Film Celebs Rakhi Festival: రాఖీ ఓ భావోద్వేగం.. ఆ జ్ఞాపకాలే ఇవి
ABN , First Publish Date - 2023-08-27T11:32:41+05:30 IST
అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల ప్రేమానురాగాలకు ‘రక్షా’బంధన్! సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ప్రతీ ఒక్కరికీ రాఖీ ఓ భావోద్వేగం. ఎంత బిజీగా ఉన్నా స్టార్లు ఆ రోజు షూటింగ్స్‌కి బ్రేక్ ఇచ్చి... తోబుట్టువులకు టైమ్ ఇస్తారు. వారి ‘తీపి’ జ్ఞాపకాలే ఇవి...
అన్నాచెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల ప్రేమానురాగాలకు ‘రక్షా’బంధన్! సామాన్యుల నుంచి సెలబ్రిటీల దాకా ప్రతీ ఒక్కరికీ రాఖీ ఓ భావోద్వేగం. ఎంత బిజీగా ఉన్నా స్టార్లు ఆ రోజు షూటింగ్స్‌కి బ్రేక్ ఇచ్చి... తోబుట్టువులకు టైమ్ ఇస్తారు. వారి ‘తీపి’ జ్ఞాపకాలే ఇవి...(Rakhi special)
వాడే నా బెస్ట్ ఫ్రెండ్
రాఖీ పౌర్ణమి నాకు చాలా స్పెషల్. అదొక ఎమోషనల్ మూమెంట్ కూడా. అందుకే ప్రతీ ఏడాది తప్పనిసరిగా తమ్ముడి చేతికి రాఖీ కడుతుంటా. ఒక్కోసారి షూటింగ్‌లో ఉండి అందుబాటులో లేకపోతే... ముందుగానే రాఖీ పోస్టల్ ద్వారా పంపించి, వీడియో కాల్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తా. నా తమ్ముడు అహాన్ పాండే నా జీవితానికి వెలుగు లాంటి వాడు. నా బెస్ట్ ఫ్రెండ్ కూడా. అన్ని విషయాల్లోనూ నా వెన్నంటే ఉంటాడు. తనలాంటి సోదరుడు ఉండడం నా అదృష్టం.
- అనన్య పాండే(Ananya panday)
అక్కని కాదు... అమ్మని...
నాకు ఇష్టమైన పండగల్లో రక్షాబంధన్ ముఖ్యమైనది. ఏ పండగనైనా స్కిప్ చేస్తానేమో గానీ దీన్ని అస్సలు స్కిప్ చేయను. షూటింగ్స్‌లో ఎంత బిజీగా ఉన్నా విరామం తీసుకుని ఆ రోజు ఇంట్లో వాలిపోతా. పొద్దున్న లేవగానే నేను, అక్క కలసి మా తమ్ముడు మందర్ ఠాకూర్‌కి రాఖీ కడతాం. ఆ రోజంతా ముగ్గురం ఫుల్‌గా అల్లరి చేస్తాం. మా తమ్ముడు నా కన్నా పన్నెండేళ్లు చిన్నోడు. అందేకేనేమో నేను వాడిని అక్కలా కాకుండా తల్లిలా చూసుకుంటా. వాడికి కావాల్సినవన్నీ కొనిస్తా. తమ్ముడితో పాటు అక్కకి కూడా ఎంచక్కా రాఖీ కడతా.
-మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur)
ఒక రేంజ్‌లో అల్లరి
రక్షాబంధన్‌ని మా ఇంట్లో ఓ వేడుకలా జరుపుకొంటాం. అందరం ఒకచోట చేరి రోజంతా సరదాగా గడుపుతాం. అందరం ఒకచోట కలిశామంటే అల్లరి మామూలుగా ఉండదు. ఒక రేంజ్‌లో ఉంటుంది. నిహారిక చెల్లి, సుస్మిత, శ్రీజ అక్కలు ప్రతీ ఏడాది నాకు, చరణ్ అన్నకు రాఖీ కడుతుంటారు. ఇంకోవైపు మా అత్తయ్యలు ఇద్దరూ నాన్న, పెదనాన్న, బాబాయ్‌లకు రాఖీ కడతారు. రాఖీ సెలబ్రేషన్స్ అయిపోయాక నచ్చిన వంటకాలన్నీ తిని ఆటపాటలతో హల్‌చల్ చేస్తుంటాం.
- వరుణ్ తేజ్ (varun tej)
చెల్లిని కలవాల్సిందే!
షూటింగ్స్‌తో ఎంత బిజీగా ఉన్నా సరే రాఖీ పండుగ రోజు మాత్రం మా చెల్లి నందినీని కలవాల్సిందే. ఆ రోజు రాఖీ కట్టించుకుని, తన ఆశీర్వాదం తీసుకుంటా. ఇద్దరం కలసి కాసేపు సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటాం. డైట్‌లో ఉన్నాననే విషయాన్ని పక్కనపెట్టి, తన చేతితో చేసిన వంటకాలన్నింటినీ లాగించేస్తా. ‘ప్రపంచం మారుతుంది, కాలం గడుస్తుంది గానీ తోబుట్టువుల ప్రేమానురాగాలు మాత్రం ఎప్పటికీ స్థిరంగా ఉంటాయ’ని నమ్ముతా.
- యశ్ (Yash)
ముచ్చటగా మూడు బహుమతులు
రాఖీకి కొన్ని రోజుల ముందే నా హడావిడి మొదలవుతుంది. మార్కెట్‌లోకి కొత్తరకం రాఖీలు ఏమేం వచ్చాయని తెగ వెతికేస్తుంటా నా ముగ్గురు క్యూట్ బ్రదర్స్ కోసం. ఆ రోజులో సగం ఫొటోషూట్‌లకే సరిపోద్ది. రాఖీ నాకు త్రీ చీర్స్ లాంటిది. ఒకటి, రెండు కాదు ఏకంగా మూడు బహుమతులు అందుకుంటా. నాకు నచ్చినవి ఇచ్చి నన్ను సర్‌ప్రైజ్ చేస్తుంటారు తమ్ముళ్లు. ఆ రోజు ఇంట్లో మొత్తం నాకు నచ్చిన వంటకాలే ఉంటాయి.
- సారా అలీఖాన్