Chiranjeevi: గట్టి పోటీ అని భయపడ్డా.. ఆ తర్వాత ఊపిరి పీల్చుకున్నా!
ABN , Publish Date - Dec 28 , 2023 | 04:37 PM
'రామానాయుడు సంస్థలో ‘సంఘర్షణ’ సినిమా చేస్తున్న సమయంలో సురేష్ బాబుతోపాటు రామానాయుడుగారికి మరో అబ్బాయి ఉన్నాడని తెలిసింది. ఓ సందర్భంలో వెంకటేష్‌ని చూశా. అంతే నాలో గుబులు మొదలైంది.
''రామానాయుడు సంస్థలో ‘సంఘర్షణ’ సినిమా చేస్తున్న సమయంలో సురేష్ బాబుతోపాటు రామానాయుడుగారికి మరో అబ్బాయి ఉన్నాడని తెలిసింది. ఓ సందర్భంలో వెంకటేష్‌ని (Venkatesh) చూశా. అంతే నాలో గుబులు మొదలైంది. అప్పట్లో రామానాయుడు (Ramanaidu studios) బ్యానర్‌లో సినిమా చేయడం నాలాంటి వాళ్లకి భరోసా, దీమా. వాళ్ల అబ్బాయి హీరో అయితే నాకు గట్టిపోటీ ఎదురవుతుందని భయపడ్డా. కానీ తనకు సినిమాలపై ఆసక్తి లేదు రాజా అని రామానాయుడు చెప్పాక నేను ఊపిరి పీల్చుకున్నా’’ అని చిరంజీవి (Chiranjeevi) అన్నారు. వెంకటేష్ 75 సినిమాల ప్రయాణాన్ని పురస్కరించుకొని ‘వెంకీ 75 కలియుగ పాండవులు - సైంధవ్’ పేరుతో హైదరాబాద్‌లో ఓ వేడుక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథి విచ్చేసిన చిరంజీవి మాట్లాడుతూ ుూకొన్ని వేడుకలు మానసిక ఆనందాన్ని కలిగిస్తాయి. నాకు అలాంటి వేడుకే ఇది. వెంకటేష్‌తో నాకు 40 ఏళ్ల అనుబంధం ఉంది. 1983లో సురేశ్ ప్రొడక్షన్స్‌లో ‘సంఘర్షణ’ అనే సినిమా చేశా. అప్పుడు నిర్మాణ రంగంలో శిక్షణ పొందుతున్న సురేశ్‌బాబు పరిచయమయ్యారు. రామానాయుడికి రెండో అబ్బాయి కూడా ఉన్నాడని అప్పుడే తెలిసింది. ఎలా ఉంటాడు అని అడిగితే ‘ఫర్వాలేదు’ అని చెప్పారు. కానీ కొన్నాళ్ల తర్వాత గ్లామర్‌గా కనిపించిన వెంకటేశ్‌ను చూశాను. అప్పుడు నాలో గుబులు మొదలైంది. వాళ్ల అబ్బాయి హీరో అయితే నాకు గట్టిపోటీ ఎదురవుతుందని భయపడ్డా. కానీ తనకు సినిమాలు ఇంట్రెస్ట్ లేదని తెలిసి ఊపిరి పీల్చుకున్నా. రెండేళ్ల తర్వాత చదువు పూర్తి చేసి తిరిగొచ్చాడు. హీరోగా పరిచయమయ్యాడు. అప్పటి నుంచి మంచి మిత్రులుగా ఒకరి మంచిని మరొకరు కోరుకుంటూ ప్రయాణం చేస్తున్నాం. కథలో ఎంపికలో ఒక సినిమాకి మరో సినిమాకి పొంతన లేకుండా ప్రయాణం చేస్తున్నాడు వెంకీ. ‘మల్లీశ్వరి’ నాకు ఇష్టమైన చిత్రం. కుటుంబం, యాక్షన్, ప్రేమ కథలు ఇలా అన్ని రకాల సినిమాలు చేశాడు. ఈ ప్రయాణం అప్రతిహతంగా సాగాలని కోరుకుంటున్నా. మేం కలిసి సినిమా చేయాలనేది తన కోరికా నా కోరికా. మంచి కథ కుదిరితే నా సోదరుడు వెంకీతో సినిమా చేయడం చాలా ఆనందకర విషయం అవుతుంది. మా ఇద్దరి మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. కెరీర్‌నే కాకుండా వ్యక్తిగత జీవితాన్ని కూడా అందంగా నిర్మించుకున్నాడు. సంపూర్ణ వ్యక్తిత్వానికి వెంకటేష్ ఓ మంచి నిర్వచనంగా భావిస్తాను’’ అని అన్నారు.
హిమాలయాలకు వెళ్లకుండా ఆగాను: వెంకటేష్
‘‘నేను ఇన్ని సినిమాలు చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు. ఇది నాన్న బలమైన కోరిక. అన్నయ్య ఎంకరేజ్‌మెంట్‌తో హీరోనయ్యా. గురువు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ‘కలియుగ పాండవులు’తో ఇండస్ట్రీలో నా జర్నీ మొదలైంది. దాసరి నారాయణరావు, కె.విశ్వనాథ్ వంటి అగ్ర దర్శకులతో కలిసి పనిచేయడం అద్భుతమైన అనుభవం. అభిమానులు ఆదరణతోనే ఇన్ని చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించాను. మొదట్లో ‘విక్టరీ’ అనేవారు. తర్వాత ‘రాజా’ అని పిలిచారు. కొన్నాళ్లు ‘పెళ్లికాని ప్రసాద్’ అన్నారు. తర్వాత ‘పెద్దోడు’, ‘వెంకీ మామ’ అన్నారు. ఇలా పిలుపు మారిందేమో గానీ ప్రేమ మాత్రం స్థిరంగా ఉంది. అందుకే రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నాను.చాలాసార్లు కెరీర్‌ను వదిలి పెట్టి వెళ్లిపోదాం అనుకునేవాణ్ని. అంతలోనే చిరంజీవి వచ్చి ఓ బ్లాక్ బస్టర్ సినిమాని ఇచ్చేవారు. నా తోటి హీరోలైన బాలకృష్ణ, నాగార్జున వీళ్లంతా పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేవారు. అందుకే హిమాలయాలకు వెళ్లకుండా సినిమాలు చేశా. "సైంధవ్’ నా 75వ చిత్రం. మంచి సినిమా అవుతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 13 విడుదల చేస్తున్నాం. మీ అందరినీ అలరిస్తుంది. నా ప్రయాణంలో కుటుంబం అందించిన ప్రోత్సాహం చాలా గొప్పది. చిరంజీవితో కలిసి త్వరలోనే సినిమా చేస్తా’’ అని అన్నారు.
కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ ‘‘వి అంటేనే విక్టరీ అనే డైలాగ్‌తోనే వెంకటేశ్ ప్రయాణం మొదలైంది. అలాగే తన జర్నీ కొనసాగుతోంది. రామానాయుడు నాపై పెట్టిన బాధ్యత మేరకే వెంకటేశ్‌ని తెరకు పరిచయం చేశా. తన ఎదుగుదలకు మాత్రం తను ఎంచుకున్న కథలు, పాత్రలు, తన సోదరుడే కారణం. వెంకీ చేసినన్ని భిన్నమైన కథల్ని ఏ హీరో చేసి ఉండరు’’ అని అన్నారు.