Chiranjeevi: ఎన్ని విమర్శలు చేసినా ఆ స్థాయి తగ్గదు!
ABN , First Publish Date - 2023-08-22T18:22:26+05:30 IST
మెగాస్టార్ చిరంజీవి ఓ నట శిఖరం.. నాలుగు దశాబ్దాల ప్రయాణంలో ఆయన చూడని హిట్స్ లేవు.. సాధించని రికార్డులు లేవు. ఎన్నో ప్రశంసలు, పురస్కారాలు, అలాగే పరాజయాలు, విమర్శలు సక్సెస్, ఫెయిల్యూర్, ప్రశంస, విమర్శ ఏదైనా ఆయన చూసే తీరు ఒకటే..
మెగాస్టార్ చిరంజీవి ఓ నట శిఖరం..
నాలుగు దశాబ్దాల ప్రయాణంలో ఆయన చూడని హిట్సా..
సాధించని రికార్డులా..
ఎన్నో ప్రశంసలు, పురస్కారాలు,
అలాగే పరాజయాలు, విమర్శలు
సక్సెస్, ఫెయిల్యూర్, ప్రశంస, విమర్శ ఏదైనా ఆయన చూసే తీరు ఒకటే..
అన్నింటిని పాజిటివ్‌గా తీసుకుని తన మార్గంలో తాను వెళ్తూనే ఉన్నారు. ఆయన దారిలో ఎవరు ఎన్ని విమర్శించినా, అనుభవానికి, వయసుకి విలువ ఇవ్వకుండా ఎన్ని రకాల మాటలు అన్నా... ‘వింటారు.. పడతారు.. ఓపికగా భరిస్తారు.. ‘కాలమే చూసుకుంటుంది’ అంటూ వదిలేస్తారు. ఒక్క అడుగు కూడా పక్కకు వేయరు. ఒక్క మాట వదలరు. కానీ ఆయనిచ్చే సమాధానం ఒక్కటే.. చిన్న ‘చిరు’నవ్వు. ఆ నవ్వు ఎవరు ఎలా అర్థం చేసుకుంటే అలా అర్థమవుతుంది. మాటలతో నొప్పించరు. అవాకులు, చవాకులతో మనసుకు గాయం చేసిన వారిని సైతం క్షమించి దగ్గరకు తీసుకునే నైజం ఆయనది.
‘మాది సినిమా కులం..
మాకు కులం.. మతం.. ప్రాంతం అనే భేదాలు లేవు.
మేమంతా ఒకటే.. కళామతల్లి ముద్దు బిడ్డలం..
తరచూ పరిశ్రమలో వినిపించే మాట ఇది.
కానీ ఆచరణలో మాత్రం అదెక్కడా కనిపించదు. గ్రూపిజాలు, కాంపౌండ్‌ల లెక్కలే ఉంటాయి. అందుకు ఉదాహరణలు చాలానే ఉన్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమ శ్రేయస్సు కోరి చిరంజీవి పెద్దరికంగా మాట్లాడితే.. ఏపీ ప్రభుత్వానికి చెందిన మంత్రులు చిరుపై మాటలతో దాడులు చేశారు. ఆ సమయంలో చిరంజీవికి మద్దతుగా నిలిచింది ఎంతమంది? ఒక్కరంటే ఒక్క నటుడు కూడా ఇండస్ర్టీ తరపున ఆయనకు మద్దతుగా నిలవలేదు. పరిశ్రమలోని 24 శాఖలవారు, హీరోలు, దర్శనిర్మాతలు ఎవరూ చిరంజీవి వైపు మాట్లాడలేదు. కనీసం ఒక ట్వీట్ చేయలేదు. దీని బట్టి పరిశ్రమలో ఐక్యత లేదని స్పష్టమవుతోంది. పరిశ్రమలో కట్టడి లేదు కాబట్టే.. చిరంజీవి కూడా నాకు పెద్దరికం వద్దు అంటూ తప్పుకునే ప్రయత్నం చేశారు. అయినా పరిశ్రమలో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా మొదట స్పందించేది ఆయనే! అందుకే చిరంజీవి ఓ శిఖరం.
ఆధిపత్యం వాడికి ఇవ్వను...
చిరంజీవి నమ్మేది.. పాటించే సూత్రం గురించి పలు ఇంటర్వ్యూలో చెప్పారు. ‘‘ఎవరైనా సరే నా ప్రయేయం లేకుండా నన్ను ఆడిపోసుకున్నా.. నాకు సంబంధం లేకుండా టీవీల్లో నా గురించి అవాకులు, చవాకులు పేలినా, నన్ను తగ్గించేలా మాట్లాడినా నాకు నేను నవ్వుకుంటాను. ఎందుకంటే అది నేను కాదు. వాడి గుర్తింపు కోసం నా పేరును వాడుకుంటున్నాడు.. అయ్యో పాపం అనుకుంటానంతే!. నా మానసిక ప్రశాంతత, మనశ్శాంతి, సంతోషం నాకున్న ఆస్తులు. వాడెవడో వచ్చి ఏదో అంటే నేను అశాంతికి గురికాను. అలా చేస్తే నా శాంతిపై ఆధిపత్యం వాడికి ఇచ్చినట్లువుతుంది. ఆ ఆధిపత్యం వాడికి నేను ఇవ్వను’’ ఇదే నేను ఫాలో అయ్యే సూత్రం అని చిరంజీవి తరచూ చెబుతుంటారు.
ఆల్ ఇండియా మెచ్చిన ఆల్‌రౌండర్: కమల్‌హాసన్
ఈ మఽధ్యకాలంలో చిరంజీవిని పనిగట్టుకుని మరీ ట్రోల్ చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా ఎంతమంది కామెంట్ చేసినా ఆయన చిరునవ్వే వారికి ధీటైన సమాధానం. ‘ఒక్క సినిమా ఫ్లాప్ ఆయన ఇమేజ్‌ని ఏమాత్రం తగ్గించలేదని’ ఫ్యాన్స్ సదరు విమర్శకులకు అదే సోషల్ మీడియా వేదికగా కౌంటర్ ఇస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘భోళా శంకర్’ ఫ్లాప్ కావడంతో ఎవరిష్టం వచ్చినట్లు వారు మాట్లాడారు. ఇంతకు ముందూ ఆయన నటించిన చిత్రాలు పరాజయం పాలైన సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ చిత్రం విషయంలో ఇంకాస్త ఎక్కువ చేశారు. ఏ హీరోకి ఫ్లాప్‌లే లేనట్లు ట్రోల్ చేశారు. ఒక్క ఫ్లాప్ సినిమా ఆయన ఇమేజ్‌ను ఇంచు కూడా తగ్గించలేదని గ్రహించలేకపోతున్నారు సదరు ట్రోలర్స్. చిరు స్టార్‌డమ్ గురించి ఓ సందర్భంలో కమల్‌హాసన్ అన్న మాట ఇది. ‘‘నేను, రజనీకాంత్ కోలీవుడ్‌లో ఉన్నామని చిరంజీవి తమిళ సినిమా వైపు కన్నేయలేదు. ఆయన ఇటు వచ్చి ఉంటే ఇక్కడ కూడా సూపర్‌స్టార్ అయ్యేవాడు, ఆల్ ఇండియా మెచ్చిన ఆల్‌రౌండర్ చిరంజీవి’ అని. సభాముఖంగా అన్నారు. ‘ఆయన చూసిన కెరీర్ సాధించిన దానితో పోలిస్తే ‘‘భోళా శంకర్’ ఫెయిల్యూర్ ఎంత? 0.01 శాతం ఉంటుంది. దాని వల్ల ఆయన స్థాయి ఏ మాత్రం తగ్గదు. అదంతా ఆయనపై కొందరు చల్లుతున్న విషం అంతే. ఎవరెస్ట్ ముందు ఆ కామెంట్ల ఇంపాక్ట్ ఏపాటిది’’ అని యువ హీరో కార్తికేయ అన్నారు.
పరిశ్రమ కోసమే చేతులు జోడించారు...
పరిశ్రమలో కార్మికులకు ఏ సమస్య వచ్చినా మొదట పట్టించుకునే వ్యక్తి చిరంజీవి. ఇండస్ట్రీలో 24 శాఖల కార్మికులకు అండగా నిలబడుతున్న వ్యక్తీ చిరంజీవే! కష్టాలు ఎదురైనప్పుడు తట్టే తలుపు ఆయనదే. ఆ విషయాన్ని కొందరు మరచిపోయి చిరుపై విమర్శలు అనే రాళ్లు విసురుతున్నారు. కొన్ని సందర్భాల్లో తనను నమ్ముకున్న వారి గురించి చిరంజీవి తగ్గుతారు. అలా మెహర్ రమేశ్‌కు ‘భోళా శంకర్’ అవకాశం ఇచ్చారు. అంతే కాదు. భారీ బడ్జెట్ చిత్రాల కోసం టికెట్ల రేట్లు పెంచడం, ప్రత్యేక షోల విషయమై ఏపీ ముఖ్యమంత్రిని కలిసి ఓ మెట్టు దిగి చేతులు జోడించి పరిశ్రమకు అండగా ఉండమని కోరారు. చిరంజీవి స్టార్, స్టేచర్ ఉన్న వ్యక్తి జగన్ ముందు చేతులు జోడించాల్సిన అవసరం లేదు. ఆ రోజు చిరు అలా చేసింది ఆయన కోసం కాదు.. పరిశ్రమ కోసం. అప్పుడు కూడా పరిశ్రమకు చెందిన కొందరూ చిరంజీవి తనకు నచ్చినవాళ్లను తీసుకెళ్లి చేతులు కట్టుకొచ్చాడు అని కామెంట్ చేశారు.
విషయం పూర్తిగా వినకుండానే..
ఈ మధ్యన రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి చిత్ర పరిశ్రమ, కోట్లలో హీరోల పారితోషికం గురించి మాట్లాడడంతో దానిపై చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ 200 రోజుల వేడుకలో స్పందించారు. ‘రాష్ట్రంలో ఉన్న కష్టాలు, అభివృద్ధి మీద దృష్టిపెట్టండి.. ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయండి.. ఉపాధి ఎలా కల్పించాలో ఆలోచించండి.. అలా చేసి అభివృద్ధి మార్గంలో రాష్ట్రాన్ని నడిపిస్తే ప్రజలు నీరాజనాలు పలుకుతారు’ అంటూ చిరు హితవు పలికారు. దానికి తమనేదో అనేశారంటూ అభివృద్థి గురించి ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడలేని వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా క్యూ కట్టేశారు. చిరంజీవిపై తిట్ల పురాణం మొదలెట్టేశారు. ‘ఆయన ఏమన్నారు.. ప్రభుత్వానికి ఏం సూచించారు.. పూర్తిగా వినకుండా, అవగాహన లేకుండా విమర్శలతో దాడికి దిగేశారు. ఓ సినిమాకు నిర్మాత కోట్లు బడ్జెట్ పెడుతున్నారంటే అది ఆ హీరో, తనకున్న మార్కెట్ పరిగణలోకి తీసుకునే అన్న విషయం సదరు విమర్శకులకు తెలియక పోవచ్చు. ఓ సినిమా వస్తుంది అంటే మొదట హీరో ఎవరనే అడుగుతారు. హీరో ఫేస్ మీద సినిమా నడుస్తుందని, ఒక స్టార్ హీరో సినిమా చేస్తే 100 రోజుల పాటు 200 కుటుంబాలకు ఉపాధి, అన్నం దొరుకుందనే విషయాన్ని వైసీపీ నాయకులు తెలుసుకోవాలి. అదే స్టార్ సినిమా చేయకపోతే సినీ కార్మికులు రోడ్డున పడతారు అదే విషయాన్ని చిరంజీవి పరోక్షంగా చెప్పారు. ఇచ్చే నిర్మాతకు లేని నొప్పి ఈ నాయకులకు ఎందుకో అర్థం కాదు.