Waltair Veerayya film review: బాస్ ఫుల్ లోడింగ్ తో వచ్చేసాడు, సంక్రాంతి విన్నర్ చిరంజీవి!

ABN , First Publish Date - 2023-01-13T13:47:27+05:30 IST

సంక్రాంతి పండగ బరిలో నిలిచిన రెండో పెద్ద సినిమా, మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chrianjeevi) నటించిన 'వాల్తేరు వీరయ్య' (Waltair Veerayya) ఈరోజు (జనవరి 13) విడుదల అయింది. బాబీ కొల్లి (Bobby Kolli is the director) దీనికి దర్శకుడు కాగా, ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ (Mass Maharaja Ravi Teja) ఒక ముఖ్యమయిన పాత్రలో కనపడతాడు

Waltair Veerayya film review: బాస్ ఫుల్ లోడింగ్ తో వచ్చేసాడు, సంక్రాంతి విన్నర్ చిరంజీవి!

సినిమా: వాల్తేరు వీరయ్య

నటీనటులు : చిరంజీవి, శృతి హాసన్, రవితేజ, కేథరిన్ ట్రెసా, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, బాబీ సింహా, వెన్నెల కిశోర్, శ్రీనివాసరెడ్డి, షకలక శంకర్ తదితరులు

సంగీతం : దేవి శ్రీ ప్రసాద్

ఛాయాగ్రహణం : ఆర్థర్ ఎ విల్సన్

నిర్మాత : నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్

కథ, మాటలు, దర్శకత్వం : బాబీ కొల్లి

-- సురేష్ కవిరాయని

సంక్రాంతి పండగ బరిలో నిలిచిన రెండో పెద్ద సినిమా, మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chrianjeevi) నటించిన 'వాల్తేరు వీరయ్య' (Waltair Veerayya) ఈరోజు (జనవరి 13) విడుదల అయింది. బాబీ కొల్లి (Bobby Kolli is the director) దీనికి దర్శకుడు కాగా, ఈ సినిమాలో మాస్ మహారాజ రవితేజ (Mass Maharaja Ravi Teja) ఒక ముఖ్యమయిన పాత్రలో కనపడతాడు. అలాగే ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ (Music director Devi Sri Prasad) సంగీతం అందించాడు, అందులో సినిమా విడుదలకు ముందే రెండు పాటలు వైరల్ అయ్యాయి. శృతి హాసన్ (Shruti Haasan) ఇందులో కథానాయిక కాగా క్యాథెరిన్ ట్రెసా (Catherine Tresa) ఇంకో ముఖ్య పాత్రలో కనపడుతుంది. నాలుగు సినిమాల తరువాత మళ్ళీ చిరంజీవి ఒక మాస్ అవతారం లో ఈ సినిమాలో కనిపించనున్నారు. అలాగే సినిమా విడుదలకి ముందు దర్శకుడు బాబీ చిరంజీవిని అభిమానిగా ఎలా చూపిస్తే బాగుంటుందో, అలానే చూపించాను, అప్పట్లో చిరు ఎలా వుండే వారో ఆలా ఇందులో వుంటారు అని చెప్పాడు. ఈ సినిమా ప్రమోషన్స్, పాటలు, ట్రైలర్ అన్నీ కలిపి ఒక హైప్ క్రియేట్ చేసాయి. మరి సినిమా ఎలా ఉందొ చూద్దాం.

chiru-new2.jpg

Waltair Veerayya story: కథ:

వాల్తేరు వీరయ్య (చిరంజీవి) వైజాగ్ లోని ఇప్పటికీ బాగా ప్రాచుర్యం పొందిన జాలారిపేటలో తిరుగులేని మనిషి. అతను ఏమి చెప్తే అంత అక్కడ, ఒక్కోసారి నావీ వాళ్ళు కూడా వీరయ్య సహాయం తీసుకుంటూ వుంటారు, అంటే సముద్రం కూడా అతనికి కొట్టిన పిండి. అలాంటి వీరయ్య దగ్గరికి సీతాపతి (రాజేంద్రప్రసాద్) అని ఒక సస్పెండ్ అయిన సి.ఐ. వస్తాడు. మలేషియా లో వున్న డ్రగ్ డీలర్ సోలొమన్ సీజర్ (బాబీ సింహ) ని ఇండియా తీసుకురావాలని, ఆలా తీసుకు వస్తే కోరినంత డబ్బు ఇస్తా అని వీరయ్య కి చెప్తాడు. వీరయ్య 25 లక్షలు ఇస్తే ఆ పని చేస్తా అని వొప్పుకొని తన నలుగురు అనుచరులతో మలేషియా బయలుదేరతాడు. అక్కడ సీజర్ కి సంబందించిన ఒక పెద్ద హోటల్ లో బస చేస్తాడు, అదే హోటల్లో పని చేస్తున్న అధితి (శృతి హాసన్ ) తో పరిచయం కూడా అవుతుంది. ఒకరోజు వీరయ్య సోలొమన్ సీజర్ ని కిడ్నాప్ చెయ్యడానికి పథకం పక్కాగా వేసుకొంటాడు, అదే సమయంలో ఒక అమ్మాయి (కాథరిన్ ట్రెసా) చిరంజీవికి తారసపడి ఇద్దరూ ఒకరినొకరు తెలుసు అన్నట్టు చూసుకుంటారు. దానితో కిడ్నాప్ వ్యవహారం పాడవుతుంది. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు? వీరయ్య మలేషియా రావటానికి సోలొమన్ సీజర్ ని తీసుకెళ్ళటానికా, లేదా ఇంకేమయిన కారణం ఉందా? అధితి నిజంగానే ఆ హోటల్ లో పనిచేస్తోందా లేక ఆమె వెనక ఎవరున్నారు? రవితేజ, చిరంజీవి ఎందుకు విడిపోయారు? ఇలాంటి ప్రశ్నలు అన్నిటికీ మీరు సినిమా చూస్తే తెలుస్తుంది.

chiru-new1.jpg

విశ్లేషణ:

దర్శకుడు బాబీ కొల్లి చేతికి మెగాస్టార్ చిరంజీవి దొరికారు, ఎలా అతన్ని చూపిస్తే బాగుంటుంది అనుకున్నాడో ఆలా ఈ 'వాల్తేరు వీరయ్య' లో చూపించాడు. కథ చాలా మామూలు కథే. అందులో కొత్తదనం ఏమీ లేదు. కానీ చిరంజీవి అనే ఒక మెగాస్టార్ ని అతని అభిమానులకు, అలాగే కుటుంబం అందరూ చూడగలిగే ప్రేక్షకులకు ఎలా చూపిస్తే బాగుంటుంది అనుకున్నాడో దానికి తగ్గట్టుగా కథ రాసుకున్నాడు. సినిమా చూస్తున్నంత సేపూ పాత చిరంజీవిని చూస్తున్నట్టుగానే ఉంటుంది. చిరంజీవి వేసే ఆ చిన్న చిన్న 'చిలిపి' పనులు ప్రేక్షకులని ఆనందడోలికల్లో ముంచెత్తడమే కాకుండా, పగలబడి నవ్వుకుంటారు కూడా.

అదీ కాకుండా చిరంజీవి ఈమధ్య కాలంలో మాస్ సినిమా చెయ్యలేదు, అందుకని దర్శకుడు బాబీ అలాంటి కథను ఎన్నుకొని, దానికి కమర్షియల్ హంగులు అన్నీ పూశాడు. చిరంజీవి ఎంట్రీ అదిరింది, చిరంజీవి యాస, చిన్న చిన్న డైలాగులు, ఆ కామెడీ టైమింగ్, ఒకటేంటి, మొత్తం చిరునే సినిమా అంతా అనేట్టు చూపించాడు. చిరంజీవి దగ్గర నుండి అతని అభిమానులు, సినిమా ప్రేక్షకులు ఏమి కావలి, ఎలా కావాలి అని కోరుకుంటున్నారో అవన్నీ ఈ 'వాల్తేరు వీరయ్య' లో కనిపించేట్టు చేసాడు. అలాగే చిరంజీవి, శృతి హాసన్ మధ్య వచ్చే చిన్న చిన్న రొమాంటిక్ సన్నివేశాలు అలరించేట్టు, నవ్వించేట్టు బాబీ బాగా చూపించటమే కాకుండా, చిరంజీవి అప్పట్లో ఎలా చేసేవారో అలాగే ఇందులో కూడా కొన్ని సన్నివేశాల్లో హాస్యాన్ని బాగా పండించారు తన చిలిపి చేష్టలతో.

chiru-new.jpg

కథ విషయానికి వస్తే, బాబీ కథ ఏమీ కొత్తది తీసుకోలేదు. సవతులకు పుట్టిన ఇద్దరు అన్నదమ్ములు బయట ఇద్దరికీ పడినట్టు వున్నా, లోపల ఇద్దరు అన్నదమ్ములకు ఒకరి మీద ఇంకొకరికి చాల ప్రేమ ఉంటుంది, కానీ బయట పడరు. తమ్ముడికి ఏమి జరిగినా అన్న మనసు చాలా బాధపడుతుంది, అలాంటిది తమ్ముడి మీద కొందరు డ్రగ్ డీలర్స్ అవినీతి అంటగడతారు. మరి అన్న ఊరుకుంటాడా, వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకుంటాడు. ఇది చాల సింపుల్ కథ. బాబీ దీన్ని ఒక మెగా స్టార్, ఒక మాస్ మహారాజ రవితేజ లాంటి వాళ్ళని బట్టి కథ రాసుకొని, బాగా పండించాడు.

మొదటి సగం అంతా చిరంజీవి నడిపిస్తారు తన హావభావాలతో, చమక్కులతో. రెండో సగంలో రవి తేజ వస్తాడు, అతనికి చిరంజీవి కి మధ్య వచ్చే సన్నివేశాలు టాప్ లెవెల్ లో ఉంటాయి. అయితే సెకండ్ హాఫ్ లో కొన్ని సన్నివేశాలు డ్రాగ్ చేసినట్టు కూడా అనిపిస్తుంది. అలాగే కేథరిన్ ట్రెసా రోల్ కూడా ఇంకా కొంచెం బలంగా ఉంటే బాగుండేది. చిన్నప్పటి సన్నివేశాలు ఇంకా కొంచెం భావోద్వేగాలతో తీస్తే బాగుండేది. మొత్తం మీద దర్శకుడు బాబీ చిరంజీవిని ఎలా చూపించాలి అని అనుకున్నాడో, అలానే అభిమానులకి చూపించాడు. పాటలు స్క్రీన్ మీద చాలా బాగున్నాయి. రెండు పాటలు అయితే పూనకాలు లోడింగ్ థియేటర్స్ లో ...

veerayya.jpg

ఇంకా నటీనటుల విషయానికి వస్తే సినిమా అంతా చిరంజీవి తన భుజస్కంధాల మీద వేసుకున్నారు. చిరంజీవి అప్పట్లో ఎలా ఉండేవారో అలానే ఇందులో ఆ హావభావాలు, ఆ చిలిపి చేష్టలు, ఆ చిన్న చిన్న మేనరిజమ్స్ అన్నీ అదిరిపోయేట్టు చేశారు. అభిమానులను ఎలా అలరించాలో అతనికి తెలుసు, అవన్నీ పుష్కలంగా చేశారు. అలాగే డాన్స్ అదరగొట్టారు, యాక్షన్ సన్నివేశాల్లో కూడా చిరంజీవి సూపర్ గా వున్నారు. సినిమాలో చిరంజీవి కొంచెం తక్కువ వయస్సు వున్నవారిలా కనపడతారు. సినిమా అంతా చిరంజీవే. రవితేజ చిరంజీవి తమ్ముడిగా చాల బాగా సూట్ అయ్యాడు. అతను కూడా బాగా చెయ్యడమే కాకుండా, చిరు, రవి తేజ సన్నివేశాలు కన్నుల విందు చేస్తాయి. శృతి హాసన్ కి నిన్నటి సినిమాలో లా కాకుండా ఈ సినిమాలో కొంచెం ప్రాధాన్యత వున్న రోల్ ఇచ్చారు. ఆమె పాత్ర ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇంకా కాథరిన్ ట్రెసా కూడా తన పాత్ర పరిధి మేరకు బాగా చేసింది. కానీ ఆమె రోల్ కొంచెం బాగా రాసుంటే బాగుండేది. అలాగే రాజేంద్ర ప్రసాద్ మొదటి నుండీ చివరి వరకు కనపడతాడు. వెన్నెల కిషోర్ కూడా. ఇంక బాబీ సింహ, ప్రకాష్ రాజ్ విలన్స్ గా చేసారు, వాళ్ళకి ఇలాంటివి మామూలే. షకలక శంకర్, శ్రీనివాస రెడ్డి, ప్రదీప్ రావత్, నాజర్, సత్యరాజ్, సప్తగిరి వీళ్ళందరూ సపోర్టివ్ రోల్స్ లో కనపడతారు. ఊర్వశి రౌతేలా (Urvashi Rautela) స్పెషల్ సాంగ్ లో తళుక్కున మెరుస్తుంది.

chiru-dance.jpg

మాటలు బాగున్నాయి. చిన్న చిన్న డైలాగ్స్ చిరంజీవి మేనరిజమ్స్ కి (Chiranjeevi mannerisms) సరిపోయే విధంగా వున్నాయి. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం బాగుంది. రెండు పాటలు అయితే థియేటర్స్ లో పూనకాలు వచ్చేట్టు వున్నాయి. మిగతా పాటలు కూడా స్క్రీన్ మీద బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ సంగీతం కూడా దేవి బాగా ఇచ్చాడు. చిరంజీవి తన చిరు స్టెప్పులతో బాగా అలరిస్తారు. కోరియోగ్రఫీ కూడా బాగుంది. యాక్షన్ సన్నివేశాలు అయితే మాత్రం హైలైట్, అవి బాగా తీర్చి దిద్దారు, ముఖ్యంగా విశ్రాంతి ముందు వచ్చే పోరాట సన్నివేశం.

చివరగా, కుటుంబంతో పండగకు ఎంటర్ టైన్ మెంట్ కావాలంటే ఈ 'వాల్తేరు వీరయ్య' సినిమా తీరుస్తుంది. పెద్దగా కథ ఏమీ లేకపోయినా, దర్శకుడు బాబీ తీసే, చూపించే విధానం దానికి చిరంజీవి నటన, యాక్షన్ సన్నివేశాలు తోడు అయి ఈ సినిమా హాయిగా చూసుకునే విధంగా ఉంటుంది. ఇందులో కూడా చివరలో తల తెగి పడే సన్నివేశం వున్నా, అది చివర్లో వుంది. అది లేకపోతో ఇంకా బాగుండేది. 'వాల్తేరు వీరయ్య' సినిమా చూసిన వాళ్ళు అందరూ బయటకి వచ్చి నిన్న చూసిన సినిమా (వీరసింహా రెడ్డి) కన్నా ఇది ఎన్నో రేట్లు బాగుంది అని అంటున్నారు. అది మాత్రం నిజం. అందుకని చిరంజీవి సంక్రాంతి విన్నర్ అయ్యే అవకాశాలు మెండుగా వున్నాయి.

Updated Date - 2023-01-13T14:51:17+05:30 IST