Hbd Harish Shankar: షాక్‌ టు.. ఉస్తాద్‌... నాడి పట్టేశాడు!

ABN , First Publish Date - 2023-03-31T13:34:00+05:30 IST

అతని సినిమా హీరో పాత్రలో ఏదో మ్యాజిక్‌ ఉంటుంది.. ప్రేక్షకుల నాడీ బాగా తెలిసినవాడు.. అభిమాన హీరోని తెరపై ఎలా చూడాలనుకుంటారో.. పాత్రని ఎలా డిజైన్‌ చేస్తే అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించవచ్చో తెలిసిన దర్శకుడు...

Hbd Harish Shankar: షాక్‌ టు.. ఉస్తాద్‌... నాడి పట్టేశాడు!

అతని సినిమా హీరో పాత్రలో ఏదో మ్యాజిక్‌ ఉంటుంది..

ప్రేక్షకుల నాడీ బాగా తెలిసినవాడు..

అభిమాన హీరోని తెరపై ఎలా చూడాలనుకుంటారో..

పాత్రని ఎలా డిజైన్‌ చేస్తే అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించవచ్చో తెలిసిన దర్శకుడు...

అతని రచనాశైలిలో మిరపకాయ్‌లాంటి ఘాటు ఉంటుంది

కామెడీ, పంచ్‌లకు ప్రేక్షకులు పరవశిస్తారు

ఆయనే దర్శకుడు హరీశ్‌ శంకర్‌... (happy birthday Harish Shankar)

రంగస్థల నటుడిగా కెరీర్‌ ప్రారంభించిన ఆయన తదుపరి యండమూరి వీరేంద్రనాథ్‌తోనాటు పలువురి రచనల ప్రభావంతో రచయిగా, స్ర్కీన్‌ రైటర్‌గా అవతారమెత్తారు. పలువురు దర్శకుల దగ్గర అసిస్టెంట్‌గా పని చేసి దర్శకుడు అయ్యారు. శుక్రవారం హరీశ్‌ శంకర్‌ పుట్టినరోజు సందర్భంగా దర్శకుడిగా ఆయన కెరీర్‌పై ఓ లుక్కేద్దాం...

హరీశ్‌ శంకర్‌ 1979 మార్చి 31న ధర్మపురి ప్రాంతంలో జన్మించారు. హైదరాబాద్‌ బిహెచ్‌ఈఎల్‌ టౌన్‌షిప్‌లో ఉంటూ చదువుకున్నారు. చదువులో చురుకుగా ఉండే హరీశ్‌కు చిన్నప్పటి నుంచీ సినిమాలంటే పిచ్చి. చేసే పనిలో వైవిధ్యం ఉండాలని కోరుకునే ఆయన నటనపై ఆసక్తితో కొద్ది రోజులు నాటకరంగంలో కొనసాగారు. యండమూరి వీరేంద్రనాథ్‌ వంటి రచయితల రచనా ప్రభావంతో స్ర్కీన్‌ రైటింగ్‌ మీద దృష్టిపెట్టారు. సినిమాలపై మరింత ఆసక్తి పెరగడంతో దర్శకత్వం వైపు అడుగులేశారు. పూరీ జగన్నాథ్‌, రామ్‌గోపాల్‌ వర్మ వంటి దర్శకుల వద్ద సహాయ దర్శకుడిగా పని చేసిన ఆయన రవితేజ ‘షాక్‌’ (Shock movie) చిత్రంతో దర్శకుడిగా మారారు. సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినా హీరో చెప్పిన డైలాగ్‌లు, హీరో ఎలివేటింగ్‌ సన్నివేశాలకు చక్కని గుర్తింపు లభించింది. సినిమా కమర్షియల్‌ సక్సెస్‌ కాకపోయినా దర్శకుడిపై ఉన్న నమ్మకంతో రవితేజ ‘మిరపకాయ్‌’ చిత్రంతో మరో అవకాశం ఇచ్చారు. తనదైన శైలి డైలాగ్‌, హీరోయిజం చూపిస్తూ రవితేజకి సూపర్‌ హిట్‌ ఇచ్చారు. ఆ చిత్రంతో హరీశ్‌ శంకర్‌ కెరీర్‌ మలుపు తిరిగింది.

ఆ సక్సెస్‌తో మూడో సినిమాకే టాలీవుడ్‌ అగ్ర హీరో పవన్‌కల్యాణ్‌ని డైరెక్ట్‌ చేసే అవకాశం అందుకున్నారు. సల్మాన్‌ఖాన్‌ హీరోగా నటించిన హిందీ చిత్రం ‘దబంగ్‌’ను తెలుగులో ‘గబ్బర్‌సింగ్‌’గా (Gabbar singh) రీమేక్‌ చేశారు. పవన్‌కు భక్తుడైన హరీశ్‌ శంకర్‌ (Harish Shankar) ఒరిజినల్‌ కథను తెలుగు నేటివిటీకి, పవన్‌ క్రేజ్‌కు అనుగుణంగా మార్పులు చేసి ‘గబ్బర్‌సింగ్‌’ తెరకెక్కించారు. పవన్‌ - హరీశ్‌ శంకర్‌ కాంబినేషన్‌ మ్యాజిక్‌తో అప్పటికి పదేళ్లుగా హిట్‌ లేకుండా ఉన్న పవన్‌కు ఈ చిత్రం భారీ విజయాన్ని అందించింది. దీనితో చిత్ర నిర్మాత బండ్ల గణేశ్‌ బ్లాక్‌బస్టర్‌ నిర్మాతగా గుర్తింపు పొందారు. అనంతరం ఎన్టీఆర్‌తో ‘రామయ్యా వస్తావయ్యా’ తెరకెక్కించారు. అది బాక్సాఫీస్‌ దగ్గక చతికిలపడింది. దర్శకుడిగా ఐదో చిత్రం ‘సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌’ హరీశ్‌కు మంచి విజయాన్ని అందించింది. ఆరో చిత్రానికి అల్లు అర్జున్‌ని హీరోగా ఎంచుకున్నారు హరీశ్‌. వీరిద్దరి కాంబోలో ‘దువ్వాడ జగన్నాథమ్‌’ వచ్చింది. ఓకే అనేలా ఉన్న ఈ చిత్రం బన్నీ ముందు చిత్రాన్ని బీట్‌ చేయలేకపోయింది. తర్వాతి చిత్రం కూడా మెగా కాంపౌండ్‌లోనే చేశారు. వరుణ్‌తో ‘గద్దలకొండ గణేశ్‌’ తీసి ఏవరేజ్‌ అనిపించుకున్నారు. మూడున్నర ఏళ్ల గ్యాప్‌ తర్వాత ఓ పవర్‌ఫుల్‌ సినిమా చేస్తున్నారు. పవన్‌కల్యాణ్‌ హీరోగా ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ చిత్రాన్ని ఆయన డైరెక్ట్‌ చేస్తున్నారు. గబ్బర్‌సింగ్‌ సక్సెస్‌ అయిన 11 ఏళ్లకు మళ్లీ ఈ కాంబో సెట్‌ అయింది. ‘గబ్బర్‌సింగ్‌’తో సంచలన విజయం అందుకున్న హరీశ్‌ ‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ చిత్రాన్ని అంచనాలకు మించి రూపొందిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.

Updated Date - 2023-03-31T13:34:29+05:30 IST