Pawan Kalyan: మహేష్, రాజమౌళి సినిమా మన సినిమా స్థాయిని మరింత పెంచాలి: పవన్ కళ్యాణ్
ABN , First Publish Date - 2023-07-26T10:35:35+05:30 IST
పవన్ కళ్యాణ్ భేషజం లేని మనిషి, ముక్కు సూటిగా మాట్లాడే వ్యక్తి, మనసులో ఏదీ దాచుకోకుండా మనసుకు ఏది నచ్చితే అది మాట్లాడే వ్యక్తి. నిన్న 'బ్రో' ప్రీ రిలీజ్ వేడుకలో తన మనసులోని భావాలను, ఇతర నటుల గురించి, అలాగే తెలుగు సినిమా గురించి అతను మాట్లాడిన తీరు అతని అభిమానులనే కాదు, తెలుగు సినిమా ప్రేక్షకుల మనసులు కూడా హత్తుకున్నాయి.
పవన్ కళ్యాణ్ (PawanKalyan), సాయి ధరమ్ తేజ్ (SaiDharamTej) నటిస్తున్న 'బ్రో' #Bro సినిమా ఇంకో రెండు రోజుల్లో థియేటర్స్ లో విడుదల అవుతోంది. సముద్రఖని (Samuthirakani) దీనికి దర్శకుడు కాగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ (TrivikramSrinivas) మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక నిన్న హైదరాబాద్ లోని శిల్పకళాలావేదికలో జరిగింది. ఈ చిత్ర యూనిట్ తో పాటు, పవన్ కళ్యాణ్ కూడా ఈ వేడుకకు హాజరయి తనదైన స్టైల్ లో మాట్లాడి అందరినీ అక్కట్టుకున్నారు.
అదే సమయంలో మన తెలుగు పరిశ్రమలో ప్రతి ఒక్క అగ్ర నటుడు గురించి ప్రస్తావిస్తూ వాళ్లందరితోనూ నేను చాలా స్నేహంగా వుంటాను అని, వాళ్ళందరూ అంటే ఇష్టమని, అలాగే వాళ్ళ సినిమాలు చాలా బాగా ఆడాలని అన్నారు. "జూనియర్ ఎన్టీఆర్ (JrNTR) గారిలా, రామ్ చరణ్ (RamCharan) లాగా నేను గొప్పగా డ్యాన్స్ లు చేయలేకపోవచ్చు. ప్రభాస్ (Prabhas) గారిలా, రానా (RanaDaggubati) గారిలా సంవత్సరాలు కష్టపడి చేయలేకపోవచ్చు. కానీ సినిమా అంటే ప్రేమ నాకు, సమాజం అంటే బాధ్యత," అని చెప్పారు పవన్ కళ్యాణ్. ఈ సినిమాలో పదిమందికి పనికొచ్చే మాటలు వుంటాయని చెప్పారు.
దర్శకుడు రాజమౌళి (Rajamouli) ని మన తెలుగు సినిమా హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లిన ఘనత వున్నవాడు, అందుకని అతన్ని ఎంతో ప్రశంసించారు పవన్ కళ్యాణ్. అలాగే మహేష్ బాబుతో (MaheshBabu) రాజమౌళి చెయ్యబోయే సినిమా ఇంకా పెద్ద స్థాయికి వెళ్లాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పారు. "రాజమౌళి గారు మన పరిశ్రమని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లారు. మహేష్ బాబు గారితో ఆయన చేసే సినిమా మన స్థాయిని మరింత పెంచాలి. దీనిని కొత్తగా వచ్చేవాళ్ళు కొనసాగించాలి. నాకు అందరూ హీరోలు ఇష్టం. వారివల్ల ఎందరో కడుపు నిండుతుంది," అని చెప్పారు పవన్ కళ్యాణ్. అందరూ బాగుండాలని కోరుకుంటూనే, నా సినిమా అందరి సినిమాల కన్నా పెద్ద హిట్ కొట్టాలని కసిగా పని చేస్తాను అని చెప్పారు. "పనిలో పోటీ ఉండాలి, లేకపోతే మనం చేస్తున్న పని మీద శ్రద్ధ ఉండదు. అందుకే నా సినిమాలు అందరి సినిమాలు కన్నా పెద్ద హిట్ కొత్తలు అని పని చేస్తాను. అందరూ అలాగే పనిచేయాలి. అప్పుడే పరిశ్రమ బాగుంటుంది," అని చెప్పారు పవన్ కళ్యాణ్.