Oscars95: ది ఆస్కార్ అవార్డు గోజ్ టు 'నాటు నాటు'
ABN , First Publish Date - 2023-03-13T08:28:51+05:30 IST
తెలుగు పాట 'నాటు నాటు' ఆస్కార్ అవార్డు గెలుచుకొని చరిత్ర సృష్టించింది. మొదటి సారిగా ఒక తెలుగు పాట ఇలా ఆస్కార్ గెలుచుకోవటం ఇదే మొదటిసారి. భారత దేశానికి చెందిన వారు ఎంతమంది ఆస్కార్ గెలుచుకున్నారు అంటే వేళ్ళ మీద లెక్కించవచ్చు. అలాంటిది ఒక తెలుగు సినిమా 'ఆర్.ఆర్.ఆర్' లోని ఈ పాటకి ఆస్కార్ రావటం భారత దేశానికే గర్వ కారణం. దర్శకుడు రాజమౌళి భారతదేశం గర్వించదగ్గ దర్శకుడు.
ఆర్.ఆర్.ఆర్. (RRR) చరిత్ర సృష్టించింది. ఆస్కార్ (Oscars95) అవార్డు గెలుచుకుంది. 'నాటు నాటు' (Naatu Naatu) సాంగ్ కి ఆస్కార్ అకాడమీ అవార్డ్ వచ్చింది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం సుమారు 8.30 గంటల సమయం లో ఈ అవార్డ్స్ ఫంక్షన్ లో ఈ అవార్డు ఈ పాటకి ఇస్తున్నట్టుగా ఆస్కార్ వేదిక మీద ప్రకటించారు. 'ఆర్.ఆర్.ఆర్' సినిమా దర్శకుడు రాజమౌళి కాగా, ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. చంద్రబోస్ ఈ 'నాటు నాటు' పాటని రాశారు. ఈ పాటని రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ పాడారు. ప్రేమ్ రక్షిత్ ఈ పాటకి కోరియోగ్రఫీ చేశారు. ఇలా తెలుగు పాట ఆస్కార్ నామినేషన్స్ లో ఉండటం, ఆస్కార్ గెలుచుకోవటం ఇదే మొదటి సారి. ఇప్పుడు ఈ పాట చరిత్ర సృష్టించింది. ఇది తెలుగువాడి విజయం, తెలుగువాడికి గర్వకారణం.
'ఆర్.ఆర్.ఆర్' మార్చి 24, 2022 ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయి సంచలమం సృష్టించింది. ఇందులో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా నటించారు, ఈ పాటకి ఈ ఇద్దరు నటులు అద్భుతమయిన డాన్స్ చేశారు. ఈ ఇద్దరు నటులు ప్రస్తుతం అమెరికాలో వుండి 'ఆర్.ఆర్.ఆర్' సినిమాకి విపరీతమయిన ప్రచారం చేశారు. అక్కడ టాక్ షో, రేడియో లో ఇద్దరు నటులు ఇంటర్వూస్ ఇచ్చారు. తమ సినిమాకి ప్రచారం చేశారు. దర్శకుడు రాజమౌళి అయితే అమెరికా లో చాలా కాలం వుంది, 'ఆర్.ఆర్.ఆర్' (RRR) సినిమాని ప్రమోట్ చేశారు. స్టీవెన్ స్పెల్ బెర్గ్ (Steven Spielberg), క్రిస్టోఫర్ నోలన్ (Christopher Nolan), జేమ్స్ కామెరాన్ (James Cameron) లాంటి పెద్ద పెద్ద దర్శకులని కలిసి వాళ్ళకి సినిమా చూపించి, వాళ్ళచేత ఎంతగానో ప్రశంసలు పొందారు. (OscarForNaatuNaatu)
ప్రపంచం లో పేరెన్నికగన్న అంతటి పెద్ద దర్శకులు మన తెలుగు సినిమా గురించి మాట్లాడటమే ఒక అద్భుతం. అటువంటి దర్శకులు రాజమౌళి గురించి, 'ఆర్.ఆర్.ఆర్' సినిమా గురించి ఎంతో గొప్పగా చెప్పారు. (OscarForNaatuNaatu) అలాంటి సినిమాలోని 'నాటు నాటు' (Naatu Naatu) పాట ఈరోజు ఆస్కార్ లో ఉండటమే చరిత్ర, మరి అలాంటిది ఆస్కార్ గెలుచుకుంది అంటే, అది చరిత్ర కన్నా గొప్పది. అందులోకి తెలుగు సినిమా ఈరోజు ఇంతటి స్థాయికి చేరింది అంటే, ప్రతి తెలుగు వాడు, భారతీయుడు గర్వించదగ్గ రోజు ఈరోజు.
హేట్సాఫ్ టు రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, మిగతా టీం సభ్యులు అందరికీ.
సంగీత దర్శకుడు కీరవాణి, ఆ పాటని రాసిన చంద్రబోస్ ఆస్కార్ అవార్డు అందుకోవటానికి వేదిక మీదకి వెళ్లారు.