RGV Vyooham: 'వ్యూహం' సెన్సారు జీవిత చెయ్యొద్దు, కోర్టు ఏమి చెప్పిందో తెలుసా...
ABN , First Publish Date - 2023-11-08T15:14:34+05:30 IST
నిర్మాత నట్టి కుమార్, రామ్ గోపాల్ వర్మ 'వ్యూహం' సినిమా విడుదల ఆపుచేయాలని డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాని సెన్సారు బోర్డు రివైజింగ్ కమిటీకి సిఫారసు చేసిన దరిమిలా, కమిటీ చైర్మన్ జీవితని కూడా తప్పించాలని నట్టి కుమార్ కోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. కోర్టు ఏమని తీర్పు ఇచ్చిందంటే...
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RamGopalVarma) 'వ్యూహం' #Vyooham సినిమాను పూర్తిగా రాజకీయ కథతో తెరకెక్కించారు. ఇది పూర్తిగా ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీ వైఎస్సార్సీపీకి (YSRCP), ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి (YSJaganMohanReddy) అనుకూలంగా, ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం (TeluguDesam), జనసేన (JanaSena), కాంగ్రెస్ పార్టీలకు, వాటి అధినాయకులకు వ్యతిరేకంగా ఉండటంతో పాటు వారి పాత్రలకు పోలికలు దగ్గరగా ఉన్న నటులను (డూప్ లను) పెట్టి వ్యంగంగా చిత్రీకరించారని ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ (NattiKumar) సెన్సార్ అధికారులకు, అలాగే ఎలక్షన్ కమీషన్ అధికారులకు ఫిర్యాదులు చేసిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాను సెన్సార్ చేసేందుకు హైదరాబాద్ లోని రీజినల్ సెన్సార్ బోర్డు నిరాకరించి, రీవైజ్ సెన్సార్ కమిటీకి సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో రీవైజ్ సెన్సార్ కమిటీలో ఉన్న ప్రముఖ నటి, దర్శకురాలు జీవిత రాజశేఖర్ (JeevithaRajasekhar) ను ఈ సినిమా వరకు సెన్సార్ చేయకుండా తప్పించాలని నట్టి కుమార్ సెన్సార్ చైర్మన్ కు ఫిర్యాదు చేయడంతో పాటు తెలంగాణ హైకోర్టులో కేసు కూడా వేశారు.
జీవిత రాజశేఖర్ ఓ పొలిటికల్ లీడర్ అని, ఆమె గతంలో వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలిగా, ప్రస్తుతం బిజెపి.నాయకురాలిగా ఉన్నారని, ఆమె 'వ్యూహం' సినిమాను ఆర్ సి కమిటీలో కొనసాగి, సెన్సార్ చేసినట్లయితే, న్యాయం జరగదని నట్టి కుమార్ హైకోర్టులో వేసిన కేసులో పేర్కొన్నారు. ఆమెపై సహజంగానే వత్తిడులు వచ్చే అవకాశం ఉందని, అందుకే సెన్సార్ చైర్మన్ జోక్యం చేసుకుని, చెన్నై లేదా ముంబై, కర్ణాటక వంటి రాష్ట్రాల సెన్సార్ ఆర్ సి సభ్యలను ఇక్కడి కమిటీలో వేసి, వారి చేత సెన్సార్ చేయించాలని నట్టి కుమార్ తాను వేసిన కేసులో వివరించారు. ఈ కేసులో సెన్సార్ వారితో పాటు ఎలక్షన్ కమీషన్ వారిని కూడా పార్టీ చేయడం జరిగింది.
ఈ కేసు తెలంగాణ హైకోర్టులో బుధవారం విచారణకు వచ్చింది. నట్టి కుమార్ తరపున అడ్వొకేట్ కేశాపురం సుధాకర్ వాదనలు వినిపిస్తున్నారు. ఈ విషయాలను కేశాపురం సుధాకర్ కోర్టు దృష్టికి తీసుకుని వచ్చారు. మరిన్ని వివరాలను సమర్పించడం కోసం అనంతరం వారం రోజులపాటు ఈ కేసును హైకోర్టు వాయిదా వేసింది..ఈ వాజ్యంలో సెన్సార్ తరపున, ఎలక్షన్ కమీషన్ తరపున న్యాయవాదులు కూడా పాల్గొన్నారు.