Daggubati: ఈ సినిమా కూడా మళ్ళీ విడుదల చేస్తున్నారు.. అయినా ఇప్పుడు చూస్తారా..
ABN , First Publish Date - 2023-06-14T17:03:54+05:30 IST
తరుణ్ భాస్కర్ కి 'పెళ్లి చూపులు' అనే సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది. అలాగే ఈ సినిమా విజయ్ దేవరకొండకి కూడా బ్రేక్ ఇచ్చింది. ఆ తరువాత తరుణ్ భాస్కర్ ఇంకో సినిమా కూడా చేసాడు, ఆ సినిమా అప్పట్లో యావరేజ్ అన్నారు, హిట్ అన్నారు, ఏదయితేనేమి ఇప్పుడు ఆ సినిమా మళ్ళీ విడుదల చేస్తున్నారు
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఒక ట్రెండ్ నడుస్తోంది. ప్రతి స్టార్ పుట్టినరోజునాడో, లేదా పలానా సినిమా ఇన్ని సంవత్సరాలు పూర్తి చేసిందనో ఆ స్టార్ సినిమాని మళ్ళీ ఇప్పుడు విడుదల చేస్తున్నారు. ఆలా విడుదల అయిన సినిమాల్లో 'పోకిరి' (Pokiri), 'ఒక్కడు' (Okkadu), 'జల్సా' (Jalsa), 'ఖుషి', 'ఆరంజ్' (Orange), 'ఆది', 'సింహాద్రి' (Simhadri), 'బిల్లా', 'రెడీ', 'నరసింహనాయుడు' (NarasimhaNaidu) ఇలా చాలా సినిమాలు వున్నాయి. అయితే అందులో చాలామటుకు అగ్ర నటుల సినిమాలే ఉండటంతో వాటికి కొంచెం ఓపెనింగ్స్ వచ్చాయి. ఈమధ్య కృష్ణగారి (SuperstarKrishna) పుట్టినరోజు సందర్భంగా 52 ఏళ్ల క్రితం నాటి 'మోసగాళ్లకు మోసగాడు' (MosagallakuMosagadu) సినిమా కూడా విడుదల అయింది.
ఇది ఇప్పుడు ట్రెండ్ గా మారింది. ఐదేళ్లు పూర్తయిన సినిమాలు కూడా ఇప్పుడు మళ్ళీ విడుదల చేస్తున్నారు. అలాంటి కోవలోకే వస్తుంది 'ఈ నగరానికి ఏమైంది' (EeNagaranikiEmaindi). దీనికి దర్శకుడు తరుణ్ భాస్కర్ (TharunBhaskar) అయితే ఇందులో కథానాయకుడిగా విశ్వక్ సేన్ (VishwakSen) నటించాడు. మిగతా పాత్రల్లో అభినవ్, వెంకటేష్, సాయి సుశాంత్ అతని మిత్రలుగా కనిపిస్తారు. ఈ సినిమా కథ స్నేహం నేపథ్యంలో వచ్చింది. ఈ సినిమాని ఇప్పుడు మళ్ళీ థియేటర్స్ లో విడుదల చేస్తున్నారు. జూన్ 29 కి ఈ సినిమా ఐదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా 'ఈ నగరానికి ఏమైంది' థియేటర్లలో మళ్ళీ విడుదల చేస్తున్నట్టు సురేష్ ప్రొడక్షన్స్ (SureshProductions) సంస్థ ట్విట్టర్ లో ప్రకటించింది. ఈ సినిమాకి నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు (DSureshBabu).
ఈ సినిమా విడుదల అయినప్పుడు అంతగా టాక్ రాలేదు కానీ, తరువాత ఈ సినిమా బాగుంది అని అన్నారు. 'పెళ్లి చూపులు' తరువాత దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమా చేసాడు. అయితే 'పెళ్లి చూపులు' ఇచ్చినంత బ్రేక్ ఈ సినిమా ఇవ్వలేదనే చెప్పాలి, కానీ సినిమా అయితే బాగుందని అన్నారు. తరుణ్ ప్రస్తుతం ‘కీడా కోలా’ సినిమా కోసం పనిచేస్తున్నారు.