Hanuman: థియేటర్స్ కోసం ఫైట్ చేస్తున్నాం, విడుదల తేదీ మేమే ముందు ప్రకటించాం: ప్రశాంత్
ABN , Publish Date - Dec 19 , 2023 | 03:13 PM
'హనుమాన్' దర్శకుడు ప్రశాంత్ వర్మ ఎందుకు జనవరి 12న విడుదల చెయ్యాల్సి వస్తోంది అనే విషయం మీద వివరణ ఇచ్చారు. తన సినిమాలో స్టార్స్ లేరని, కానీ హనుమంతుడు పాన్ వరల్డ్ స్టార్ అని, అతనే సినిమాని ముందుకు తీసుకు వెళతారన్న నమ్మకం ఉందని చెప్పారు. తన ఫెవరేట్ యాక్టర్ మహేష్ బాబు అని చెపుతూ, అతని సినిమా 'గుంటూరు కారం'తో పోటీ కాదని చెప్పారు.
ప్రశాంత్ వర్మ (PrashanthVarma) దర్శకత్వంలో ఒక ఫాంటసీ మూవీ 'హనుమాన్' #Hanuman జనవరి 12 న సంక్రాంతి పండగ సందర్భంగా విడుదలవుతోంది. అయితే అదేరోజు సూపర్ స్టార్ మహేష్ బాబు (MaheshBabu) సినిమా 'గుంటూరు కారం' #GunturKaaram కూడా విడుదలవుతోంది. 'హనుమాన్' చిన్న సినిమా కదా, ఒకరోజు ముందు వెనక విడుదల చేసుంటే థియేటర్స్ దొరికేవి, కలెక్షన్స్ కూడా బాగుండేవి కదా అని అడిగితే, ప్రశాంత్ వర్మ దానికి జనవరి 12 వ తేదీ మేమె ముందు ప్రకటించాం. అప్పటికి ఏ సినిమా కూడా విడుదల తేదీ ప్రకటించలేదు అని చెప్పారు.
అయితే ఈ చర్చ మా దగ్గరికీ కూడా వచ్చిందని చెప్పారు ప్రశాంత్. పెద్ద సినిమా వస్తోంది, మీ సినిమా కూడా ఎందుకు సంక్రాంతికే అని ఒక చర్చ నడుస్తోంది. కానీ 'హనుమాన్' లాంటి సినిమా సంక్రాంతి లాంటి పండగనాడే విడుదలైతే బాగుంటుంది అని మేము నమ్మాము అని చెప్పారు ప్రశాంత్ వర్మ. ఆలా అంటూనే తెలుగులో థియేటర్స్ విషయంలో ఇంకా ఫైట్ చేస్తున్నాం అని చెపుతున్నారు. ఈ సినిమా ఇతర భాషలతో పాటు హిందీలో కూడా విడుదలవుతోంది. 'హిందీలో మా సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది, తెలుగులో 400 థియేటర్స్ లో అనుకుంటే, హిందీలో 1500 థియేటర్స్ లో విడుదలవుతోంది," అని చెప్పారు.
మాది చిన్న సినిమా, మా సినిమాలో స్టార్స్ లేరు, మేమందరం కూడా చాలా చిన్నవాళ్ళమే, కానీ మా దగ్గరున్న ఒకే ఒక స్టార్ హనుమంతుడు, అతను పాన్ ఇండియా స్టార్ కాదు, పాన్ వరల్డ్ స్టార్, ఆ నమ్మకంతోటె మా శాయశక్తులా కష్టపడి, జనవరి 12న విడుదల చెయ్యడానికి ప్రయత్నాలు చేస్తున్నాము అని చెప్పారు.
తేదీ వెనక్కి ముందుకి జరపడానికి వీలు కాదని చెపుతూ, అందుకు కారణాలు కూడా చెప్పారు ప్రశాంత్. జనవరి 12 విడుదల తేదీ ప్రకటించిన తరువాత ఇతర భాషల్లో, ముఖ్యంగా హిందీ భాషకి ఒప్పందాలు కుదిరిపోయాయి. అందుకని విడుదల తేదీ మార్చడానికి అవకాశం లేదు అని చెప్పారు ప్రశాంత్. అయితే తన ఫెవరెట్ నటుడు మహేష్ బాబు అని, అతనంటే ఎంతో ఇష్టమని కూడా చెప్పారు ప్రశాంత్ వర్మ. 'నేను కూడా ముందుగా మహేష్ బాబు గారి సినిమానే చూస్తాను,' అని చెప్పారు.
ఇక్కడ ఇంకొక విషయాన్నీ కూడా చెప్పారు ప్రశాంత్. తన సినిమా కలెక్షన్స్ మొదటి రోజు, లేదా రెండు మూడు రోజుల మీద ఆధారపడి చేసే సినిమా కాదని, ఎందుకంటే మా సినిమా ఎక్కువరోజులు ఆడుతుంది అని అనుకుంటున్నాం అని చెప్పారు. "మొదటి రోజు ఎన్ని థియేటర్స్ లో విడుదల చేస్తున్నాం అన్నది కాదు ప్రశ్న, ఎన్నిరోజులు మా ప్రయాణం సాగుతుంది అన్నది మా నమ్మకం. మా హనుమంతుడిని చూడటానికి ప్రేక్షకులు తప్పకుండా వస్తారు, మళ్ళీ మళ్ళీ చూస్తారు," అని చెప్పారు ప్రశాంత్.