Sir: ఆడవుంది నీవే.. ఈడ ఉంది నీవే.. నీది కానీ చోటే లేనేలేదు

ABN , First Publish Date - 2023-01-17T17:14:28+05:30 IST

తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) హీరోగా.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sithara Entertainments).. శ్రీమతి సాయి సౌజన్య (ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థ) తో కలసి

Sir: ఆడవుంది నీవే.. ఈడ ఉంది నీవే.. నీది కానీ చోటే లేనేలేదు
Dhanush In Sir Movie

తమిళ స్టార్ హీరో ధనుష్ (Dhanush) హీరోగా.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sithara Entertainments).. శ్రీమతి సాయి సౌజన్య (ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థ) తో కలసి నిర్మిస్తున్న చిత్రం ‘సార్’. శ్రీకర స్టూడియోస్ చిత్ర నిర్మాణ సంస్థ సమర్పిస్తోన్న ఈ చిత్రంలో ధనుష్ సరసన సంయుక్త మీనన్ (Samyuktha Menon) హీరోయిన్‌గా నటిస్తోంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెలుగు, తమిళంలో రూపుదిద్దుకుంటోన్న ఈ ద్విభాషా చిత్రానికి సంబంధించి ప్రస్తుతం నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉండగా, మరోవైపు చిత్రం పాటల ప్రచార పర్వం వైపు అడుగు వేసింది చిత్ర బృందం. అందులో భాగంగా చిత్రానికి సంబంధించిన ‘బంజారా’ అనే లిరికల్ సాంగ్‌ని మంగళవారం మేకర్స్ విడుదల చేశారు. శ్రీశ్రీ, వేటూరి తర్వాత జాతీయ అవార్డు అందుకున్న తెలుగు గీత రచయిత సుద్దాల అశోక్ తేజ (Suddala Ashok Teja) రచించిన ఈ పాట.. ఇంతకుముందు ఆయన కలం నుంచి జాలువారిన పాటలలానే బలమైన సాహిత్యంతో ఉంది.

‘‘ఆడవుంది నీవే ఈడ ఉంది నీవే

నీది కానీ చోటే లేనేలేదు బంజారా

యాడ పుట్టె తీగ యాడ పుట్టె బూర

తోడు కూడినాక మీటిచూడు తంబూర’’ అంటూ సుద్దాల అశోక్ తేజ అందించిన సాహిత్యం హృదయాన్ని హత్తుకునేలా ఉంది. ‘ఏదీ మన సొంతం కాదు. కష్టాలు, సుఖాలు శాశ్వతం కాదు. ఈ క్షణాన్ని ఆస్వాదించడమే జీవితం’ అనే అర్థమొచ్చేలా పదునైన మాటలతో, లోతైన భావంతో ఆయన కలం నుంచి జాలువారిన అక్షరాలు ఆలోచింపజేసేలా ఉన్నాయి. సుద్దాల అద్భుతమైన సాహిత్యానికి అంతే అద్భుతమైన జి వి ప్రకాష్ కుమార్ (GV Prakash Kumar) సంగీతం, అనురాగ్ కులకర్ణి (Anurag Kulkarni) స్వరం తోడై పాటను మరో స్థాయికి తీసుకెళ్లాయి. ప్రస్తుతం ఈ లిరికల్ వీడియో ఆకట్టుకుంటోంది. ఇందులోని లోకేషన్స్ పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఉన్నాయి. కథానాయకుడు ఊరిలో వాళ్ళతో కలిసి నాట్యం చేయడం, అలాగే హోటల్‌లో స్నేహితులతో కలిసి తిని బయటకు వచ్చాక అక్కడున్న చిన్నారికి డబ్బు సాయం చేయడం వంటివి అతని పాత్ర తీరుని, స్వభావాన్ని తెలియజేస్తున్నాయి. గీతంలోని సాహిత్యానికి అద్దం పట్టేలా కథానాయకుడి పాత్ర ఉంది. అలాగే ఈ లిరికల్ వీడియోలో పెళ్లి బృందంతో కలిసి సంగీత దర్శకుడు జి.వి ప్రకాష్, గాయకుడు అనురాగ్ కులకర్ణి నాట్యం చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సంగీతానికి తగ్గట్లుగా నృత్య దర్శకుడు విజయ్ బిన్ని అందించిన స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి.

ఈ పాట విడుదల సందర్బంగా సుద్దాల అశోక్ తేజ మాట్లాడుతూ.. ‘‘జీవితం వెనుక ఉన్న వేదాంతాన్ని, జనన మరణాల మధ్య ఉన్న బతుకు బాట, దాని పరమార్థాన్ని చిత్ర కథానుసారం చెప్పే ప్రయత్నం చేశాం. భగవంతుడు మనకు ఏమీ చేయట్లేదని అనుకోవద్దు. నీకోసం ఒక స్థానం పెట్టాడు. అక్కడికి చేరుకోవటం నీ భాధ్యత అని చెప్పే పాట ఇది. బతుకు ప్రయాణం గురించి పాట కావాలని, చిత్ర కథ, సందర్భం దర్శకుడు చెప్పిన తీరు నచ్చింది. ఆది శంకర తత్వాన్ని, భగవద్గీత సారాన్ని దృష్టి లో ఉంచుకుని ఈ గీతానికి సాహిత్యం అందించటం జరిగింది’’ అని అన్నారు. కాగా, విద్యావ్యవస్థ తీరు తెన్నుల మీదుగా కథానాయకుడు సాగించే ప్రయాణం అందులోని సమస్యలు, సంఘటనలు ‘సార్’ జీవితాన్ని ఏ తీరానికి చేర్చాయన్నది అటు ఆసక్తిని, ఇటు ఉద్విగ్నత కు గురి చేస్తుందని చిత్ర నిర్మాతలు తెలిపారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని 17 ఫిబ్రవరి, 2023న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా వారు వెల్లడించారు.

Updated Date - 2023-01-17T17:14:30+05:30 IST