SuperStarKrishna: మొదటి సినిమాకి 58 ఏళ్ళు, అది ఎలా మొదలయిందంటే...
ABN , First Publish Date - 2023-03-31T15:56:26+05:30 IST
కృష్ణ గారి మొదటి సినిమా 'తేనె మనసులు' విడుదల అయి నేటికీ 58 ఏళ్ళు అయింది. ఆ సినిమా ఎలా మొదలయింది, కృష్ణ గారి ప్రస్థానం ఎలా సాగింది, ఎవరెవరు ఆ సినిమా కోసం పోటీపడ్డారు ఇవన్నీ తెలియాలంటే....
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ చరిత్ర సృష్టించుకున్న వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ (Superstar Krishna) గారు. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, డిస్ట్రిబ్యూటర్ గా, స్టూడియో అధినేతగా ఇలా ఎన్నో అవతారాలు ఎత్తి, తెలుగు చలన చిత్ర పరిశ్రమకి ఎంతో కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టిన ఘనత ఒక్క కృష్ణ గారికే చెందుతుంది.
కృష్ణగారి మొదటి సినిమా 'తేనెమనసులు' (Tene Manasulu) విడుదలయి నేటికీ 58 సంవత్సరాలు అయింది. ఆ సినిమా మార్చి 31, 1965 నాడు విడుదల అయింది. మొదటి సినిమాతోటే సంచలనాలు సృష్టించిన కృష్ణ గారు తరువాత చిత్ర పరిశ్రమలో ఒక డాషింగ్ అండ్ డేరింగ్ హీరో అటు తెర మీద ఇటు నిజ జీవితం లోనూ అనిపించుకున్నారు.
దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు (Adurthi Subbarao) గారు కొత్తవాళ్లతో సినిమా చేద్దామని చెప్పి పేపర్ లో ప్రకటన ఇస్తే దివంగత తమిళ నాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత (Jayalalitha), అందాల నటి హేమమాలిని (Hema Malini), కృష్ణం రాజు (Krishnam Raju) ఇంకా మరికొందరితో సహా కృష్ణ (SuperStarKrishna) గారు కూడా తన ఫోటో పంపారు. అందులో కృష్ణ (#KrishnaLivesOn) గారు ఎంపికయ్యారు ఒక లీడ్ యాక్టర్ గా, రెండో లీడ్ యాక్టర్ గా రామ్ మోహన్ (Ram Mohan) ఎన్నికయ్యాడు.
ఈ సినిమా 'వక్రించిన సరళ రేఖలు' అనే నవల ఆధారంగా తీసినది. ఈ సినిమాకి ప్రముఖ రచయితే ముళ్ళపూడి వెంకటరమణ (Mullapudi Venkata Ramana) గారు స్క్రీన్ రైటర్ గా పనిచేస్తే, ప్రముఖ దర్శకుడు కె. విశ్వనాధ్ (K Viswanath) ఈ సినిమాకి అసిస్టెంట్ దర్శకుడిగా పని చెయ్యడమే కాకుండా, ఈ సినిమాకి మాటలు రాసిన ఆత్రేయ (Athreya) కి కూడా సహాయంగా పని చేశారు. విశ్వనాథ్ ఈ సినిమాలో నటించిన లీడ్ యాక్టర్ కి డైలాగ్ ఎలా చెప్పాలి, ఎలా చేసి చూపించాలో నేర్పారు.
దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు ఈ సినిమాని మొదట బ్లాక్ అండ్ వైట్ సినిమాగా కొంత షూటింగ్ చేసి ఎందుకో నచ్చక అది పక్కన పడేసాడు. కొత్తవాళ్లతో కలర్ లో తీద్దాం అని చెప్పి ఈ సినిమాని కలర్ లో తీయాలని, ఈస్టమన్ కలర్ లో తీశారు. ఆలా తీసిన మొట్టమొదటి కలర్ సినిమా గా ఇది ప్రసిద్ధి చెందింది. ఇది తొలి తెలుగు సాంఘిక రంగుల చిత్రం.
ఈ సినిమాలో కృష్ణ గారు స్కూటర్ తొక్కాలి ఒక సన్నివేశంలో, కానీ కృష్ణ గారికి స్కూటర్ నడపటం రాదు. అందుకని దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు, నటుడు రావి కొండలరావు (Ravi Kondalarao) ని బతిమాలి కృష్ణ కి స్కూటర్ తొక్కటం నేర్పు అని చెప్పారట.
ఆలా నాలుగు రోజుల్లో స్కూటర్ తొక్కడం నేర్చుకున్నాడు కృష్ణ గారు, ఎక్కడ నుండి ఎక్కడకి వెళ్లారో తెలుసా స్కూటర్ మీద, సారధి స్టూడియో నుండి సనత్ నగర్ వరకూను. ఆశ్చర్యంగా లేదూ..
ఈ సినిమాలో కృష్ణ, రామ్ మోహన్ లీడ్ యాక్టర్స్ గా వేస్తె, సుకన్య (Sukanya), సంధ్యారాణి (Sandhya Rani) కథానాయకురాలుగా వేశారు. ఈ సినిమాలో అందరూ కొత్తవారే, ఇది 1965 సంవత్సరం ఉగాది పండగ నాడు విడుదల అయింది.
ఈ సినిమా ప్రచారం కోసం ఇందులో నటించిన అందరూ ఒక బస్సులో ప్రధాన నగరాలు తిరిగారు. అలాగే తన తొలి చిత్రం 'తేనె మనసులు' (#TeneManasulu) విడుదల సందర్భంగా ప్రేక్షకులకు సూపర్ స్టార్ కృష్ణ ఒక లేక కూడా రాశారు.
హీరో కృష్ణగా చిత్ర పరిశ్రమకి పరిచయమై హీరో కృష్ణ గానే పరమపదించారు. కృష్ణ అంటే సంచలనం, కృష్ణ అంటే సాహసం. మొదటి సినిమా తరువాత కృష్ణ వెనక్కి ఎప్పుడూ చూడలేదు. ఎన్నో సంచలనాలతో, తెలుగు చలన చిత్ర పరిశ్రమలో సుస్థిర స్థానం సంపాదించడమే కాకుండా, చిత్ర పరిశ్రమకి కూడా ఎంతో మేలు చేశారు. తొలి రోజులలోనే భారత దేశంలోనే తొలి జేమ్స్ బాండ్ చిత్రం, కౌబాయ్ చిత్రం, తొలి సినిమా స్కోప్ 70mm, తొలి డి.టి.ఎస్, ఫ్యూజీ కలర్, ఇంకా ఎన్నో నూతన టెక్నాలజీ ప్రవేశపెట్టారు.