Indra: దశాబ్దం తర్వాత.. టీవీలోకి మెగాస్టార్ బ్లాక్‌బస్టర్ మూవీ
ABN , First Publish Date - 2023-12-14T15:49:29+05:30 IST
మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్‌బస్టర్ ఇంద్ర సినిమా టీవీ ప్రేక్షకులను అలరించనుంది. దాదాపు దశాబ్దం (2014) తర్వాత టీవీ ఛానల్‌లో ప్రసారానికి వస్తుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) నటించిన బ్లాక్‌బస్టర్ సినిమా ఇంద్ర (Indra) ఎట్టకేలకు టీవీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. దాదాపు దశాబ్దం (2014) తర్వాత టీవీ ఛానల్‌లో ప్రసారానికి వస్తుండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2002 జూలై 24న విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. రూ10 కోట్లతో నిర్మించబడ్డ ఈ చిత్రం రూ.80 కోట్ల వరకు రాబట్టి ఉమ్మడి ఆంద్రప్రదేశ్‌లో హయ్యెస్గ్ గ్రాస్ వసూలు చేసిన చిత్రంగా రికార్డుల కెక్కింది.
ముఖ్యంగా ‘వీర శంకర్‌రెడ్డి మొక్కే కదా అని పీకేయాలని చూస్తే పీక కోస్తా, కాశీకి వెళ్ళాడు, కాషాయం వాడయ్యాడు అనుకున్నారా, వారణాసికి వెళ్ళాడు, తన వరస మార్చుకొన్నాడు అనుకొన్నారా? అదే రక్తం, అదే పౌరుషం. సై అంటే సెకనుకొక తల తీసుకెళతా, తప్పు నా వైపు ఉంది కాబట్టి తలవంచుకుని పోతున్నాను. అదే నీ వైపు ఉండి ఉంటే ఇక్కడి నుంచి తలలు తీసుకెళ్లేవాడిని. సింహాసనంపై కూర్చుండే హక్కు అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్ర సేనా రెడ్డి ది, దాయి దాయి వదామ్మాలో పాటలో వీణ స్టైప్పు’ వంటివి ఈ సినిమాలో డైలాగ్స్ ఇప్పటికీ మనం ఎక్కడో ఓ చోట వింటూనే ఉన్నామంటే ఈ సినిమా ఎంత ఫేమసో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు.
అయితే ఆ తర్వాత జెమిని టీవీ (Gemini TV) ఈ చిత్రం శాటిలైట్ రెట్స్ దక్కించు కోగా రెండు మూడు సార్లు మాత్రమే టెలికాస్ట్ చేసింది. 2014 తర్వాత అసలు ఆ సినిమాను ప్రసారం చేయలేదు. ఇప్పుడు ఆ సినిమా రైట్స్‌ను జీ తెలుగు ఛానల్ (ZeeTelugu ) జెమినీ టీవీ నుంచి కొనుగోలు చేయడంతో ఈ సినిమా మరోసారి చర్చలోకి వచ్చింది. ఈ క్రమంలో సదరు జీ తెలుగు (ZeeTelugu ) ఛానల్ ఈ సినిమాను ఈ ఆదివారం (17.12.2023) టీవీలో ప్రసారం చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
దీంతో ఈ సినిమా దాదాపు దశాబ్ధం తర్వాత టీవీలో ప్రసారం కానుండడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ వార్త బాగా వైరల్ అవుతున్నది.ఈ ఆదివారం టీఆర్‌పీ రేటింగ్స్ బద్దలు కావాల్సిందే అంటూ అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. చూడాలి ఇన్నేళ్ల తర్వాత టీవీలోకి వస్తున్నందుకు ఏ మేర సంచలనాలు సృష్టిస్తుందో.
ఈ సినిమాతో చిరంజీవి, లారెన్స్‌లు నంది, ఫిలింపేర్, సిని మా ఆవార్డులు సైతం దక్కించుకున్నారు. తెలుగులో బ్లాక్‌బస్టర్, ఇండస్ట్రీ హిట్‌గా నిలిచిన ఈ సినిమాను తర్వాత ఇందిరన్‌గా తమిళంలోకి ఇంద్ర: ది టైగర్‌గా హిందీ భాషలలో డబ్ చేసి విడుదల చేయగా మంచి కలెక్షన్లు రాబట్టింది. ఆ తర్వాత ఈ సినిమా ఇంద్ర ఏక్ షేర్‌గా భోజ్‌పురిలోకి , దాదా (2005)గా ఇంద్ర భారతీయ బెంగాలీలో, గోరిబర్ దాదా (2006)గా బంగ్లాదేశ్‌లో పునర్నిర్మించబడి అక్కడా ఇండస్ట్రీ హిట్స్‌గా నిలవడం గమనార్హం.