Chandrabose: 15 ఏళ్ల కల సాకారమైంది..
ABN , First Publish Date - 2023-08-25T14:04:17+05:30 IST
ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు గేయ రచయిత చంద్రబోస్ మాత్రం మొదట రచ్చ గెలిచి.. ఇప్పుడు ఇంట గెలిచిన ఆనందంలో ఉన్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలోని నాటు నాటు’ పాటకుగానూ అంతర్జాతీయ వేదికపై ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ అవార్డులు గెలుచుకున్న ఆయన భారతదేశం ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ పురస్కారాన్ని గెలుచుకున్నారు.
ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు గేయ రచయిత చంద్రబోస్ (Chandrabose) మాత్రం మొదట రచ్చ గెలిచి.. ఇప్పుడు ఇంట గెలిచిన ఆనందంలో ఉన్నారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమాలోని నాటు నాటు’ పాటకుగానూ అంతర్జాతీయ వేదికపై ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ అవార్డులు గెలుచుకున్న ఆయన భారతదేశం ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ పురస్కారాన్ని గెలుచుకున్నారు. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పంజా వైష్ణవ్ తేజ్, రకుల్ జంటగా నటించి ‘కొండపొలం’ (kodapolam) చిత్రంలో ‘ధం ధం ధం’ పాటకు ఉత్తమ గీత రచన విభాగంలో చంద్రబోస్‌ను జాతీయ పురస్కారం వరించింది. ఆయనకు దక్కిన తొలి నేషనల్ అవార్డ్ ఇది. ఈ సందర్భంగా ఆయన తన ఆనందాన్ని పంచుకున్నారు. (national award)
‘ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ అవార్డులు గెలుచుకుని రచ్చ గెలిచాను. ఇప్పుడు ‘కొండపొలం’లో పాటతో జాతీయ పురస్కారం సాధించి ఇంట గెలిచాను. ఇంత కన్నా ఆనందం ఏముంటుంది. ఈ ఏడాదిలో జీవితమే సఫలమైనట్లు అనిపిస్తుంది. నా ఇన్నాళ్ల శ్రమ ఒక్కసారిగా వెలుగులోకి వచ్చినట్లయింది. ఈ జాతీయ అవార్డు గెలుచుకోవడమన్నది నా 15 ఏళ్ల కల. ప్రతి ఏడాది ఎదురుచూడడం నిరుత్సాహపడడం మామూలు అయిపోయింది. అలా ఎదురుచూడడం కూడా అలవాటైపోయింది. కానీ ఈసారి మాత్రం చాలా సంతోషంగా ఉంది. అంతకుమించి సంతృప్తిగానూ ఉంది. అడవి, మన పర్యావరణం, అది మనకు చేేస మేలు గురించి చక్కటి సాహిత్యం ఈ పాట రాశాను. దాని భావాన్ని, పాటను జ్యూరీ గుర్తించింది. చిన్న సినిమా.. పెద్ద సినిమా అని కాదు.. మనం ఓ పాటను నిజాయతీగా.. నిబద్థతతో రాస్తే దానికి రావాల్సిన గుర్తింపు దానంతట అదే వస్తుందన్న నమ్మకం మరోసారి నిజమైన సందర్భమిది. అసలు నేను ‘ఆర్‌ఆర్‌ఆర్’, ‘పుష్ప’ చిత్రాల్లోని పాటల్లో దేనికైనా అవార్డు వస్తుందనుకున్నా. కానీ ఈ గీతానికి వస్తుందని అసలు ఊహించలేదు. వాస్తవానికి ఈ పాట జనాల్లో ఎక్కువ వినిపించకపోయినా... దీంట్లో పర్యావరణం గురించి ఓ గొప్పతనం ఉంది. ఈ 69వ జాతీయ చలన చిత్ర పురస్కారాల ప్రకటన కార్యక్రమం చూస్తుంటే.. తెలుగు పాటల అవార్డుల వేడుకలా అనిపించింది. ముఖ్యంగా తెలుగు సినిమా సంగీతంలోని నాలుగు విభాగాల్లో సత్తా చాటడం మరింత ఆనందాన్ని కలిగించింది. ప్రస్తుతం నేను ‘పుష్ప2’ పాటల పనిలో ఉన్నా. ఇప్పటికే మూడు పాటలు రెడీ అయ్యాయి. మరోపాట పూర్తి చేసే పనిలో ఉన్నా’’ అని తెలిపారు.