ఇందులో రాజీవ్ కనకాల చనిపోలేదు, బతికే వున్నాడు
ABN , First Publish Date - 2023-07-03T15:28:30+05:30 IST
'భాగ్ సాలె' ప్రీ రిలీజ్ వేడుక నిన్న జరిగింది. సుమ కనకాల ఈ ఈవెంట్ కి హోస్ట్ గా వ్యవహరించింది. చాలామంది దర్శకులు, నటులు వచ్చి ఈ సినిమా యూనిట్ సబ్యులకు విషెస్ తెలియచేసారు. ఇదే ఈవెంట్లో కాలభైరవ రాజీవ్ కనకాల గురించి ఒక రహస్యాన్ని బట్టబయలు చేసాడు.
ఇదేదో వార్త అనుకునేరు, 'భాగ్ సాలె' #BhaagSaale సినిమాలో అండీ. నిన్న 'భాగ్ సాలె' #BhaagSaale సినిమా ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఇందులో సింహ కోడూరి (SimhaKoduri) కథానాయకుడిగా చేసాడు, అతని పక్కన నేహా సోలంకి (NehaSolanki) నాయికగా నటించింది. ప్రణీత్ బ్రాహ్మాండపల్లి ( PraneethBrahmandapally) దీనికి దర్శకుడు, ఇది ఒక క్రైమ్ కామెడీ గా జులై 7 వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి (MMKeeravani) కుమారుడు కాల భైరవ (KalaBhairava) దీనికి సంగీతాన్ని సమకూర్చాడు. అయితే ఈ సినిమాలో చాలామంది నటులతో పాటు రాజీవ్ కనకాల కూడా వున్నాడు. రాజీవ్ భార్య సుమ కనకాల (SumaKanakala) ఈ ఈవెంట్ కి యాంకరింగ్ చేసింది
రాజీవ్ కనకాల (RajeevKanakala) ఈమధ్య ఏ సినిమాలో కనిపించినా, ఒకటి రెండు సన్నివేశాలు చేసాక, ఆ సినిమాలో అతని పాత్రని చంపేయటం చేస్తూ వుంటారు. చాలా సినిమాల్లో అతని పాత్ర చనిపోతూ ఉండటమే. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో 'భాగ్ సాలె' గురించి రాజీవ్ కనకాల మాట్లాడుతూ తాను పెళ్ళికి ముందు సుమని (SumaKanakala) లేపుకిపోయి పెళ్లి చేసుకుందామని అనుకున్నాను అని ఈ సందర్భంగా చెప్పాడు. సుమ తల్లిదండ్రులు పెళ్ళికి ఒప్పుకోలేదని తెలిసి, వారాసిగూడ లో తన స్నేహితుడి ఇంటి దగ్గరకి సుమని వచ్చి ఉండమని చెప్పి, తెల్లవారుజామున లేపుకుపోయి పెళ్లి చేసుకోవాలని అనుకున్నా అని, ఒక స్నేహితుడు బైక్ కూడా తీసుకున్నాను అని అప్పటి లవ్ స్టోరీ చెప్పాడు రాజీవ్. అయితే తెల్లవారిన తరువాత సుమ తల్లిదండ్రులు పెళ్లి కి ఒప్పుకున్నారు అని తెలిసి అంత అవసరం లేకుండా పోయిందని చెప్పాడు.
అయితే ఈ 'భాగ్ సాలె' సినిమా ఎందుకు చూడాలి అని అడిగితే కాల భైరవ (KalaBhairava) లేచి, సుమగారూ, ఈ సినిమాలో రాజీవ్ కనకాల చచ్చిపోరు, బతికే ఉంటారు, అని చెప్పాడు. అక్కడున్న వాళ్లంతా అది విని ఘొల్లున నవ్వారు. రాజీవ్ కనకాల దగ్గరకి దర్శకుడు ప్రణీత్ కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు, కథ చెప్పకుండా మీరు సినిమాలో చనిపోరు, చివరి వరకూ బతికే వుంటారు అని చెప్పాడు అనగానే వెంటనే రాజీవ్ కనకాల వొప్పేసికున్నాడు అని కాలభైరవ ఆ రహస్యాన్ని బట్టబయలు చేసాడు సరదాగా. రాజీవ్ కనకాల కూడా ఆ విషయాన్ని ఎంతో స్పోర్టివ్ గా తీసుకొని, అంటే నేను నా తదుపరి సినిమాలన్నీ మీరు బతికేవుంటారు అంటే ఒప్పేసుకుంటానా, అని సరదాగా అనడం కొసమెరుపు.