Balagam Singer: బలగం గాయకుడికి ఎంత కష్టం... 11 చోట్ల రంధ్రాలు.. అయినా.. అదే సమస్య!
ABN , First Publish Date - 2023-03-30T17:28:19+05:30 IST
జబర్దస్త్ కమెయన్ వేణు (Venu) తొలిసారి మెగాఫోన్ పట్టి తెరకెక్కించిన చిత్రం ‘బలగం’(Balagam). తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ప్రతిబింబించేలా అద్భుతంగా మలిచారు వేణు.
జబర్దస్త్ కమెయన్ వేణు (Venu) తొలిసారి మెగాఫోన్ పట్టి తెరకెక్కించిన చిత్రం ‘బలగం’(Balagam). తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు ప్రతిబింబించేలా అద్భుతంగా మలిచారు వేణు. దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్‌పై శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించిన ఈ చిత్రంలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ నటీనటులు. ఎలాంటి స్టార్స్, అంచనాలు లేకుండా తక్కువ బడ్జెట్‌లో రూపొంది ఈ నెల 3న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. కథలో బలముంటే ప్రేక్షకాదరణ తప్పకుండా ఉంటుందని నిరూపించింది. థియేటర్లలో 25 రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అందుబాటులో ఉంది. అయితే ఈ చిత్రానికి క్లైమాక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సంగతి తెలిసిందే! సినిమా చివర్లో వచ్చే ‘తోడుగా మాతోడుండి’ పాటను చూసి అందరూ కన్నీరుమున్నీరవుతున్నారు. అంతగా ప్రేక్షకులను కదిలించిన ఆ పాటను ఆలపించింది వరంగల్ జిల్లా దుగ్గొంచి మండలానికి చెందిన బుడగజంగాల కళాకారులు పస్తం మొగిలయ్య(Mogilayya Suffering with Kidne Failure), కొమురమ్మ దంపతులు. ఈ పాటను అద్భుతంగా ఆలపించడమే కాకుండా నటించారు కూడా. తమ గాత్రం, అభినయంతో అందరినీ కన్నీళ్లు పెట్టించిన ఆ దంపతులు.. నిజ జీవితంలో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మొగిలయ్య దంపతులు బుర్ర కథలు చెప్పుకుంటూ జీవితం సాగిస్తున్నారు. అలా వచ్చిన సంపాదనతో కడుపు నింపుకుంటున్నారు. ఇదీ కాకుండా కరోనా సమయంలో మొగిలయ్య రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయి. క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకోవలసిన పరిస్థితి. మొగిలయ్య పరిస్థితి తెలుసుకున్న బలగం దర్శకుడు వేణు రూ.లక్ష ఆర్థిక సహాయం కూడా అందజేశారు. నిర్మాత దిల్ రాజుతో మాట్లాడి మరికొంత సహాయం అందేలా చూస్తానని హామీ ఇచ్చారు. ఇంతలోనే మెగిలయ్య తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. గత కొంత కాలంగా మొగిలయ్య శరీరం డయాలసిస్‌కు కూడా సహకరించడం లేదంటున్నారు వైద్యులు.
డయాలసిస్ చేసే క్రమంలో రక్తం ఎక్కించేందుకు అవసరమైన ఆపరేషన్ పాయింట్ దొరకడం చాలా కష్టంగా ఉందంటున్నారు. దీనికోసం ఇప్పటికే మొగిలయ్య శరీరంపై దాదాపు 11చోట్ల రంధ్రాలు చేశారట. ప్రస్తుతం ఛాతీ నుంచి రక్తం ఎక్కిస్తున్నారట. ఈక్రమంలోనే మొగిలయ్య తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. ఇక మొగిలయ్య ఆరోగ్యశ్రీ ద్వారా డయాలసిస్ ఉచితంగా చేస్తున్నా.. ఇతర చికిత్స నిమిత్తం వారానికి మూడుసార్లు దుగ్గొండి నుంచి వరంగల్ సంరక్ష ఆస్పత్రికి రావడంతో కొమురమ్మ దంపతులకు ఆర్థిక పరిస్థితి భారంగా మారింది. వరంగల్ వచ్చి వెళ్లడానికి, ప్రతి నెలా మంధులకు రూ. 20 వేల దాకా ఖర్చు అవుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మొగిలయ్య వైద్యం కోసం ఇప్పటికే రూ.14 లక్షలు ఖర్చు చేశామని.. అందులో 6 లక్షల రూపాయలు అప్పేనని ఆమె చెప్పారు.