Balagam: 81 దేశాలు.. 780 సినిమాలతో పోటీ!

ABN , First Publish Date - 2023-05-01T11:26:09+05:30 IST

చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసుకున్న ‘బలగం’ చిత్రానికి మరో పురస్కారం దక్కింది.

Balagam: 81 దేశాలు.. 780 సినిమాలతో పోటీ!

చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసుకున్న ‘బలగం’ (Balagam)చిత్రానికి మరో పురస్కారం దక్కింది. ప్రాంతాలతో సంబంధం లేకుండా ప్రేక్షకుల మదిని గెలిచింది. తెలంగాణ ఆత్మ, బంధాలు, బంధుత్వాలు విలువలు, మట్టివాసన గురించి చెప్పిన ఈ చిత్రానికి ఇప్పటికే పలు గ్లోబల్‌ అవార్డులు దక్కాయి. తాజాగా 13వ దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ (Dada saheb Phalke Film Festival) ఫెస్టివల్‌లోనూ ఈ సినిమా పేరు మారుమోగుతోంది. చిత్ర సంగీత దర్శకుడు భీమ్స్‌ సిసిరిలియోకు ఉత్తమ సంగీత దర్శకుడిగా అవార్డు దక్కింది. భీమ్స్‌, నిర్మాతల్లో ఒకరైన హర్షిత్‌ రెడ్డి ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారం అందుకున్నారు. దాదాపు 780కి పైగా సినిమాలు, 81 దేశాల నుంచి సంగీత దర్శకుదర్శకులు పోటీపడ్డారు. కానీ తెలంగాణ మట్టివాసన, ఇక్కడి సంగీతానికున్న తడి ప్రపంచ దేశాల మెప్పు పొందాయి.

2.jpg

నేటివిటీకి దగ్గరగా వేణు యెల్దంది దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. బాక్సాఫీస్‌ దగ్గర కాసుల వర్షం కురిపించింది. 50 రోజులు దాటుతున్నా సినిమా క్రేజ్‌ ఇంకా తగ్గలేదు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో తెరపై ఈ చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. దిల్‌రాజు సమర్పణలో ప్రియదర్శి, కావ్యా కల్యాణ్‌రామ్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి కథతోపాటు సంగీతం ఆయువుపట్టుగా నిలిచింది. భీమ్స్‌ ప్రాణం పెట్టి పనిచేశారు. ఆయన పడ్డ శ్రమ స్ర్కీన్‌ మీద ప్రతిబింబించింది. ప్రతి ప్రేక్షకుడూ ఆ బాణీలకు, నేపథ్య సంగీతానికి ఫిదా అయ్యారు. ఫలితంగా ఈ అరుదైన పురస్కారం వరించింది.

Updated Date - 2023-05-01T11:26:09+05:30 IST