Ramabanam: ప్రతి హీరో కి ఒత్తిడి ఉంటుంది: గోపీచంద్
ABN , First Publish Date - 2023-05-04T17:44:26+05:30 IST
'లక్ష్యం', 'లౌక్యం' వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్ కలయికలో వస్తున్న సినిమా 'రామబాణం'. డింపుల్ హయతి కథానాయికగా నటించగా, జగపతి బాబు, కుష్బూ ప్రధాన పాత్రలు పోషించారు
'లక్ష్యం', 'లౌక్యం' వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత గోపీచంద్ (Gopichand), డైరెక్టర్ శ్రీవాస్ (Sriwaas) కలయికలో వస్తున్న సినిమా 'రామబాణం'. డింపుల్ హయతి (Dimple Hayati) కథానాయికగా నటించగా, జగపతి బాబు (JagapathiBabu), కుష్బూ (Khushbu) ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా గురించి గోపీచంద్ మాట్లాడుతూ ముందు దర్శకుడు శ్రీవాసు యాక్షన్ సినిమా చేద్దామన్నాడు, కానీ గోపీచంద్ వద్దన్నాడు అని చెప్పాడు.
"కొన్నేళ్లుగా యాక్షన్ సినిమాలు ఎక్కువ చేస్తున్నాను, ఫ్యామిలీ సినిమా చేసి చాలా రోజులైంది. వాసు(దర్శకుడు శ్రీవాస్) ముందు యాక్షన్ ఫిల్మ్ చేద్దామన్నారు. వద్దు మొత్తం యాక్షన్ అయిపోతుంది. మనం చేసిన లక్ష్యం, లౌక్యం సినిమాలలో యాక్షన్ తో పాటు ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. అలాంటి సినిమా చేద్దామని అన్నాను. ఆ సమయంలో భూపతిరాజా గారు ఈ కథ చెప్పడం, అది మాకు నచ్చడం, ఆలా ఈ సినిమా తయారయింది" అని చెప్పాడు. అయితే 'లక్ష్యం'కి ఈ 'రామబాణం' కి ఎటువంటి సంబంధం లేదు, రెండు వేరు వేరు కథలు అని చెప్పాడు.
'రామబాణం' అనే టైటిల్ బాలకృష్ణ (Nandamuri Balakrishna) పెట్టారు అని చెప్పాడు గోపీచంద్. గోపీచంద్ అనుకోకుండా అన్ స్టాపబుల్ (Unstoppable) షోకి వెళ్ళడం, అక్కడ బాలకృష్ణ 'రామబాణం' అనే టైటిల్ పెట్టడం అలా జరిగిపోయాయి, చిత్ర నిర్వాహకులు అదే బాగుందని ఉంచేశారు. ఇందులో ఇంకో ముఖ్యమైన పాత్రలో జగపతి బాబు కనిపిస్తారు. అతన్ని కలిస్తే సొంత అన్నయ్యను కలిసినట్టే ఉంటుంది, అందుకే మా మధ్య సన్నివేశాలు అంతలా పండాయి.
కాంబినేషన్ ని తను నమ్మను అన్నాడు, నమ్మితే ఇప్పుడే చేసేవాడిని అని చెప్పాడు. మధ్యలో ఒకసారి దర్శకుడు వాసు వచ్చి సినిమా చేద్దాం అన్నా కూడా గోపీచంద్ వద్దని చెప్పేసేది. ఎందుకంటే ఇంతకు ముందు రెండు సినిమాలు చేసాం, మూడో సినిమా వాటిని మించే సినిమా కావాలి అని, ఇప్పుడు ఏ 'రామబాణం' లో ఫ్యామిలీ, యాక్షన్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి అని చెప్పాడు.
ప్రేక్షకులు సినిమాని ఆదరించ లేదంటే వాళ్ళని మెప్పించే సినిమా మనం తీయలేదని అర్థం అని చెప్పాడు గోపీచంద్. ఏ సినిమా అయినా ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా చేయగలగాలి అలాగే బోర్ కొట్టకుండా ఇన్వాల్వ్ అయ్యేలా చేయగలిగితే సినిమా ఖచ్చితంగా ఆడుతుంది. ఆడియన్స్ టేస్ట్ మారలేదు. వాళ్ళకి కనెక్ట్ అయ్యేలా తీస్తే, ఏ జానర్ సినిమాని అయినా ఆదరిస్తారు, అని అన్నాడు. గోపీచంద్ ముందు సినిమా 'పక్కా కమర్షియల్' ఆడుతుందని అనుకున్నాడు, కానీ ఆడలేదు. అయితే గోపీచంద్ ఒప్పుకున్నాడు అందులో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయని. అందరు కలిసి టీమ్ వర్క్ చేసి, నమ్మాం.. కానీ ఆశించిన సక్సెస్ రాలేదు, అన్నాడు.
జగపతి బాబు ఇప్పుడు ఎలాంటి ఒత్తిడి లేకుండా నటిస్తున్నానని చెప్పారు, మరి మీకు అలాంటి ఒత్తిడి ఏమైనా ఉందా అని అడిగినప్పుడు "ప్రతి హీరోకి ఒత్తిడి ఉంటుంది. ఈ సినిమా విషయంలో జగపతి బాబు గారికి కూడా ఎంతో కొంత ఒత్తిడి ఉంటుంది. ఎందుకంటే సినిమా ఫలితం మీద ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉంటాయి, కాబట్టి విజయవంతమైన సినిమా అందించాలనే ఒత్తిడి అందరిలోనూ ఉంటుంది" అని చెప్పాడు.