Allu Arjun - Prabhas : షెడ్యూళ్లతో బిజీ బిజీ

ABN , First Publish Date - 2023-11-09T12:26:25+05:30 IST

సూపర్‌సక్సెస్‌ చిత్రం పుష్ప’కు కొనసాగింపుగా పుష్ప-2 (Pushpa 2)చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం సాధించిన విజయంతో దానికి రెట్టింపు 'పుష్ప-2' ఉండేలా వర్క్‌ చేస్తున్నారు

Allu Arjun - Prabhas : షెడ్యూళ్లతో బిజీ బిజీ

సూపర్‌సక్సెస్‌ చిత్రం పుష్ప’కు కొనసాగింపుగా పుష్ప-2 (Pushpa 2)చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రం సాధించిన విజయంతో దానికి రెట్టింపు 'పుష్ప-2' ఉండేలా వర్క్‌ చేస్తున్నారు సుకుమార్‌. అంతే కాదు.. ఈ చిత్రంతో హీరో అల్లు అర్జున్ కి  ఉత్తమ నటుడిగా నేషనల్‌ అవార్డ్‌ రావడం, తెలుగు చిత్ర పరిశ్రమకు ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం ఇదే తొలిసారి కావడంతో బాధ్యత, ఒత్తిడి సుకుమార్‌పై మరింత పెరిగింది. దీంతో రెట్టింపు కష్టపడుతున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ రామోజీ ఫిల్మ్‌సిటీ లో జరుగుతోంది. ఏ సినిమాకైనా పాట, ఫైట్‌ అంటే భారీతనం ఉండాల్సిందే! ఇక జాతర నేపథ్యంలో సాగే పాటంటే జాతరలో ఉన్నంత సందడి కనిపించాల్సిందే! ప్రస్తుతం‘పుష్ప 2’ సెట్‌లో అదే జరుగుతోంది. సుమారు వెయ్యిమంది డ్యాన్సర్లపై జాతర నేపథ్యంలో సాగే పాటను తెరకెక్కిస్తున్నారు. గణేశ్‌ ఆచార్య నృత్య దర్శకత్వం వహిస్తున్నారు. నెల రోజులకు పైగా సాగే ఈ షెడ్యూల్‌లో పాటతోపాటు పోరాట ఘట్టం, కీలక సన్నివేశాల్ని కూడా తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. ‘పుష్ప’కి దీటుగా ఉండేలా ‘పుష్ప2’ చిత్రాన్ని రూపొందించడానికి సుకుమార్‌. శాయశక్తులా కృషి చేస్తున్నారు. అల్లు అర్జున్‌, రష్మిక జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్ట్‌ 15న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.

సలార్‌ (Salaar) స్పెషల్‌ సాంగ్‌.. ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న పాన్ఇండియా చిత్రం ‘సలార్‌’.. సినిమా షూటింగ్‌ కూడా రామోజీ ఫిల్మ్‌సిటీలోనే జరుగుతోంది. సిమ్రత్‌కౌర్‌ తదితరులపై ఓ ప్రత్యేక గీతాన్ని రూపొందిస్తున్నారు. రాజు సుందరం నృత్య దర్శకత్వం వహిస్తున్న ఈ పాట అదిరిపోయేలా ఉంటుందని చిత్ర వర్గాల నుంచి సమాచారం. ప్రశాంత్  నీల్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్‌ నిర్మిస్తోంది. శ్రుతిహాసన్‌ కథానాయిక. డిసెంబరు 22న ఈ సినిమా విడుదల కానుంది.

Updated Date - 2023-11-09T12:42:21+05:30 IST