Hyper Aadi: అన్నయ్య మంచోడు కాబట్టి ముంచేశారు.. తమ్ముడు మొండోడు ముంచడాలుండవ్.. తేల్చుకోవడాలే!
ABN , First Publish Date - 2023-08-07T12:07:28+05:30 IST
చిరంజీవి నటుడిగా కెరీర్ బిగినింగ్ మొదలుపెట్టింది మొదలు, స్టార్‌గా ఎదగడం, రాజకీయ పార్టీలో ఎదురైన దెబ్బలు, మళ్లీ సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చి తన స్టార్ స్టాటస్‌ని నిలబెట్టుకున్న తీరు వరకూ ఏదీ వదలకుండా చిరంజీవిని విమర్శించిన వాళ్లకు గట్టి కౌంటర్ ఇచ్చారు హైపర్ అది. ఆదివారం శిల్పకళావేదికలో జరిగిన ‘భోళా శంకర్’ ప్రీ రిలీజ్ వేడుక వేదికగా ఆయన మాట్లాడతూ
అన్నయ్య ఇంద్రసేనాని... తమ్ముడు జనసేనాని
అన్నయ్య మీద తమ్ముడికి ఉన్న ప్రేమ ఎలాంటిదంటే..
గుర్తు పెట్టుకొని వడ్డీతో సహా ఇచ్చేస్తాడు.
‘బిగ్గర్ దేన్ బచ్చన్’ మ్యాగజైన్ చదువుకోండి..
నిజజీవితంలో ఆయనకు బాగా నచ్చిన పదం క్షమించడం
చరణ్‌పై నోరెత్తిన వాళ్లు చేతులెత్తి చప్పట్లు కొట్టారు
గ్లోబల్‌స్టార్ అని పెట్టుకుంటే వచ్చింది కాదు
ఎలక్షన్లు గురించి కాకుండా కలెక్షన్ల గురించి మాట్లాడుతున్నారు..
- హైపర్ ఆది కామెంట్స్
చిరంజీవి (Chiranjeevi) నటుడిగా కెరీర్ బిగినింగ్ మొదలుపెట్టింది మొదలు, స్టార్‌గా ఎదగడం, రాజకీయ పార్టీలో ఎదురైన దెబ్బలు, మళ్లీ సినిమాల్లో రీఎంట్రీ ఇచ్చి తన స్టార్ స్టాటస్‌ని నిలబెట్టుకున్న తీరు వరకూ ఏదీ వదలకుండా చిరంజీవిని విమర్శించిన వాళ్లకు గట్టి కౌంటర్ ఇచ్చారు హైపర్ అది(Hyper aadi setires). ఆదివారం శిల్పకళావేదికలో జరిగిన ‘భోళా శంకర్’ (Bhola Shankar) ప్రీ రిలీజ్ వేడుక వేదికగా ఆయన మాట్లాడతూ ‘‘సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఓ యువకుడు సైనికుడిగా యుద్ధభూమిలో అడుగుపెట్టాడు. అప్పటికే అక్కడ కండలు తిరిగిన యుద్ధవీరులెందరో ఉన్నారు. వాళ్ల యుద్ధం చేస్తున్నారు.. ఈయన చూస్తున్నాడు. ఓ రోజు ఈయనకి యుద్ధం చేసే సమయం వచ్చింది. యుద్దం చేశాడు. అందరూ కలిసి అతన్ని సైన్యాధిపతిగా ప్రకటించారు. ఒక 30 ఏళ్లు యుద్ధభూమిని ఏలాడు. ఆ యుద్ధభూమి సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీ. ఆ సైనికుడే చిరంజీవి. అన్నయ్య ఇంతమంది సినీ సైన్యాన్ని తయారు చేసిన ఇంద్రసేనాని అయితే.. అక్కడ తమ్ముడు జనసైన్యాన్ని తయరు చేసి జనసేనాని అయ్యాడు. మామూలుగా హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు. కానీ చిరంజీవి గారికి హీరోలే పెద్ద ఫ్యాన్స్. ఆస్తులు సంపాదించడం కన్నా అభిమానుల్ని సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న హీరో మెగాస్టార్. పాత తరానికి, కొత్త తరానికి వారధిగా నిలిచారు. కోట్ల మంది అభిమానులకు సారధి మెగాస్టార్. ప్రతి ఇంట్లో ఫ్యాన్ ఉంటాదో లేదో తెలీదు కానీ ఇంటికో చిరంజీవి ఫ్యాన్ అయితే పక్కాగా ఉంటాడు. నా దృష్టిలో చిరంజీవిగారు, సచిన్ ఇద్దరూ ఒకటే. సచిన్‌ని విమర్శిస్తే నోటితో సమాధానం చెప్పకుండా బ్యాట్‌తో సమాధానం చెబుతాడు. అలాగే చిరంజీవిగారు తన సినిమాతో జవాబు ఇస్తారు. ‘ఆచార్య’ చిత్రానికి విమర్శలొచ్చాయి. ‘వాల్త్తేరు వీరయ్య’ చిత్రంతో సమాధానం ఇచ్చారు. ఈ జనరేషన్ హీరోలంతా డాన్స్, ఫైట్లు ఇరగదీస్తారు. ఆ డాన్స్, ఫైట్స్‌కు మార్క్ సెట్ చేసింది చిరంజీవి. రెమ్యునరేషన్ విషయంలోనూ తనదైన మార్క్ చేశారు చిరంజీవి. వెనక్కి వెళ్లి చూసుకుంటే ఈజీగా తెలిసిపోతుంది. కోటి రూపాయలు పారితోషికం తీసుకున్న హీరో ఎవరని గూగుల్ చేస్తే చిరంజీవి పేరు వస్తుంది. ‘బిగ్గర్ దేన్ బచ్చన్’ అని మ్యాగజైన్ ఉంది వెళ్లి చదువుకోండి. ఫస్ట్ పది కోట్లు కలెక్ట్ చేసిన సినిమా ఏదని అడగండి ‘ఘరానా మొగుడు’ అని చెబుతారు. ఇక్కడున్న చాలామందికి ఊహ తెలియకముందే ఊహించని రికార్డులు కొట్టి చూపించారు చిరంజీవి.
క్షమించాడు.. క్షమిస్తూనే ఉన్నాడు..
అలాంటి మెగాస్టార్‌ని ఎదగకముందు అవమానించారు. ఎదిగిన తర్వాత అవమానించారు. ఎదగకముందు ఎదురు తిరిగి మాట్లాడటానికి అప్పటి పరిస్థితులు అడ్డొచ్చాయి. ఎదిగిన తర్వాత మాట్లాడటానికి ఆయన సంస్కారం అడ్డొచ్చింది. అందుకే ఎవర్నీ ఆయన ఏమీ అనలేదు. ‘ఠాగూర్’ సినిమాలో ఆయనకు నచ్చని పదం క్షమించడం. నిజజీవితంలో ఆయనకు బాగా నచ్చిన పదం క్షమించడం. ఎంతోమందిని క్షమించేశాడు.. క్షమిస్తూనే ఉన్నాడు. కోడిగుడ్డు విసిరిన వాడిమీద, ఓటు హక్కు వినియోగించుకునే సమయంలో లైన్ క్రాస్ చేసి మాట్లాడిన ఎన్‌ఆర్‌ఐని క్షమించాడు. కొన్ని వేలమందికి ప్రవచనాలు చెప్పే వ్యక్తి, కొన్నికోట్ల మంది అభిమానించే వ్యక్తిపై అసహనం ప్రదర్శించిన సమయంలోనూ చిరంజవి సహనం కోల్పోలేదు. సజావుగా ఆ సభ జరిగేలా ఆయన పక్కనే కూర్చున్నారు. హీరో సుమన్, ఉదయ్‌కిరణ్ విషయంలోనూ కొన్ని యూట్యూబ్ ఛానళ్లు అసత్య ప్రచారాలు ఇప్పటికీ చేస్తూ ఓ రూపాయి సంపాదించుకుంటున్నారు. కష్టపడి సంపాదించుకోవాలి కానీ కష్టపడే వాళ్ల మీద పడి సంపాదించుకోకూడదని అలాంటి వాళ్లు తెలుసుకోవాలి. ఏ ప్రభుత్వాలు అయితే చిరంజీవిగారు బ్లడ్ బ్యాంక్ ద్వారా చేసిన సేవలకు అవార్డులు ఇచ్చాయో.. అదే ప్రభుత్వాలు ఆయన రాజకీయాల్లోకి వచ్చినప్పుడు విమర్శించాయి. అవన్నీ సహించాడు.. భరించాడు.
మరోరకం శాడిస్టులుంటారు... వాళ్లు ఎలా ఉంటారంటే..
చిరంజీవిగారి వారసుడు రామ్‌చరణ్ చిత్రంతో హీరోగా పరిచయం అవుతుంటే ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. హిట్టైతే డైరెక్టర్ వల్ల, ఫ్లాప్ అయితే చరణ్ వల్ల అని కామెంట్లు చేశారు. అప్పుడు వచ్చింది ‘రంగస్థలం’ అనే సినిమా. అది చూసి అప్పుడు నోరెత్తిన వాళ్లు చేతులెత్తి చప్పట్లు కొట్టారు. కామెంట్లు చేసిన వాళ్లు కామ్‌గా చూస్తూ ఉండిపోయారు. సచిన్ కొడుకు సచిన్ కాలేదు.. అమితాబ్ కొడుకు అమితాబ్ బచ్చన్ అవ్వలేదు. కానీ చిరంజీవి కొడుకు చిరంజీవి అయ్యాడు. కొణిదెల వెంకట్రావ్ గారికి చిరంజీవి ఎంత పేరు తెచ్చారో... రామ్‌చరణ్ అంతకుమించి చిరంజీవిగారికి పేరు తీసుకొచ్చాడు. మెగాస్టార్, పవర్‌స్టార్ కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి మెగాపవర్‌స్టార్ అనే పేరు పెట్టుకున్నారు అనుకోవచ్చు. కానీ గ్లోబల్‌స్టార్ అని పెట్టుకుంటే వచ్చింది కాదు. ఇక్కడున్న హీరోలందరినీ తట్టుకొని, ఎంత ఎత్తుకు ఎదిగినా చేతులు కట్టుకుని ఉన్నాడు కాబట్టే ఈరోజు గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్.
మూడో రకం... తెలివైనా శాడిస్టులు
అన్నయ్యని పొగిడేసి.. తమ్ముణ్ణి తిట్టిపోస్తుంటారు. తెలివైన శాడిస్టులు వీళ్లంతా. తమ్ముడిని తిట్టి అన్నయ్యను పొగిడితే సంతోషపడే వ్యక్తా? చిరంజీవి. ‘భోళా శంకర్’ సెట్‌లో రాజకీయాలు గురించి ఆయన్ను ఓ మాట అడిగా. ‘నేను పొలిటికల్ న్యూస్ చూడట్లేదు’ ఆది అన్నాడాయన. ఎందుకన్నాయ్యా అంటే ‘నా తమ్ముణ్ణి ఎవడు పడితే వాడు తిడుతుంటే అవి చూసి నేను సహించలేకపోతున్నా’ అని చెప్పారు. అది తమ్ముడి మీద అన్నయ్యకు ఉన్న ప్రేమ. తమ్ముడికి అన్నయ్యపై ఎంత ప్రేమ ఉందంటే.. చిరంజీవిని అవమానించిన వాళ్లను ఆయన వదిలేస్తాడేమో కానీ తమ్ముడు గుర్తు పెట్టుకుని మరీ వడ్డీతో సహా ఇచ్చేస్తాడు. చిరంజీవి అభిమానుల్ని ప్రేమిస్తాడు.. శత్రువుల్ని సైతం క్షమిస్తాడు. చిరంజీవి, పవన్‌కల్యాణ్‌తో కంపేర్ చేసి నాగబాబుగారిని విమర్శిస్తుంటారు. సినిమా ఇండస్ట్రీలో చిరంజీవిగారి వల్ల ఎంతమంది ఎదిగారో.. టీవీ ఇండస్ట్రీలో నాగబాబుగారి వల్ల నాలాంటి ఎంతోమంది ఎదిగారు. అన్నదమ్ముల కోసం అడ్డంగా నిలబడిపోతాడు నాగబాబుగారు. మూడో వ్యక్తి పవన్‌కల్యాణ్ అందరి లెక్క తేలుస్తాడు.. అనుకున్నది సాధిస్తాడు. ఇది ష్యూర్! అన్నయ్య మంచోడు కాబట్టి ముంచేశారు.. తమ్ముడు మొండోడు ముంచడాలుండవ్. తాడోపేడో తేల్చుకోవడమే! డబ్బు మీద ఆశ లేని వ్యక్తులు. మంచి చేయాలనే ఆలోచన ఉన్నవారు. ఇలాంటి మనుషుల గురించి తప్పుడు కూతలు కూస్తే.. కుర్చీ మడతపెట్టి’... ఇది కింది స్థాయి వాళ్లకు అర్థం కాదు. డిగ్రీ చదివిన వారికే అర్థం అవుతుంది’’ అంటూ వ్యంగ్యాస్ర్తాలు సంధించారు
ఇక సినిమా విషయానికొస్తే...‘వాల్తేరు వీరయ్య’ ఉన్న అన్ని అంశాలతోపాటు ఇందులో సిస్టర్ సెంటిమెంట్ బాగా వర్కవుట్ అవుతుంది. మంచి విజయం సాధిస్తుంది. నిర్మాతలు కంగారు పడాల్సిన పనిలేదు. ఈ మఽధ్యన ఎలక్షన్లు గురించి మాట్లాడాల్సిన వాళ్లు కలెక్షన్ల గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి నో ప్రాబ్లమ్. వాళ్లు చూసుకుంటారు. ఎంత వచ్చింది అనేది వాళ్లు చూసుకుంటారు. లెక్కలు చెప్పేస్తారు. ‘బ్రో’ సినిమా కలెక్షన్లు తక్కువ వచ్చాయంటా. ఆయన వెనకేసుకున్న దానితో పోలిస్తే మనకు వచ్చింది ఎప్పటికీ తక్కువే అవుతుంది.
వర్మకు ఇన్‌డైరెక్ట్ కౌంటర్..
టాలీవుడ్‌లో ఓ దర్శకుడు ఉన్నాడు. అతన్ని అనే స్థాయి నాకు లేదు. కానీ మెగాస్టార్‌ను, పవర్‌స్టార్‌ను అనే స్థారు అతనికి లేదు. చిన్న పెగ్గేసి చిరంజీవిని, పెద్ద పెగ్గేసి పవన్‌కల్యాణ్‌ను విమర్శిస్తాడు. అర్థం లేని విమర్శలకు క్లాప్స్ రావు.. అర్థం కాని సినిమాలకు కలెక్షన్లు రావు. నాకు తెలిసి మీ ‘వ్యూహాలు’ బెడిసికొడతాయని నా నమ్మకం’’ అంటూ పేరు చెప్పకుండా వర్మకు సెటైర్లు విసిరాడు ఆది.