YSR: వైఎస్ రాజశేఖర్ రెడ్డిని అవమానపరిచేలా సాంఘీక మాధ్యమంలో రాతలు... క్లారిటీ ఇచ్చిన అనంత శ్రీరామ్
ABN , First Publish Date - 2023-07-05T15:57:36+05:30 IST
ప్రముఖ పాటల రచయిత అనంత శ్రీరామ్ ఒక వివాదం లో చిక్కుకున్నాడు. ఒక సాంఘీక మాధ్యమం ద్వారా దివంగత ముఖ్యమంత్రి వైస్సార్ ని అవమానపరిచే విధంగా పోస్టులు వచ్చాయి. వాటి వెనక అనంత శ్రీరామ్ వున్నాడు అనే వార్త కూడా వస్తే, దానికి అనంత శ్రీరామ్ ఒక వీడియో విడుదల చేసాడు.
లిరిక్ రైటర్ అనంత శ్రీరామ్ (AnanthaSreeram) చాలా చిన్న వయసులోనే మంచి పేరు సంపాదించికున్న రచయిత. చలన చిత్రాల్లో చాలా హిట్ సాంగ్స్ రాసి అందరి చేత ప్రశంసలు పొందిన రచయిత శ్రీరామ్. ప్రస్తుతం అతను నాటా (NATA) సభలకి అమెరికా (America) వెళ్ళాడు. అయితే అతని ఇక్కడ హైదరాబాద్ లో ఒక వివాదాస్పదమైన సంఘటనలో ఇరుక్కున్నాడు. కొంతమంది సాంఘీక మాధ్యమంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని (YSRajasekharReddy) అవమాన పరుస్తూ ఏవో పోస్టులు పెట్టారు. అయితే ఆ పోస్టులు వెనక అనంత శ్రీరామ్ వున్నదని, అతనే పెట్టాడని, అతనే రాసాడని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఈ వివాదం మీద అనంత శ్రీరామ్ (AnanthaSreeramControversy) ఒక వీడియో విడుదల చేసి తన ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి వ్యతిరేకంగా, ఆయన్ని అవమానపరిచేలా పొలిటికల్ మిస్సైల్ అన్న ఖాతాలో కొన్ని పోస్టులు, రాతలు పెడుతున్నారు. ఆ రాతల వెనక, పోస్టుల వెనక వున్నది నేనే అనే వదంతులు వ్యాపించాయి. నాకు ఆ రాతలకు, పోస్టులకు ఏమాత్రం సంబంధం లేదు. నేను అన్ని పార్టీలకి పాటలు రాస్తాను, అది నా వృత్తి కాబట్టి. అంతేకానీ ఏ పార్టీ పైనా నాకు వ్యక్తిగతంగా ఎటువంటి అభిప్రాయం లేదు అని చెప్పాడు అనంత శ్రీరామ్ ఆ పోస్టులో.
ఈ వదంతులను నమ్మవద్దని వైసీపీ (YCP) శ్రేణులకు అనంత శ్రీరామ్ విజ్ఞప్తి చేసాడు. ఒకవేళ భవిష్యత్తులో రాజకీయాలమీద ఎటువంటి అభిప్రాయం తెలియచేయాలన్న అది నిక్కచ్చిగా, నిర్భయంగా నా అధికారిక సామజిక మాధ్యమం ద్వారా తెలియచేస్తాను, భవిష్యత్తులో కూడా ఇటువంటివి జరగవు అని మీ అందరికీ భరోసా ఇస్తున్నాను అని చెప్పాడు అనంత శ్రీరామ్. అయితే తాను అమెరికాలో నాటా సభలకి వచ్చాను అని, హైదరాబాద్ తిరిగి రాగానే సైబర్ క్రైమ్ కి ఫిర్యాదు చేస్తాను అని చెప్పాడు అనంత శ్రీరామ్.