Costumes Krishna: దిల్ రాజుకు లిఫ్ట్ ఇచ్చిన నిర్మాత, నటుడు కాస్ట్యూమ్స్ కృష్ణ కన్నుమూత

ABN , First Publish Date - 2023-04-02T09:52:05+05:30 IST

సినిమా ఇండస్ట్రీ మరో గొప్ప నిర్మాత, నటుడుని కోల్పోయింది. నిర్మాతగానే కాకుండా.. తనదైన నటనతో, విలనిజంతో విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు కాస్ట్యూమ్స్ కృష్ణ

Costumes Krishna: దిల్ రాజుకు లిఫ్ట్ ఇచ్చిన నిర్మాత, నటుడు కాస్ట్యూమ్స్ కృష్ణ కన్నుమూత
Dil Raju and Costumes Krishna

సినిమా ఇండస్ట్రీ మరో గొప్ప నిర్మాత, నటుడుని కోల్పోయింది. నిర్మాతగానే కాకుండా.. తనదైన నటనతో, విలనిజంతో విలక్షణ నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు కాస్ట్యూమ్స్ కృష్ణ (Costumes Krishna).. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ.. చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. విజయనగరం జిల్లా (Vijayanagaram), లక్కవరపు కోటలో జన్మించిన కృష్ణ మాదాసు (Krishna Madaasu).. సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తర్వాత కాస్ట్యూమ్స్ కృష్ణగా స్థిరపడిపోయారు. సినిమా పరిశ్రమలో కాస్ట్యూమ్స్ డిపార్ట్‌మెంట్‌లో పని చేస్తూ నిర్మాతగా, నటుడిగా మారిన ఆయన ఎన్నో గుర్తిండిపోయే పాత్రలలో నటించారు. ‘భారత్ బంద్, అల్లరి మొగుడు, దేవుళ్ళు, మా ఆయన బంగారం, పుట్టింటికి రా చెల్లి, పెళ్లాం చెబితే వినాలి, పెళ్లిపందిరి’ వంటి ఎన్నో చిత్రాలలో మంచి పాత్రలను పోషించి ప్రేక్షకుల మన్ననలను అందుకున్నారు. కోడి రామకృష్ణ (Kodi Ramakrishna) దర్శకత్వంలో వచ్చిన చిత్రాలలో ఆయనకు చాలా మంచి పాత్రలు దక్కాయి. కోడి రామకృష్ణను ఆయన గురువుగా భావించేవారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన ‘భారత్ బంద్’ చిత్రంతోనే నటుడిగా కాస్ట్యూమ్స్ కృష్ణ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ తర్వాత విలన్‌గా, తాతగా, తండ్రిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇలా విభిన్నమైన పాత్రలను పోషించిన ఆయన.. నిర్మాతగానూ దాదాపు 8 చిత్రాలను నిర్మించారు. కాస్ట్యూమ్స్ కృష్ణ మరణవార్త తెలిసిన సినీ ఇండస్ట్రీ ప్రముఖులు.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ.. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నారు.

దిల్ రాజు (Dil Raju) కు లిఫ్ట్ ఇచ్చిన నిర్మాతగా గుర్తింపు:

నాకు లిఫ్ట్ ఇచ్చిన నిర్మాత కాస్ట్యూమ్స్ కృష్ణ అని దిల్ రాజు ఆ మధ్య ఓ వేడుకలో తనే స్వయంగా ప్రకటించారు. అప్పట్లో దిల్ రాజు ఓ వేదికపై మాట్లాడుతూ.. 1996లో డిస్ట్రిబ్యూషన్‌ రంగంలోకి వచ్చి హర్షిత అనే డిస్రిబ్యూషన్‌ సంస్థను స్థాపించి అదే ఏడాది 3 చిత్రాలను డిస్ట్రిబ్యూట్‌ చేశాను. నా దగ్గర ఉన్న రూ. 40 లక్షలతో పాటు మరో రూ. 40 లక్షలు అప్పుచేసి సినిమాలు చేశాను. అవేవీ ఆడకపోవడంతో మొత్తం పోగొట్టుకున్నాను. ఆ సమయంలో కాస్ట్యూమ్స్‌ కృష్ణ‌గారికి నటునిగానే గాక నిర్మాతగా కూడా మంచి అభిరుచి ఉండేది. ఆయన నిర్మించిన, సౌందర్య హీరోయిన్‌గా నటించిన ‘అరుంధతి’ చిత్రాన్ని రూ. 34 లక్షలకు కొన్నాను. సినిమా డిజాస్టర్‌. మొత్తం పోయాయి. సినిమా విడుదలకు ముందే రూ.32 లక్షలు కట్టేశాను. ఫ్లాప్‌ అయిన తర్వాత కూడా బ్యాలెన్స్‌ రూ. 2 లక్షలను కూడా కాస్ట్యూమ్స్‌ కృష్ణగారికి ఇచ్చేశాను. సినిమా ఫ్లాప్‌ అయితే చాలా మంది ముఖం కూడా చూపించరు. కానీ నేను పూర్తి అమౌంట్ పే చేయడంతో.. నా నిజాయితీ చూసి కాస్ట్యూమ్స్‌ కృష్ణ ముచ్చటపడ్డారు. ఆ టైంలో ఆయన ఓ చిత్రం ప్రారంభించి నన్ను కూడా ప్రారంభోత్సవానికి పిలిచారు. అప్పట్లో ఆయన ‘అనురాగ సంగమ’ అనే రీమేక్‌ని చేయాలని భావించారు. నాకు కథ బాగా నచ్చడంతో ఆయన దానిని నాకే ప్రేమతో ఇచ్చేశారు. అదే ‘పెళ్లిపందరి’. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత నేను వెనుదిరిగి చూసుకోలేదని తెలిపారు. (Dil Raju About Costumes Krishna)

Krishna-pic.jpg

కాస్ట్యూమ్స్ కృష్ణ‌కు నిర్మాత దిల్ రాజు నివాళి:

తనకు లిఫ్ట్ ఇచ్చి, సక్సెస్‌ఫుల్ నిర్మాతను చేసిన కాస్ట్యూమ్స్ కృష్ణ ఇక లేరని తెలిసి.. నిర్మాత దిల్ రాజు ఎంతో బాధపడ్డారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ (SVC) ట్విట్టర్ వేదికగా కాస్ట్యూమ్స్ కృష్ణకు ఆయన నివాళులు ఆర్పించారు. కాస్ట్యూమ్స్ కృష్ణ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ.. కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు.


ఇవి కూడా చదవండి:

*********************************

*Jr NTR: ఒక్కటి కాదు.. ఫ్యాన్స్‌కి ఎన్టీఆర్ డబుల్ ట్రీట్!

*Rashmika Mandanna: ఐపీఎల్ వేదికపై ఆ పాట చేయలేకపోయానంటూ.. రష్మిక ఏం చేసిందో చూశారా?

*Vijay Sethupathi: పొలిటికల్ ఎంట్రీపై సంచలన వ్యాఖ్యలు

*Natural Star Nani: ‘దసరా’పై సూపర్ స్టార్ ట్వీట్.. నాని అలా అనేశాడేంటి?

*Nita Ambani: అట్టహాసంగా మొదలైన నీతా అంబానీ కలల ప్రాజెక్ట్.. తరలివచ్చిన తారాలోకం!

*Ram Charan and NTR: రామ్ చరణ్‌‌ రికార్డులు బద్దలుకొడితే.. తారక్‌కి ఇంత అవమానమా?

Updated Date - 2023-04-02T10:03:52+05:30 IST