Love U Ram: షాకింగ్, 13 ఏళ్ల అమ్మాయి హిందీ డ్యూయెట్ సాంగ్ రాసింది
ABN , First Publish Date - 2023-06-28T12:18:33+05:30 IST
ఒక పదమూడేళ్ల అమ్మాయి ఒక ప్రేమ గీతం, అదీ హిందీలో రాసింది అంటే షాకింగ్ కదా. ఈ హిందీ పాట తెలుగు సినిమాలో ఉంటుంది, అదే సినిమా అంటే 'లవ్ యు రామ్'. ప్రముఖ దర్శకుడు దశరథ్ ఈ సినిమాకి కథ అందిస్తే, అతని స్నేహితుడు చౌదరి ఈ సినిమాకి దర్శకుడు.
తెలుగు చిత్ర పరిశ్రమలో లిరిక్స్ రైటర్స్ చాలా తక్కువమంది వున్నారు, వేళ్ళ మీద కూడా లెక్కించవచ్చు. విడుదల అవుతున్న ప్రతి తెలుగు సినిమాలో మనకి రెగ్యులర్ గా కనిపించే పేర్లే కనిపిస్తూ ఉంటాయి అంటే, ఆ రంగంలో తక్కువమంది వున్నట్టే కదా. అయితే చాలామంది కొత్తవారికి అవకాశం ఇస్తూ వస్తున్నారు, కానీ మొదటి పాట రాసాక, తరువాత ఆ రచయిత టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది.
ప్రముఖ దర్శకుడు దశరథ్ (Dasarath) మొదటి సారి నిర్మాతగా మారి 'లవ్ యు రామ్' #LoveURam అనే సినిమా తీస్తున్నారు. ఈ సినిమాని అతని చిన్ననాటి స్నేహితుడు, మన స్టూడియో అధినేత డి వై చౌదరి (DYChaudhary) దర్శకుడుగా ఆరంగేట్రం చేస్తున్నాడు. అదీ కాకుండా అతను కూడా నిర్మాణంలో భాగస్వామి అయ్యాడు.
ఈ సినిమాలో ఒక హిందీ పాట కూడా వుంది, అలాగే చిన్న చిన్న ఇంగ్లీష్ పాటలు కూడా వున్నాయి. ఇవి రాయించడానికి దశరథ్, చౌదరి ఇద్దరూ చాలామందిని ప్రయత్నం చేసి, చివరికి ఒక 13 ఏళ్ల అమ్మాయితో రాయించారు. సరస్వతి కార్తీక #SaraswathiKarthika, 8వ తరగతి చదువుతున్న అమ్మాయి, ఈ సినిమాలో 'తూ మేరా, మే తేరి' (Tu Mera, Mein Teri) అనే హిందీ సాంగ్ రాసింది అంటే మరి షాకింగ్ కదా. ఈ పాట ప్రస్తుతం సాంఘీక మాధమల్లో వైరల్ అవుతోంది. కె వేదా (K Vedaa) ఈ సినిమాకి సంగీత దర్శకుడు. అతను ఇంతకు ముందు చాలా సినిమాలకు నేపధ్య సంగీత దర్శకుడిగా పని చేసాడు, అలాగే కొన్ని సినిమాలకు సంగీత దర్శకుడుగా కూడా చేసాడు.
"చాలామందిని ప్రయత్నించాక చివరికి ఆ పాట సరస్వతి తో రాయించాక, నిజమైన సరస్వతి దేవి మా ఇంట్లోనే ఉందని మాకు అర్థం అయింది. మా అమ్మాయికి సన్నివేశం వివరించి చెప్పగానే, 40 నిముషాల్లో పాట రాసి ఇచ్చేసింది," చెప్పాడు దశరథ్, తన కుమార్తె గురించి. ఇప్పుడు లిరిక్స్ రచయితలు దొరకటం కష్టం, అలాగే అవి రాయటం కూడా అంత సులువు కాదు. ఎందుకంటే సన్నివేశం చెప్పాక, అలోచించి రాయాలి, మంచి పదాలు పడాలి. అందుకని లిరిక్స్ రాయటం కష్టం, ఆలా రాసిన మా అమ్మాయి అదృష్టమే అనే చెప్పాలి. ఎందుకంటే సన్నివేశం చెప్పగానే రాసి వెంటనే ఇవ్వటం అది భగవంతుడు ఇచ్చిన వరం అనే చెప్పాలి, అని తన కుమార్తె గురించి చెప్పాడు దశరథ్.
ఈ సినిమాలో రోహిత్ బెహల్ (RohitBehal), అపర్ణ జనార్దనన్ (AparnaJanardanan) లీడ్ పెయిర్ గా చేస్తున్నారు. ఇదొక ప్రేమ కథ అని, అయితే అన్ని ప్రేమ కథల్లా కాకుండా, కొంచెం వైవిధంగా చూపించటం జరిగిందని చెప్పాడు దశరథ్. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమా చూసి చాలా బాగుంది అని ప్రశంసించడమే కాకుండా, చాలామంది దర్శకులకి చూపించాడు. అందరూ బాగుంది అన్నారు ఈ సినిమా. ఈ వారమే విడుదల అవుతోంది.