Nagarjuna: అక్కినేని ఇంట్లో విషాదం, నాగార్జున సోదరి కన్నుమూత
ABN , First Publish Date - 2023-10-18T19:32:59+05:30 IST
స్వర్గీయ అక్కినేని నాగేశ్వర రావు, అన్నపూర్ణ దంపతుల కుమార్తె నాగ సరోజ కన్ను మూసారు. ఈమె ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జునకి సోదరి. కొంత కాలంగా అనారోగ్యంగా వున్న ఆమె మంగళవారం మరణించినట్టుగా ఆలస్యంగా తెలిసింది.
అక్కినేని ఇంట్లో విషాదం నెలకొంది. దివంగత అక్కినేని నాగేశ్వర రావు (AkkineniNageswaraRao) కుమార్తె, నాగార్జున (AkkineniNagarjuna) సోదరి అయిన నాగ సరోజ (NagaSaroja) కన్నుమూశారు. ఈ వార్త కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్టుగా తెలిసింది. సరోజ మంగళవారం కన్ను మూసినట్టుగా తెలిసింది. ఈమధ్యనే సరోజ తన తండ్రి స్వర్గీయ నాగేశ్వర రావు గారి శత జయంతి సందర్భంగా అక్కినేని విగ్రహావిష్కరణ అన్నపూర్ణ స్టూడియోలో జరిగినప్పుడు ఆ సభలో సరోజ కనిపించినట్టుగా చెపుతున్నారు. Akkineni Nagarjuna's sister Naga Saroja passed away.
అక్కినేని నాగేశ్వర రావు, అన్నపూర్ణ దంపతులకు అయిదుగురు సంతానం, వెంకట రత్నం, నాగార్జున, సత్యవతి, నాగ సుశీల (NagaSuseela), నాగ సరోజ. అయితే సరోజ ఎప్పుడూ బయటకి రారు, ఏదైనా ముఖ్యమైన వేడుక అక్కినేని ఇంట్లో అయితే తప్ప ఆమె స్వతహాగా రారు. మిగతా అందరూ, వెంకట్, నాగ సుశీల, నాగార్జున చిత్ర పరిశ్రమతో సంబంధం వున్నవాళ్లు కాబట్టి ఎక్కువ కనపడుతూ వుంటారు. నాగ సుశీల కుమారుడే నటుడు సుశాంత్. అలాగే నాగ సుశీల కొన్ని సినిమాలు కూడా నిర్మించారు.
నటుడు సుమంత్ (Sumanth), సుప్రియల (SupriyaYarlagadda) తల్లి సత్యవతి చాలా ఏళ్ల క్రితమే స్వర్గస్తులయ్యారు. నాగ సరోజ కూడా ఈమధ్య కొంచెం అనారోగ్యంతో వున్నట్టుగా తెలుస్తోంది. ఆ అనారోగ్యం కారణంగానే ఆమె మంగళవారం కన్నుమూసినట్టుగా తెలుస్తోంది. ఆమె ఎక్కువగా బయటకి రాకపోవటం వలన, ఆమె పేరు కూడా ఎక్కువగా వినబడకపోవటం వలన, ఆమె మరణం కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆమెకి వివాహం అయినట్టుగా లేదు.