశిక్షణ పెరుగుతుంది. పెద్దల్ని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. రోజువారీ పనుల ఒత్తిడి కాస్త రిలీఫ్ దొరుకుతుంది. పిల్లలకు మనమిచ్చే జీవితకాలం బహుమానం అదే ఇప్పటికీ ఆనందం వచ్చినా, బాధ కలిగినా ఇంట్లో కథక్ నృత్యం చేస్తూ గడుపుతుంటా. నా కూతురు రాధ, నేను కలిసి చేస్తుంటాం.