Ram Charan Podcast: 'టాక్ ఈజీ’ షోలో రామ్‌చరణ్ ఏం చెప్పారంటే..!
ABN , First Publish Date - 2023-03-08T23:31:35+05:30 IST
‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) టీమ్ అంతా ఆస్కార్ హడావిడిలో ఉంది. రామ్‌చరణ్ దాదాపు 15 రోజులుగా అమెరికాలోనే ఉన్నారు.
‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) టీమ్ అంతా ఆస్కార్ హడావిడిలో ఉంది. రామ్‌చరణ్ దాదాపు 15 రోజులుగా అమెరికాలోనే ఉన్నారు. అక్కడి హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డు అందుకున్న ఆయన పాపులర్ టెలివిజన్ షో ‘గుడ్ మార్నింగ్ అమెరికా’లో పాల్గొని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. తాజాగా మరో పాపులర్ షోలో ఆయన పాల్గొన్నారు. బుధవారం ఆయన ‘టాక్ ఈజీ’లో (Ram charan in Talk easy show) మాట్లాడారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఆస్కార్ ప్రమోషన్స్‌తో పాటు హాలీవుడ్ ఎంట్రీ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు. డైరెక్టర్ ఆలోచన ఎలా ఉంటుందో తెలుసుకోలేకపోతే ఓ నటుడిగా సాధించింది ఏమీ లేనట్లే అని ఆయన అన్నారు. దర్శకుడు రాజమౌళి తన ఆర్టిస్ట్‌లను ‘నైస్’ అంటేనే పెద్ద ప్రశంస అని చెప్పారు. ఆయన్ని మెప్పించడం అంత సులభం కాదని అన్నారు. Ram charan about RRR)
మరో దర్శకుడు అయితే సాధ్యపడేది కాదేమో! (Rajamouli)
మేమిద్దరం ఈ సినిమా చేయడానికి ముఖ్య కారణం రాజమౌళి. ఆయన ఏం చేసినా ప్రత్యేకంగానే ఉంటుందన్నది మా అందరి నమ్మకం. మేమిద్దరం ఆయన దర్శకత్వంలో పనిచేశాం. ఆయన ప్రతిభ ఏంటో మాకు బాగా తెలుసు. తన చిత్రాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తాయి. అదే నమ్మకంతో ‘ఆర్‌ఆర్‌ఆర్’లో మేం భాగం కావాలనుకున్నాం. నా బ్రదర్ తారక్‌తో కలిసి నటించడం మాంచి కిక్ ఇచ్చింది. రాజమౌళి కాకుండా ఇంకో దర్శకుడితో అయితే ఈ కాంబినేషన్ సెట్ అయ్యేది కాదేమో. ఇత భారీ ప్రాజెక్ట్ కూడా అయ్యేది కాదు. రాజమౌళి సినిమాలో ఇద్దరు హీరోలే కాదు పది మంది ఉన్నా ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు వస్తుంది. ముఖ్యంగా ఆర్‌ఆర్‌ఆర్ కథ, అందులోని పాత్రలే మమ్మల్ని స్ర్కీన్ షేర్ చేసుకునేలా చేశాయి. ఈ చిత్రంలో నేను పోషించిన రామరాజు పాత్రలో పలు షేడ్స్ ఉంటాయి. వ్యక్తిగతంగా నాకు బాగా దగ్గరైన క్యారెక్టర్ అది. కరోనా వల్ల దాదాపు 13 నెలలు బ్రేక్ తీసుకున్నాం. లాక్‌డౌన్‌లో ఓ రోజు రాజమౌళి నాకు ఫోన్ చేయగానే ‘వావ్ నన్ను ఓ మనిషి గుర్తించారు’ అని సంబరపడ్డా. (Friendship with Tarak)
అందుకే ఇక్కడున్నాం... (RRR for oscar)
నాటు నాటు పాటను... ఉక్రెయిన్‌లో చిత్రీకరించాం. అదొక సర్‌ప్రైజ్. అసలు ఆపాటను అక్కడి షూట్ చేస్తామనుకోలేదు. మా విజ్ఞప్తిని అంగీకరించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రెసిడెన్సియల్ ప్యాలెస్‌లో చిత్రీకరణకు అనుమతి ఇచ్చారు. ‘నాటు నాటు’ పాటకు చాలా కష్టపడి డాన్స్ చేశాం. అందులోని కొన్ని స్టెప్పులకు టేకుల మీద టేకులు తీసుకున్నాం. కీరవాణి అందించిన సంగీతం ఓ అద్భుతం. అప్పుడు మేం పడిన కష్టమే ఇంత గుర్తింపు తీసుకొచ్చి ఇక్కడ ఉండేలా చేసింది. ఉక్రెయిన్ ప్రజలు మంచివారు. మా చిత్రీకరణ పూర్తైన మూడు నెలలకు ఉక్రెయిన్‌పై రష్యా యుద్థం మొదలు. అది చాలా బాధ కలిగింది.
సాధారణ వ్యక్తిగా ఉండేవారు...
నాన్న ఇంట్లో గ్లామర్ ఫీల్డ్ వ్యక్తిగా, ఓ స్టార్‌గా కాకుండా సాధారణ వ్యక్తిగా ఉండేవారు. సినిమా మ్యాగజైన్లు, అభిమానులు ఇచ్చిన బహుమతులు ఆఫీస్‌కే పరిమితం చేసేవారు. వాటిని ఇంటికే తెచ్చేవారు కాదు. నేను ఏ స్కూల్‌లో చేరినా రెండేళ్లకంటే ఎక్కువ ఉండేవాణ్ని కాదు. అలా 8 స్కూల్స్, 3 కాలేజీలు మారాను. ఆటల్లో యాక్టివ్‌గా ఉండేవాణ్ణి. దాంతో, పరీక్షల్లో మార్కులు తక్కువగా వచ్చేవి. మ్యాథ్స్, హిస్టరీ సబ్జెక్ట్స్ బాగా ఇష్టం. నా ఫ్రెండ్ రానా దగ్గుబాటి, నేను కంబైండ్ స్టడీస్ పేరుతో మా బాల్కనీలో కాసేపు గడిపి, అటు ఇటు చూసి అక్కడి నుంచి పక్కింటి పెరట్లోకి దూకేవాళ్లం. నాన్నగారు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా ఫ్యామిలీ టైమ్ మాత్రం మిస్ అయ్యేవారు కాదు.
ఆ తేడాను పోగొట్టాలి... అదే మా ప్రయత్నం... (Indian cinema)
మా దేశంలో ప్రతి రాష్ట్రానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. ప్రాంతాన్ని బట్టి భాష, సంస్కృతి మారతాయి. ప్రతి రాష్ట్రంలోనూ సినిమాలు తీస్తారు. అయితే, ఉత్తరాది, దక్షిణాది అనే మాటను పోగొట్టి, ఇండియన్ సినిమా ఒక్కటే అని చాటి చెప్పేలా రాజమౌళి సహా మేమంతా కృషి చేస్తున్నాం. మేం బాలీవుడ్‌లోకి వెళ్లాలన్నా.. హిందీ దర్శకుడు దక్షిణాదిలో సినిమా చేయాలన్నా ఒకప్పుడు అసాధ్యంగా అనిపించేది. ఇప్పుడు అలా లేదు. నాకు ‘టర్మినేటర్’, ‘గ్లాడియేటర్’, ‘బ్రేవ్‌హార్ట్’ తదితర హాలీవుడ్ చిత్రాలంటే చాలా ఇష్టం. నటుడిగా అన్ని దేశాల చిత్రాల్లో నటించాలనుంది. ప్రస్తుతానికి చర్చలు జరుగుతున్నాయి. కొన్ని నెలల్లో నా హాలీవుడ్ ఎంట్రీ వార్త వస్తుంది. జులియా రాబర్ట్స్ నా ఫేవరెట్ నటి. అతిథి పాత్రలోనైనా ఆమెతో కలిసి ఓ సినిమాలో నటించాలని కోరిక.