RRR - Scott Buxton: రే స్టీవెన్సన్‌ హఠాన్మరణం.. జక్కన్న స్పందన

ABN , First Publish Date - 2023-05-23T11:28:34+05:30 IST

ఎస్‌ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో ప్యాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో బ్రిటీష్‌ గవర్నర్‌ స్కాట్‌గా నటించిన ఐరిష్‌ నటుడు రే స్టీవెన్సన్‌ (58)కన్ను మూశారు.

RRR - Scott Buxton: రే స్టీవెన్సన్‌ హఠాన్మరణం.. జక్కన్న స్పందన

ఎస్‌ఎస్‌. రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో ప్యాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR)చిత్రంలో బ్రిటీష్‌ గవర్నర్‌ స్కాట్‌గా నటించిన ఐరిష్‌ నటుడు రే స్టీవెన్సన్‌ (Ray Stevenson) (58)కన్ను మూశారు. ఈ విషయాన్ని తొలుత ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంలో కేథరిన్‌ బక్స్‌టన్‌ పాత్ర పోషించిన అలిసన్‌ డూడీ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తెలిపారు. అయితే రే అకాల మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది. తాజాగా ఆయన నటిస్తున్న ‘కాసినో ఇన్‌ ఇస్‌చియా’ చిత్రం షూటింగ్‌ ఇటలీలో జరుగుతోంది. అక్కడే ఆయన మరణించారని తెలుస్తోంది. ఈ నెల 25న రే పుట్టినరోజు. (RIP Ray Stevenson)

రే స్టీవెన్సన్‌ మరణంపై దర్శకుడు రాజమౌళి స్పందించారు. రేతో కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్‌లో షేర్‌ చేసి నివాళి అర్పించారు జక్కన్న. ‘‘షాకింగ్‌ న్యూస్‌ ఇది. ఈ వార్తను నమ్మలేకపోతున్నా. రే స్టీవెన్సన్‌ సెట్‌లో ఉంటే ఎనర్జీ, ఉత్తేజం ఉండేది. అతనితో పని ఎంతో ఆహ్లాదంగా ఉండేది. ఆయనకు ఆత్మకు శాంతి కలగాలి. కుటుంబానికి నా ప్రగాఢ సానూభూతి తెలుపుతున్నా(Ray Stevenson nomore)’’ అని ట్వీట్‌ చేశారు రాజమౌళి. ఆయన మరణ వార్త తెలుసుకున్న వెంటనే ప్రపంచవ్యాప్తంగా రే అభిమానులు షాక్‌కి గురయ్యారు. తోటి నటీనటులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Untitled-1.jpg

స్టంట్స్‌కి వెనకాడలేదు: ఆర్‌ఆర్‌ఆర్‌ టీమ్‌ (Team RRR)

స్టీవెన్సన్‌ మృతిచెందడంతో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రబృందం షాకైంది. ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌లో రే స్టీవెన్సన్‌పై చిత్రీకరిస్తున్న యాక్షన్‌ సన్నివేశం ఫొటోను ట్వీట్‌ చేసింది. ‘‘56 ఏళ్ల వయసులో ఇలాంటి యాక్షన్‌ సన్నివేశాలు చేయడం కష్టంతో కూడిన పని. కానీ ఆయన ఈ స్టంట్స్‌ చేయడానికి ఎక్కడా వెనకాడలేదు’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. ‘రే మరణ వార్త ఎంతో షాక్‌కు గురిచేసింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. ఎప్పటికీ మా హృదయాల్లో నిలిచే ఉంటారు’’ అని రాసుకొచ్చారు.

రే అసలు పేరు జార్జ్‌ రేమండ్‌ స్టీవెన్సన్‌. 1964 మే 25న నార్త్‌ ఐర్లాండ్‌లోని లిస్‌బర్న్‌లో జన్మించారు. ఎనిమిదేళ్ల వయసులో ఇంగ్లాండ్‌ చేరుకున్న ఆయన బ్రిటిష్‌ ఓల్డ్‌ విక్‌ థియేటర్‌ స్కూల్‌లో ప్రవేశం పొందాడు. 29ఏళ్లకు గ్రాడ్యుయేట్‌ అయిన ఆయన 1990ల్లో టీవీ షోల్లో నటించడం మొదలు పెట్టారు. ఆ తర్వాత హాలీవుడ్‌ చిత్రాల్లో నటించారు. 1998లో ‘థియరీ ఆఫ్‌ ఫ్లైట్‌’ చిత్రంతో మొదటిసారి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తర్వాత గ్రీన్‌విచ్‌ మీన్‌ టైమ్‌ ఇన్‌ 1999, ది అదర్‌ గాయ్స్‌, జో రిటాలియేషన్‌, డైవర్జెంట్‌, ది ట్రాన్స్‌పోర్టర్‌: రిప్యూల్‌డ్‌, కింగ్‌ ఆర్థర్‌, పనిషర్‌ వార్‌ జోన్‌, బుక్‌ ఆఫ్‌ ఎలీ, యాక్సిడెంట్‌ మ్యాన్‌, మెమొరీ, థోర్‌: ద డార్క్‌ వరల్డ్‌ సిరీస్‌తో ఫేమ్‌ పొందారు. డెక్స్‌టార్‌, స్ట్టార్‌వార్స్‌ రెబెల్స్‌ లాంటి టీవీ షోలతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఆయన నటించిన చివరి చిత్రం అశోకా’. ఈ సిరీస్‌ త్వరలో డిస్నీ ఫ్లస్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.

Updated Date - 2023-05-23T11:50:13+05:30 IST