Allu Arjun: అప్పుడే 20 ఏళ్ళు అయిపోయాయా, గంగోత్రి నుండి పుష్ప వరకు ఎక్కడా తగ్గేదే లే !
ABN , First Publish Date - 2023-03-28T14:06:33+05:30 IST
ప్రపంచ స్థాయిలో గుర్తింపు రావాలంటే ఆర్భాటాలు, హంగులూ ప్రధానం కాదు, కష్టపడటం ముఖ్యం. దాన్నే నమ్ముకున్నాడు అల్లు అర్జున్, అందుకే ఈరోజు 'గంగోత్రి' అనే సినిమా ద్వారా పరిచయం అయి సైలెంట్ గా ఎటువంటి ప్రచారాలు లేకుండా ప్రపంచ స్థాయిలో గ్లోబల్ ఐకాన్ అని పిలిపించుకుంటున్నాడు అల్లు అర్జున్ ఈరోజు. 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఒక ప్రత్యేక వ్యాసం...
అల్లు అర్జున్ (Allu Arjun) సినిమా ప్రస్థానం సాగించి అప్పుడే 20 ఏళ్ళు పూర్తయిపోయాయి. ఒకటి రెండు సినిమాల్లో చిన్న పాత్రల్లో కనపడినా, కథానాయకుడిగా మాత్రం మొదటి సినిమా అట్టహాసంగా ప్రారంభం అయిన 'గంగోత్రి'. అట్టహాసం అని ఎందుకు అన్నాను అంటే ఈ సినిమాకి దర్శక దిగ్గజం కె. రాఘవేంద్రరావు (K Raghavendra Rao) దర్శకుడిగా భాద్యతలు తీసుకుంటే, అల్లు అర్జున్ తండ్రి మెగా నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind), ఇంకో అగ్ర నిర్మాత సి. అశ్విని దత్ (C Ashwini Dutt) ఈ సినిమాని నిర్మించారు. అప్పట్లో చిన్నికృష్ణ కథ అంటేనే సూపర్ హిట్, టాప్ రైటర్, ఈ 'గంగోత్రి' సినిమాకి అతనే కథ అందించాడు. (#20yearsforGangotri) అధితి అగర్వాల్ ఇందులో కథానాయిక. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వటమే కాదు, ఈ సినిమాలో పాటలు కూడా అంతే పెద్ద హిట్ అయ్యాయి.
ఇంతింతయి, వటుడింతయి అన్న చందాన అల్లు అర్జున్ మెల్ల మెల్లగా తన స్టార్ డమ్ ని, అభిమానులని పెంచుకుంటూ వెళ్ళాడు. మొదట్లో తెలుగు వాళ్ళకే పరిమితం అయిన అల్లు అర్జున్, తరువాత కేరళ ప్రేక్షకులకి దగ్గరయ్యాడు. వాళ్ళు అల్లు అర్జున్ సినిమాలని చాలా క్రేజీ గా చూసేవారు. #20yearsOfAlluArjun అందుకే మలయాళం ప్రేక్షకులకి మాత్ర అల్లు అర్జున్ పేరు మల్లు అర్జున్ అయింది. ఇలా మలయాళం ప్రేక్షకుల హృదయాల్లో అల్లు స్థానం సంపాదించటం అల్లు అర్జున్ తన విస్తరణకు నాంది అయింది.
కమర్షియల్ సినిమాలు చేస్తున్నా, మధ్యలో కొన్ని సినిమాలు అల్లు అర్జున్ ఎంత పెద్ద నటుడు, ఎంత కష్టపడతాడు అతని నటనని తెలిపేటట్టు చేశాయి. అలాంటి సినిమాలే 'వేధం', 'పరుగు' అలాగే అల్లు అర్జున్ కామెడీ కూడా బాగా పండించగలడు అని చెప్పే సినిమా 'హ్యాపీ'. ఇలా ఒక్క కమర్షియల్ సినిమాలే కాకుండా, తాను ఎటువంటి రోల్ ని అయినా చెయ్యగలను అని ప్రూవ్ చేసే సినిమాలు చాలానే చేసాడు అల్లు అర్జున్.
ఇంక తెలుగు సినిమా పరిశ్రమలో మొట్ట మొదటి సారి సిక్స్ ప్యాక్ బాడీ చూపించింది అల్లు అర్జున్ కావటం విశేషం. పూరి జగన్నాథ్ (Puri Jagannadh) దర్శకత్వం లో వచ్చిన ఈ 'దేశముదురు' సినిమా అప్పట్లో ఒక పెద్ద సంచలనం. అప్పట్లో హిందీ నటులు మాత్రమే ఈ బాడీ ఫిజిక్ ని చూపించేవారు, వాళ్ళకి పోటీగా అల్లు అర్జున్ తెలుగు నటులు కూడా మంచి ఫిజిక్ చూపించగలరు అని చాటిచెప్పే చిత్రమే 'దేశముదురు'. అందులో అల్లు అర్జున్ సిక్స్ ప్యాక్ చూసి అప్పట్లో యువత అతనికి అభిమానులుగా మారారు అనటం లో ఎట్టి సందేహం లేదు.
అతని పేరు మీదే ఒక సినిమా 'బన్నీ' (Bunny) అని పెట్టి తీసిన ఘనత కూడా అల్లు అర్జున్ కె దక్కుతుంది. వి.వి. వినాయక్ (VV Vinayak) దీనికి దర్శకుడు, ఇది ఒక పెద్ద హిట్ అయిన సినిమా. ఇందులో పాటలన్నిటితో పాటు 'బన్నీ బన్నీ' అనే పాట అందరి నోట పాతుకుపోయింది అప్పట్లో. (20YearsOfAlluArjun) ఇందులో కామెడీ సన్నివేశాలు అయితే మామూలుగా వుండవు, ఒక రేంజ్ లో ఉంటాయి. బన్నీ ఇందులో ఎం.ఎస్. నారాయణ, రఘు బాబు తో సన్నివేశాలు ప్రేక్షకులని కడుపుబ్బా నవ్విస్తాయి.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే బన్నీకి ఇద్దరు దర్శకులు స్పెషల్ గా వున్నారు ఒకరు సుకుమార్ (Sukumar), ఇంకొకరు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas). ఈ ఇద్దరితో ప్రత్యేక అనుబంధం వుంది అల్లు అర్జున్ కి. సుకుమార్, బన్నీ తో 'ఆర్య' సినిమా తీసి బన్నీ ని స్టార్ ని చేసాడు. అదే సుకుమార్ మళ్ళీ 'ఆర్య 2' సినిమా కూడా తీసి అందులో అల్లు అర్జున్ ని ఒక వైవిధ్యం అయిన పాత్రలో చూపించాడు. ఈ రెండూ ఒక ఎత్తు అయితే గత సంవత్సరం విడుదల అయిన 'పుష్ప' (Pushpa) అర్జున్ కెరీర్ ని, ఇమేజ్ ని మొత్తం మార్చేసింది. ఈ సినిమా అల్లు అర్జున్ ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది, ప్రపంచం అంత అల్లు అర్జున్ ఈ సినిమాలో చెప్పిన ఒక డైలాగ్ 'తగ్గేదే లే' కి ఫిదా అయిపోయారు. ఇప్పుడు అల్లు అర్జున్ ఒక గ్లోబల్ ఐకాన్ అయిపోయాడు ఈ సినిమాతో. అందుకే సుకుమార్ అంటే భక్తి, గౌరవం అల్లు అర్జున్ జీవితంలో ఒక స్పెషల్ వ్యక్తి అతను.
అలాగే ఇంకో దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇతనితో మొదట 'జులాయి' సినిమా పెద్ద విజయం సాధించింది. అలాగే తరువాత రెండో సినిమా 'S/o సత్యమూర్తి' కి కలిశారు ఈ ఇద్దరూ. మళ్ళీ మరొక విజయం. ముచ్చటగా మూడో సారి 'అల వైకుంఠపురం లో' (Ala Vaikuntapuramlo) సినిమా కి కూడా ఇద్దరూ కలిశారు. ఈ మూడో సినిమా అయితే ఒక పెద్ద సంచలనం, ఇండస్ట్రీ హిట్ అయింది.
ఎన్నో రికార్డ్స్ బద్దలు కొట్టింది. ఈ సినిమా తో పాటు ఇందులో పాటలు కూడా ఒక సంచలనం. కొన్ని కోట్ల మంది విన్నారు, చూసారు ఈ పాటలు వీడియో, ఆడియో. అందుకే త్రివిక్రమ్ శ్రీనివాస్ ని గురువుగారి గా చూస్తాడు అల్లు అర్జున్. ఇతను కూడా అల్లు అర్జున్ జీవితం లో ఒక స్పెషల్ పర్సన్ గా ఉంటాడు.
కానీ ఇంకో విషయం చెప్పుకోవాలి. పైన చెప్పిన ఇద్దరి దర్శకులతో మూడేసి సినిమాలు చేసినా, ఒక్క స్పెషల్ సినిమా వుంది, అదే 'సరైనోడు' బోయపాటితో (Boyapati Sreenivas) చేసాడు అల్లు అర్జున్. అసలు చెప్పాలంటే ఇది ఒక ఫుల్ కమర్షియల్ సినిమా. ఇది మోడల్తో కొంచెం టాక్ అటు ఇటు గా వున్నా కలెక్షన్స్ అందుకొని అల్లు అర్జున్ కెరీర్ లో అప్పటికి ఇదే పెద్ద హిట్ సినిమా అయింది. అదీ కాకుండా అల్లు అర్జున్ అంటే ఏంటో హిందీ ప్రేక్షకులకి బాగా తెలియచెప్పిన సినిమా ఇదే. 'సరైనోడు' సినిమాని యూట్యూబ్‌లో డబ్ చేసి, టైటిల్‌ను మాత్రం తెలుగు టైటిల్ 'సరైనోడు`(Sarrainodu) గానే ఉంచేశారు. అప్పట్లో యూట్యూబ్ ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది, ఎందుకంటే యూట్యూబ్‌లో అత్యధిక మంది వీక్షించిన భారతీయ సినిమాగా 'సరైనోడు' నిలిచింది.
ఈ సినిమాను రమారమి 14.6 కోట్ల మంది వీక్షించారు. ఇప్పటివరకు తెలుగు, తమిళం కాదు మరే భారతీయ సినిమాకు కూడా ఇంత స్థాయిలో వ్యూస్ రాలేదు. అంటే అల్లు అర్జున్ హిందీ ప్రేక్షకులకు పరిచయం అయింది ఈ బోయపాటి సినిమాతో. ఆ తరువాత హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వం లో వచ్చిన 'దువ్వాడ జగన్నాధం' కూడా పెద్ద హిట్ అవటమే కాకుండా, హిందీ లోకి అనువాదం చేసినపుడు అక్కడి ప్రేక్షకులకి కూడా విపరీతంగా నచ్చింది.
అలాగే దర్శకుడు గుణశేఖర్ (Gunasekhar) చారిత్రాత్మక సినిమా 'రుద్రమదేవి' (Rudhramadevi) తీసాడు. అందులో అనుష్క శెట్టి (Anushka Shetty), రానా దగ్గుబాటి (Rana Daggubati) ముఖ్య పాత్రధారులు. కానీ ఆ సినిమాకి ఒక స్పెషల్ పాత్రలో గుణశేఖర్ రిక్వస్ట్ చెయ్యగానే వచ్చి గోన గన్నారెడ్డి పాత్ర చేసాడు అల్లు అర్జున్ (Allu Arjun). నిజం చెప్పాలంటే ఆ సినిమాలో అల్లు అర్జున్ పాత్ర చిన్నదే అయినా, సినిమాకే హైలైట్. ఆ సినిమాకి ఓపెనింగ్స్ రావటానికి అల్లు అర్జున్ చేసిన పాత్ర చాలా ముఖ్యం అయింది. అదీ కాకుండా అల్లు అర్జున్ ఆ సినిమాలో ఆ పాత్ర చెయ్యడం తో నిజమయిన హీరో అని కూడా అనిపించుకున్నాడు. ఎందుకంటే గుణశేఖర్ ఆ పాత్రని ఎవరెవరినో అడిగారని, కానీ వాళ్ళు ఆ పాత్ర నిడివి చిన్నది, లేదా ఇంకో కారణం చెప్పి తప్పించుకున్నారని, కానీ అల్లు అర్జున్ ఆ పాత్రని ఫ్రీ గా చేసాడని అందువల్లే అల్లు అర్జున్ నిజమయిన హీరో అని అన్నారు.
'గంగోత్రి' నుండి చిన్నగా మొదలుపెట్టి ఈ 20 ఏళ్లలో సైలెంట్ గా ఏ ఆర్భాటాలు లేకుండా ప్రపంచ స్థాయికి ఈరోజు ఎదిగాడు అల్లు అర్జున్ అంటే అంతని కష్టం ఎంత ఉందో అర్థం అవుతోంది. కానీ ఎంత ఎత్తుకు ఎదిగినా అంతే ఒద్దికగా ఉంటాడు. మధ్యలో ఏవో చిన్న చిన్న వివాదాలు, సమాచార లోపం వలన వచ్చినా అల్లు అర్జున్ ఎంత ఎత్తుకు ఎదిగినా అంతే అందరినీ చాలా గౌరవంతో చూస్తాడు. మొదటి సినిమాకి ఎంత కష్టపడ్డాడో, అంతకు వంద రేట్లు ప్రతి సినిమా కష్టపడి చేస్తాడు. సినిమా చూస్తున్నప్పుడు అతని కష్టం తెర మీద కనిపిస్తుంది. అందుకే అంత పెద్ద స్థాయిలో ఈరోజు ప్రపంచం అంతా అల్లు అర్జున్ ని గ్లోబల్ ఐకాన్ (Global Icon) గా చూస్తోంది. డాన్సులో, నటనలో, యాక్షన్ లో, స్టైలిష్ లో ఎన్నో వాటికీ ఐకాన్ అయ్యాడు అల్లు అర్జున్. అలాగే అతని రాబోయే సినిమా 'పుష్ప 2' (Pushpa 2) ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. సినిమాలో చెప్పినట్టుగానే అల్లు అర్జున్ తెలుగు బాష లెక్క అన్నమాట, ఆడా ఉంటాడు, ఈడా ఉంటాడు, ఎక్కడయినా ఉంటాడు ! అల్ ది బెస్ట్ అల్లు అర్జున్ !