ఒళ్ళు దగ్గరపెట్టుకొని సినిమాలు తీయాలి: నిర్మాత సుధాకర్ రెడ్డి
ABN , First Publish Date - 2023-12-02T16:36:27+05:30 IST
ఓటిటి ప్లాట్ ఫారమ్స్ ఇంతకు ముందులా తెలుగుసినిమాలని ఎక్కువ డబ్బులిచ్చి కొనుక్కోవటం లేదని, అందుకని నిర్మాతలు అందరూ చాలా జాగ్రత్తగా అనవసర ఖర్చులకి పోకుండా సినిమాలు తీయాలని నిర్మాత సుధాకర్ రెడ్డి చెప్పారు.
ఇంతకు ముందులా ఓటిటి ప్లాట్ ఫారమ్స్ తెలుగు సినిమాలని ఎక్కువ డబ్బులిచ్చి కొనడం లేదని పరిశ్రమలో ఒక వార్త వినపడుతోంది. ఇంతవరకు ఓటిటి, శాటిలైట్ హక్కుల ద్వారా ఎటువంటి సినిమా చేసినా నిర్మాత మంచిగా లాభాలు పొందుతూ ఉండేవాడు, కానీ ఇప్పుడు ఆ పద్ధతి మారిపోయింది అని అంటున్నారు. సినిమా విడుదలయ్యాక బాగుంటేనే ఆ సినిమాని కొనాలి అని ఓటిటి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారని, అందువలన ఇప్పుడు సినిమా చాలా జాగ్రత్తగా తీయాల్సి ఉందని కూడా వార్త వినిపిస్తోంది.
అదే విషయాన్ని 'ఎక్స్‌ట్రా-ఆర్డినరీ మ్యాన్' #ExtraOrdinaryMan నిర్మాత సుధాకర్ రెడ్డి ని అడిగినప్పుడు, అతను అది కరెక్ట్ అనే సమాధానం ఇచ్చారు. ఓటిటి కి సంవత్సరానికి 12 సినిమాలు అవసరం అవుతాయని, అవి తీసుకున్నాక ఇక మిగతా సినిమాలని పట్టించుకోవటం లేదని, ఓటిటి స్ట్రీమింగ్ హక్కుల ద్వారా వచ్చే ఆదాయం నిర్మాతకి ఇప్పుడు బాగా పడిపోయిందని అన్నారు సుధాకర్ రెడ్డి. ఉదాహరణకు తన కుమారుడు నితిన్ సినిమాని ఇంతకు రూ 30 కోట్లకు కుంటే ఇప్పుడు రూ.25 కోట్లు ఇస్తామంటున్నారని, ఇంకా కిందకి పడిపోవచ్చని, అందుకని తనతో సహా అందరి నిర్మాతలు చాలా జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకుని సినిమాలు తీయాల్సి ఉందని అన్నారు.
"ఇప్పుడున్న స్టార్స్ అంతమందికి ఇది ఇబ్బంది అవుతుంది. ఇది బ్యూటిఫుల్ ఇండస్ట్రీ, ఎవరికీ హాని చెయ్యదు. నిర్మాతలు అందరూ బడ్జెట్ తగ్గించుకొని, అనవసర ఖర్చులు పెట్టకుండా చేసుకుంటే మంచిది. మనమే హైప్ చేసుకుంటాం, మనమే పెంచుకుంటా, మనమే పోతాం అంటే చేసేది లేదు. తప్పనిసరిగా అందరూ నిర్మాతలు తగ్గించి జాగ్రత్తగా చెయ్యాలి, అది పరిశ్రమ అభివృద్ధికి కూడా ఉపయోగపడుతుంది," అని చెప్పారు సుధాకర్ రెడ్డి.