Ram Miriyala: ‘చేతులెత్తి మొక్కుతా చేయి చేయి కలపకురా’
ABN , First Publish Date - 2023-02-26T09:55:15+05:30 IST
‘చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే..’ అంటూ ప్రేమ పటాసులు పేల్చాడు. ‘డీజే టిల్లు కొట్టు’ అంటూ డీజేలు దద్దరిల్లేలా చేశాడు. ‘భీం భీం భీం... భీమ్లానాయక్’ అంటూ మాస్ స్టెప్పులు వేయించాడు.
‘చిట్టి నీ నవ్వంటే లక్ష్మీ పటాసే..’ అంటూ ప్రేమ పటాసులు పేల్చాడు. ‘డీజే టిల్లు కొట్టు’ అంటూ డీజేలు దద్దరిల్లేలా చేశాడు. ‘భీం భీం భీం... భీమ్లానాయక్’ అంటూ మాస్ స్టెప్పులు వేయించాడు. రామ్ మిరియాలా (Ram Miriyala) పాట వింటే ఎవరికైనా పూనకాలు లోడవ్వాల్సిందే. తన గురించి, తన పాటల గురించి ఆయన చెబుతున్న విశేషాలివి...
గోరటి వెంకన్న (Gorati Venkanna) పాటలంటే ఇష్టం..
గోరటి వెంకన్న రాసిన పాటలు పాడటమంటే చాలా ఇష్టం. ఆయన రాసిన అద్భుతమైన పాటలను నా స్టైల్‌లో నేటి యువతరానికి చేరవేయాలనుకుంటున్నా.
అలా మొదలైంది...
‘చౌరస్తా బ్యాండ్’ (Chourasta Band)తో నా ప్రయాణం మొదలైంది. అందులో ప్రైవేట్ సాంగ్స్ పాడుతున్న క్రమంలోనే ‘పుష్పక విమానం’ (Pushpaka Vimanam) సినిమాలో ఆఫర్ వచ్చింది. అందులో ‘సిలకా’, ‘కళ్యాణం’ పాటలు నేను కంపోజ్ చేశాను. ‘సిలకా’ పాట నేను పాడితే, ‘కళ్యాణం’ పాటను సిద్ శ్రీరాం ఆలపించారు. వాటితో నాకు సినిమాల్లోకి చక్కని ఎంట్రీ లభించింది.
ఆ ఇద్దరికీ పెద్ద అభిమానిని..
అందరి పాటలు బాగా వింటాను. అయితే సంగీత దర్శకులలో ఇళయరాజా (Ilayaraja), మణిశర్మ (Manisharma) అంటే ఇష్టం. వారికి నేను పెద్ద అభిమానిని.
ఎక్కువసార్లు విన్నా...
ఆ మధ్య విడుదలైన ‘సీతారామం’ (Sitaramam) సినిమాలోని అన్ని పాటలు నాకు బాగా నచ్చాయి. ఇటీవల కాలంలో నేను ఎక్కువ సార్లు విన్న పాటలు ఈ సినిమాలోనివే. నా పాటల్లో అయితే ‘ఊరెళ్ళి పోతా మామ’, ‘అలాయ్ బలాయ్’ పాటలు చాలా ఇష్టం. తెలుగులో ఇష్టమైన గాయకుడు అనురాగ్ కులకర్ణి. ‘లవ్‌స్టోరీ’లో ఆయన పాడిన ‘నీ చిత్రం చూసి’ పాట నాకు బాగా నచ్చింది. బాలీవుడ్‌లో అర్జీత్ సింగ్ అంటే ఇష్టం.
ఇది కూడా చదవండి: Anchor Rashmi Gautam: వీధి కుక్కల దాడిలో బాలుడు మృతిపై స్పందించిన రష్మి.. ఆడేసుకుంటున్న నెటిజన్లు
‘మాయ’ చేసింది..
‘మాయ’ పాట ద్వారా నాకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. సినిమాల్లోకి వచ్చాక.. ‘జాతిరత్నాలు’లోని ‘చిట్టి’ పాటతో పాపులర్ అయ్యాను. నిజానికి ఆ పాట పాడుతున్నప్పుడు అంత హిట్ అవుతుందని అనుకోలేదు. చాలా రెగ్యులర్‌గా ఉందనుకున్నా. కానీ ఊహించని రీతిలో జనాల్లోకి చొచ్చుకుపోయింది.
ప్రజలకు నచ్చేవిధంగా..
ఓ పక్క సినిమాల్లో పాడుతూ బిజీగా ఉన్నా. మరోపక్క సామాజిక అంశాలను మేళవిస్తూ ప్రజలకు నచ్చే విధంగా పాటలు రాసి, పాడాలనుకుంటున్నా. నిజానికి ప్రేక్షకులు కూడా నా నుంచి అలాంటి పాటలే ఆశిస్తున్నారు.
మరోసారి ‘టిల్లూ’..
ఈ సంక్రాంతికి నా సంతోషం రెట్టింపయ్యింది. దానికి కారణం ‘వాల్తేరు వీరయ్య’లో ‘పూనకాలు లోడింగ్’, ‘వీరసింహారెడ్డి’లో ‘సుగుణ సుందరి’ హిట్ అవ్వడం. ‘డీజే టిల్లు-2’ సినిమాకు రెండు సాంగ్స్ అందిస్తున్నా.
మర్చిపోలేని ప్రశంస..
కరోనా సమయంలో నేను పాడిన ‘చేతులెత్తి మొక్కుతా చేయి చేయి కలపకురా’ పాట విని సద్గురు జగ్గీవాసుదేవ్ నన్ను అభినందించారన్న విషయం ఒకరు నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు చాలా సంతోషించాను. ‘పాటకు కావల్సిన ఎమోషన్ నీ గాత్రంలో చూపించగలవ’ని గోరటి వెంకన్న ప్రశంసించారు. నేను అమితంగా అభిమానించే వ్యక్తుల నుంచి ప్రశంసలు పొందడం... బాగా కిక్కు ఇచ్చింది.