Buchi Babu Sana: బాధ్యత పెరిగింది.. ఒళ్లు దగ్గర పెట్టుకోవాలి!
ABN , First Publish Date - 2023-08-25T17:12:06+05:30 IST
దర్శకుడిగా తొలి చిత్రం ‘ఉప్పెన’తో బ్లాక్‌బస్టర్ అందుకున్నారు బుచ్చిబాబు సాన. తొలి అడుగులోనే రూ.100కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టి సత్తా చాటారు. ఇప్పుడు ఆయనకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ పురస్కారం గెలుచుకుంది.
దర్శకుడిగా తొలి చిత్రం ‘ఉప్పెన’తో (Uppena) బ్లాక్‌బస్టర్ అందుకున్నారు బుచ్చిబాబు సాన. తొలి అడుగులోనే రూ.100కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టి సత్తా చాటారు. ఇప్పుడు ఆయనకు మరో అరుదైన గౌరవం దక్కింది. ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా జాతీయ పురస్కారం (Best movie) గెలుచుకుంది. ఈ నేపధ్యంలో బుచ్చిబాబు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. (National award)
తొలి చిత్రంతోనే వంద కోట్ల క్లబ్‌లో చేరడం, ఇప్పుడు జాతీయ పురస్కారం అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందాన్ని మాటల్లో ఎలా వర్ణించాలో తెలియడం లేదు. నోట మాట రావడం లేదు. జీవితంలో రిస్క్ చేస్తే ఏదో ఒకటి సాధించవచ్చు అంటారు. అది నాకు ఈ చిత్రంతో వచ్చిందనిపించింది. ఎందుకంటే ఇది ఎవరూ రాయని కథ. ముఖ్యంగా క్లైమాక్స్ చాలా ప్రత్యేకం. అదే అందర్నీ మెప్పించింది. ఇప్పటికే ఈ చిత్రానికి పలు అవార్డులు వచ్చాయి. జాతీయ అవార్డు కూడా రావడంతో లతఅవార్డుల పరంపర పరిపూర్ణమైందనిపిస్తోంది. అవార్డులను దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రం తీయలేదు. ఈ కథ చెప్పిన వెంటనే చిరంజీవి ‘ఈ సినిమా నీకెన్నో అవార్డులు తీసుకొస్తుంది. జాతీయ అవార్డు కూడా వస్తుందని చెప్పారు. మా గురువు సుకుమార్ కూడా ఇదే మాట అన్నారు. ఈరోజు వారి మాటలు నిజమయ్యాయి. నా తొలి ప్రయత్నాన్ని మెచ్చి ప్రేక్షకులు వంద కోట్లు కలెక్షన్లు ఇచ్చారు. తర్వాత ఏం వచ్చిన బోనస్ అనుకన్నా. జాతీయ పురస్కారంతో నాపై బాధ్యత పెరిగింది.
తల్లిదండ్రులకు గురువుకు అంకితం..
నేషనల్ అవార్డు వచ్చిందని తెలియగానే అమ్మ ‘ఏంట్రా ఏదో అవార్డు వచ్చిందటగా అన్నారు. నిజానికి ఆమెకు వీటి గురించి అంతగా తెలీదు. ‘ఇది దేశంలోనే చాలా పెద్ద అవార్డు అని అమ్మకు వివరిేస్త.. ‘ఇంతకంటే పెద్ద అవార్డు లేదు కదా’ అంటూ చాలా సంతోష పడింది. ఈ అవార్డును నా తల్లిదండ్రులకున నా గురువు, సుకుమార్‌కు అంకితమిస్తున్నా.
చరణ్‌తో రా అండ్ రస్టిక్‌గా
ప్రతి సినిమాను మొదటి సినిమాలాగే చేయాలని మా గురువు సుకుమార్ దగ్గర నేర్చుకున్నా. ఈ పురస్కారంతో ఒళ్లు మరింత దగ్గర పెట్టుకొని పని చేయాలని నిర్ణయించుకున్నా. రామ్‌చరణ్‌తో చేయబోయే నా తర్వాతి చిత్రం చాలా రా అండ్ రస్టిక్‌గా ఉంటుంది. స్ర్కిప్ట్ పనులు పూర్తయ్యాయి. డిసెంబర్, జనవరి మధ్యలో షూటింగ్ మొదలువుతుంది.