Bhagavanth Kesari : ప్రతి తల్లి, బిడ్డలో మార్పు తీసుకొస్తుందా? దర్శకుడు దానికి నాంది పలికాడా?

ABN , First Publish Date - 2023-10-21T12:02:52+05:30 IST

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన 'భగవంత్ కేసరి' (Bhagavanth kesari) సూపర్‌హిట్‌ టాక్‌తో నడుస్తోంది. బాలయ్య నటన, మాస్‌  యాక్షన్  ఎలిమెంట్స్‌ డైలాగ్స్‌ విపరీతంగా ఆకట్టుకున్నాయిని అభిమానులు, నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

Bhagavanth Kesari : ప్రతి తల్లి, బిడ్డలో మార్పు తీసుకొస్తుందా? దర్శకుడు దానికి నాంది పలికాడా?

నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా.. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన 'భగవంత్ కేసరి' (Bhagavanth kesari) సూపర్‌హిట్‌ టాక్‌తో నడుస్తోంది. బాలయ్య నటన, మాస్‌  యాక్షన్  ఎలిమెంట్స్‌ డైలాగ్స్‌ విపరీతంగా ఆకట్టుకున్నాయిని అభిమానులు, నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. విడుదలైన రెండు రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.52.12 కోట్లు గ్రాస్‌ రాబట్టిందని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ చిత్రం గురించి నెట్టింట చర్చ జరుగుతోంది. అభిమానులు సినిమాలోని ఓ సన్నివేశాన్ని నెట్టింట ట్రెండ్‌ చేస్తున్నారు. 'బ్యాడ్‌ ట చ్ ’ గురించి చిన్నారులకు వివరించే సన్నివేశమది.

‘పాపా.. నీకు వాడు చాక్లెట్‌ ఇచ్చి నీ మీద చేతులేస్తుంటే అది తప్పని నీకు తెలియదా?’

స్కూల్‌ డ్రెస్‌లో ఉన్న ఓ చిన్నారిని అడుగుతాడు 'భగవంత్‌ కేసరి’. చాక్లెట్‌ తింటున్న ఆ చిన్నారి ‘ఊహూ..’ అని అమాయకంగా చెబుతుంది.

అలా వేయరాని చోట చెయ్యి వేస్తే తప్పు అని ఆ చిన్నారికి ఎవరో ఒకరు చెబితేనే కదా తెలిసేది. మరి ఎవరు చెప్పాలి? ఇంట్లో అమ్మ లేదా స్కూల్లో టీచర్‌. కానీ, వాళ్లు చెప్పడం లేదు. చెప్పాలని కూడా వారికి తోచదు. కొందరికి చెప్పాలని ఉన్నా ఎలా చెప్పాలో అన్న సంశయంతో ఆగిపోతున్నారు. అభంశుభం తెలియని చిన్నారులపై మేకవన్నె పుల్లులాంటి కొందరు మానవ మృగాలు చేస్తున్న అకృత్యాల గురించి విని, తెలుసుకుని తల్లిదండ్రులు ఉలిక్కి పడుతున్నారే తప్ప తమ బిడ్డలకు జాగ్రత్తలు చెప్పే ప్రయత్నం చేయడం లేదు. సమాజంలో ప్రస్తుతం జరుగుతున్నది ఇదే. అయితే ఆడబిడ్డల కోసం ఆ పని చేయడానికి సినిమాటిక్‌ వేలో ముందుకొచ్చాడు అడవి బిడ్డ నేలకొండ భగవంత్‌ కేసరి.

Untitled-3.gif

ఆ పాపను ఎత్తుకుని నేరుగా వాళ్ల స్కూల్‌కు వెళ్లాడు. అక్కడ టీచర్లు ఏనాడూ చెప్పని ‘బ్యాడ్‌ టచ్‌’ పాఠం పిల్లలు అందరికీ వివరించాడు. ఆటో డ్రైవరు, స్కూల్లో ప్యూను, పక్కింటి అంకుల్‌, ఆఖరికి ఇంట్లో తాతయ్య, అన్నయ్య, తండ్రి అయినా సరే.. వేయరాని చోట చేయి వేస్తే వెంటనే పరిగెత్తుకెళ్లి అమ్మకు చెప్పమని.. అమ్మనే మిమ్మల్ని కాపాడుకుంటుందని భగవంత కేసరి చెప్పాడు. అంతే కాదు అమ్మలకూ ఓ మాట చెప్పాడు. ‘మా అడవిలో 'ఇక్కడ క్రూరమృగాల తిరుగుతుంటాయి అని బోర్డు ఉంటుంది. కానీ ఈ సమాజంలో మాత్రం మానవ మృగాలు నుంచి జాగ్రత్తగా ఉండాలని'ఎలాంటి సూచికలు ఉండవు’. కాబట్టి అమ్మలే తమ బిడలకు ఆ జాగ్రత్తలు చెప్పాలని సూచించాడు. సినిమాలో ఆ వేదిక మీద చెప్పింది స్కూల్‌ పిల్లలు, వారి కుటుంబ సభ్యులకే కావచ్చు. కానీ అదే విషయాన్ని సినిమాకు వచ్చిన చూసిన ప్రతి ఒక్క తల్లికీ, తండ్రికీ, చిన్నారికీ చెప్పినట్లే కదా!

ఓ అగ్ర హీరో నటించిన పక్కా కమర్షియల్‌ చిత్రంలో ఇలాంటి అంశాన్ని స్పృశించడం అభినందనీయం. ఈ సన్నివేశం ద్వారా దర్శకుడు అనిల్‌ రావిపూడి మహిళలను, పిల్లలను కాస్త ఆలోచనలో పడేసినట్లే అనిపించింది.  ఆడపిల్లను సింహంలా పెంచాలనే మంచి సందేశం జనాల్లోకి వెళ్లింది. సినిమాలో ఈ మాట విన్నాక ప్రతి అమ్మ ఆ ప్రయత్నం చేస్తారని ఆశిద్దాం. ప్రస్తుతం ఈ సన్నివేశం గురించే ఎక్కువ జరుగుతుంది. సోషల్ మీడియాలో  చర్చకు వచ్చింది అంటే దర్శకుడు చెప్పింది జనాలకు బాగా కనెక్ట్‌ అయిందనే అర్థం. మరి దాన్ని ప్రతి తల్లి, బిడ్డ ఆచరణలోకి తీసుకొస్తే.. అనిల్‌ రావిపూడి డబుల్‌ సక్సెస్‌ అయినట్లే. ఓ మంచి మార్పునకు నాంది పలికినట్లే!

Updated Date - 2023-10-21T20:54:23+05:30 IST