Ram Charan: నెపోటిజం.. ప్రతిభ లేకపోతే ప్రయాణం కష్టం!
ABN , First Publish Date - 2023-03-18T12:38:03+05:30 IST
‘మా నాన్నగారి వల్లే పరిశ్రమలోకి వచ్చాను. నాన్న సపోర్ట్ ఉన్నా ఈ పోటీ ప్రపంచంలో ఎదగాలి అంటే నా ప్రయాణాన్ని నాకు నేనుగా ముందుకు సాగించాలి.
‘‘మా నాన్నగారి వల్లే పరిశ్రమలోకి వచ్చాను. నాన్న సపోర్ట్ ఉన్నా ఈ పోటీ ప్రపంచంలో ఎదగాలి అంటే నా ప్రయాణాన్ని నాకు నేనుగా ముందుకు సాగించాలి. ప్రతిభ లేకపోతే సినిమా ఇండస్ట్రీలో ప్రయాణం అంత సులభం కాదు’’ అని గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్ అన్నారు.
శుక్రవారం సాయంత్రం అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న ఆయన ‘ఇండియా టుడే కాన్‌క్లేవ్’లో పాల్గొన్నారు. పలు అంశాలపై ఆయన మాట్లాడారు. సినిమా పరిశ్రమలో బంధుప్రీతి ఎక్కువ అంటూ ఎంతో కాలంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే? ముఖ్యంగా బాలీవుడ్‌లో ఈ అంశంపై ఎంతోమంది తారలు వివాదాలు సృష్టించారు. కొంతకాలం తర్వాత అది టాలీవుడ్‌కు కూడా చేరింది. ఇదే విషయంపై ఢిల్లీ వేదికగా రామ్‌చరణ్ (Man of masses Ram charan) మాట్లాడారు. స్టార్ హీరోకి కుమారుడిగా సినిమాల్లోకి వచ్చినా ప్రతిభ లేకపోతే ఇక్కడ ముందుకుసాగడం కష్టమని తెలిపారు. ప్రతిభ ఉంటేనే ఇండస్ట్రీ అయినా, ప్రేక్షకులైనా ప్రోత్సహిస్తారని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. (Ram Charan at India Today Conclave)
‘‘నెపోటిజం (Ram Charan About Nepotism)ఈ మాట విన్న ప్రతిసారీ నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో దీని గురించి చాలా పెద్ద చర్చ జరిగింది. బంధుప్రీతి ఉందని ఊహల్లో ఉండేవారి వల్లే ఇంత చర్చ జరుగుతోంది. చిన్నప్పటి నుంచి నాకు యాక్టింగ్ అంటే ఇష్టం. సినిమానే ఊపిరిగా తీసుకుంటూ ఎంతోమంది నిర్మాతలను కలుసూ సినిమాలు చేస్తున్నా. నా మనసుకు నచ్చిన పని చేయడం, అది ప్రేక్షకులకు, అభిమానులకు నచ్చడం వల్లే 14 ఏళ్లుగా ఇక్కడ సక్సెస్‌ఫుల్‌గా నిలబడగలిగాను’’ అని అన్నారు. భవిష్యత్తులో మీరు చేయాలనుకుంటున్న జానర్ ఏంటి అని ప్రశ్నించగా ‘స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో సినిమా చేయాలనుందని, విరాట్ కోహ్లీ బయోపిక్ తీస్తే అందులో నటించడానికి సిద్ధంగా ఉన్నానని చరణ్ చెప్పారు. (RRR)
నాన్నే పోటీ... (Dad is Competitor- Ram CHaran)
మా తరం హీరోలకు నాన్న పెద్ద పోటీగా నిలిచారు. ఇప్పుడు ఆయన వయసు 67 ఏళ్లు. ఇప్పటికీ ఎంతో ఎనర్జీగా పని చేస్తారు. తెలవారుజామున 5 గంటలకే ఆయన డే స్టార్ అవుతుంది. టైమ్‌కి సెట్‌లో ఉంటారు. ఆయన అంత యాక్టివ్‌గా, డెడికేషన్‌తో పని చేస్తుంటే నేను 10 గంటలకు నిద్రలేవడం కరెక్ట్ కాదు కదా. నాకూ నాన్నలాగే అలవాటైంది. ఈ ఏడాది నాన్న రెండు చిత్రాలు చేశారు. అందులో ‘వాల్తేరు వీరయ్య’ విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్ అయింది. రెండోది రెడీ అవుతుంది. ఆయన ఈ వయసులో కూడా అంతగా కష్టపడి పనిచేస్తుంటే మేం అంతకు మించి చేయాలి కదా! నాన్న చెప్పే ప్రతి విషయాన్ని బలంగా నమ్ముతా. ‘జయాపజయాలతోపాటు నీ కోసం పని చేసే నీ స్టాప్‌ను బాగా చూసుకో, వారిని గౌరవించు చాలు’ అని నా కెరీర్ బిగినింగ్‌లో నాన్న చెప్పారు. ఇప్పటికీ అదే పాటిస్తున్నా’’ అని అన్నారు.
ఇదే వేదికపై రామ్‌చరణ్ తన స్టాఫ్ మొత్తాన్ని పరిచయం చేశారు. 15 ఏళ్లకు పైబడి వారంతా ఆయనతోనే పని చేస్తున్నారని చెప్పుకొచ్చారు.