Purandeswari: నాన్నగారిలా.. నూటికో కోటికో ఒక్కరే

ABN , First Publish Date - 2023-05-28T18:16:18+05:30 IST

రామారావు గారి పిల్లలు క్రమశిక్షణకు మారుపేరని ఇవాల్టికీ అందరూ అనుకుంటున్నారంటే, అదంతా మా నాన్నగారి గొప్పతనమే.! ఆయన కేవలం ఆస్తిపాస్తులే కాదు, అంతకు మించిన జీవిత విలువలను మాకు ఇచ్చారు. ఎంత ఎదిగినా ఒదిగుండటం నేర్పించారని అన్నారు అన్నగారి కుమార్తె దగ్గుబాటి పురంధరేశ్వరి. ఆమె జ్ఞాపకాల డైరీలోని కొన్ని మధుర స్మృతులను ‘ఆదివారం ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు.

Purandeswari: నాన్నగారిలా.. నూటికో కోటికో ఒక్కరే
Daggubati Purandeswari

ఆచంద్రతారార్కం తెలుగు వారి మదిలో నిలిచే పేరు నందమూరి తారకరామారావు. వెండితెర వేల్పుగా జన నీరాజనాలు అందుకున్న ఆయన సినీ, రాజకీయ జీవితం భావితరాలకు స్ఫూర్తి మంత్రం. కఠోరశ్రమ, క్రమశిక్షణలను కవచకుండలాలుగా ధరించిన ‘ఎన్టీఆర్‌ తత్వం - వ్యక్తిత్వం’ నేటి యువతకు కూడా వ్యక్తిత్వ వికాస పాఠం. కొన్ని కోట్ల మంది అభిమానుల ఆరాధ్యమూర్తిగా విరాజిల్లిన ఆ తారక రాముడి శత జయంత్యుత్సవాల సందర్భంగా... అన్నగారి కుమార్తె దగ్గుబాటి పురంధరేశ్వరి జ్ఞాపకాల డైరీలోని కొన్ని మధుర స్మృతులను ‘ఆదివారం ఆంధ్రజ్యోతి’తో ఇలా పంచుకున్నారు..

‘‘రామారావు గారి పిల్లలు క్రమశిక్షణకు మారుపేరని ఇవాల్టికీ అందరూ అనుకుంటున్నారంటే, అదంతా మా నాన్నగారి గొప్పతనమే.! ఆయన కేవలం ఆస్తిపాస్తులే కాదు, అంతకు మించిన జీవిత విలువలను మాకు ఇచ్చారు. ఎంత ఎదిగినా ఒదిగుండటం నేర్పించారు. మా మీద అజమాయిషీ చలాయించడం కానీ, మమ్మల్ని ఎన్నడూ ఒక మాట అనడంకానీ, ఒంటి మీద దెబ్బ వేసిగానీ ఎరుగరు. నాన్నగారికి బాగా కోపం వస్తే మాత్రం ‘‘ఏం మనకు మతులుపోతున్నాయా’’ అనేవారు అంతే.! ఆ మాటే మాకు పెద్ద దండనగా తోచేది. నాన్నగారి గంభీరమైన ఆహార్యం, కంఠం చూసి చాలామంది కంగారు పడేవారు. కానీ ఆయనదంతా పసిపిల్లల మనస్తత్వం. నిష్కల్మషం, నిర్మలత్వం, వృత్తి పట్ల నిబద్ధత, అంకితభావం, పనిలో ఏకాగ్రత ఎన్టీఆర్‌ గారి సహజాభరణాలు. వాటిని మాలోనూ ఇనుమడింపచేసేందుకు ప్రయత్నించారు. సినిమాల్లో ఆయన ఎంత బిజీగా ఉన్నా, మాతో అత్యంత విలువైన సమయాన్ని గడిపారు. (NTR Centenary Celebrations)

పెద్దలను గౌరవించడం

పిల్లలమంతా మద్రాసులోని ఓ మిషనరీ స్కూల్లో చదివాం. కనుక అమ్మ, నాన్నతో మినహా ఇంట్లో మేమంతా ఒకరికొకరం ఇంగ్లీషులోనే సంభాషించుకునేవాళ్లం. అయితే, ‘‘నాయనమ్మ, తాతయ్య వచ్చినప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ అచ్చ తెలుగులోనే మాట్లాడాలి’’ అనేది నాన్నగారి షరతు. అంతేకాదు, పనివాళ్లు ఎందరున్నా, ఊరి నుంచి తాతయ్య వాళ్లు వస్తున్నారంటే... గుమ్మం వెలుపల నీళ్ల బకెట్టు ఉంచడం దగ్గర నుంచి, ఎదురెళ్లి వాళ్లను తీసుకొనిరావడం.. కాళ్లు కడుక్కోవడానికి చెంబుతో నీళ్లు అందించడం లాంటి పనులన్నీ మాకే పురమాయించేవారు. తద్వారా పెద్దలను ఎలా గౌరవించాలో నేర్పించారు.

Purendeswari-1.jpg

సంస్కారం..

నాన్నగారి దగ్గర మొదటి నుంచి రాజకీయాల్లోకి రాకముందు వరకు కూడా కృష్ణ అనే డ్రైవర్‌ పనిచేసేవారు. అతను అమ్మ, నాన్నను ‘అన్నా, వదిన’ అని పిలిచేవారు. అతనే మమ్మల్ని రోజూ స్కూలు నుంచి ఇంటికి తీసుకొచ్చేవారు. అలా ఓ రోజు నేను కారుదిగి గబగబా ఇంట్లోకి వెళుతుండటం నాన్నగారు గమనించారు. అప్పుడు నన్ను పిలిచి... ‘చిన్నమ్మా.! కృష్ణకు ధన్యవాదాలు చెప్పలేదేంటి’ అనడిగారు. ‘అది అతని డ్యూటీ కదా.!’ అని నేనన్నాను. దాంతో నాన్నగారు.. ‘‘వారికి వేతనం చెల్లిస్తున్నది నేనేగానీ, మీరు కాదు. మిమ్మల్ని స్కూలు నుంచి తీసుకొచ్చే బాధ్యత వారిది కాదు. కానీ నా ఆదేశాల మేరకు సేవలందిస్తున్నారు. కనుక కృష్ణకు ధన్యవాదాలు చెప్పడం మీ ధర్మం’’ అన్నారు. అలా ఎదుటివ్యక్తికి చాలా మర్యాదపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేయాలి.. లేకపోతే నాన్నగారు అస్సలు ఊరుకునేవారు కాదు. ‘‘చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ గౌరవించడం మన సంస్కారం’’ అంటూ ఆనాడు ఆయన నేర్పిన పాఠాలను ఇవాల్టికీ ఆచరిస్తున్నాం. (Daggubati Purandeswari about NTR)

‘మనుషులంతా ఒక్కటే’...

మా అబ్బాయి హితేష్‌, అమ్మాయి నివేదిత అమెరికాలో పుట్టారు. అయితే, ఓ రోజు స్కూల్లో సోషల్‌ స్టడీస్‌లోని మతాల గురించిన పాఠం విని ఇంటికి వచ్చిన అమ్మాయి, నాన్నగారి వద్దకు వెళ్లి... ‘‘తాతయ్య.. మీరు, అమ్మ, నాన్న ఇండియాలో పుట్టారు కనుక మీరంతా హిందువులు. నేను, అన్నయ్య అమెరికాలో పుట్టాం కాబట్టి క్రిస్టియన్స్‌’’ అంది. ఆ పక్కనే నేనూ కూర్చొనున్నాను. బహుశా.. అదే మాట నాతో అనుంటే, ‘తల్లిదండ్రులుగా మాదే మతమో, మీదీ అదే మతమ’ని చెప్పేదాన్నేమో.! కానీ నాన్నగారు మాత్రం నివేదితను ఒడిలోకి తీసుకొని, తల నిమురుతూ... ‘‘మతం కన్నా మానవత్వం గొప్పదమ్మా.! మనుషులంతా ఒక్కటే. కనుక మన మతం విశ్వమానవ ప్రేమతత్వం’’ అంటూ ఆనాడు చెప్పిన మాటలు ఇవాల్టికీ నా చెవుల్లో మార్మోగుతున్నాయి.

విమర్శను స్వీకరించే స్వభావం

విమర్శను సైతం సహృదయంతో స్వీకరించ గలిగిన విశాల హృదయం ఎన్టీఆర్‌ గారి సొంతం. నాన్నగారు రోజూ వేకువజామున ఐదు గంటలకు ఒక చుట్ట తాగేవారు. అదీ ఎవరో చెప్పగా, స్వర శుద్ధి కోసం అలవాటు చేసుకున్నారు. మా హరికృష్ణ అన్నయ్య చైన్‌స్మోకర్‌. దాంతో ‘‘పొగతాగొద్దు’’ అని నాన్నగారు తరచుగా హరన్నను హెచ్చరిస్తుండేవారు. ఓ రోజు అది విన్న మా చిన్నతమ్ముడు జయశంకర కృష్ణ... ‘‘చుట్టతాగే మీరు, అన్నయ్యను సిగరెట్‌ మానేయమనడం ఎంత వరకు కరెక్టు నాన్నగారు!’’ అని ప్రశ్నించారు. అంతే! మరెన్నడూ నాన్నగారు చుట్ట ముట్టలేదు. అదీ ఆయన మాకు ఇచ్చిన స్వేచ్ఛ. తన ఆలోచనలను విభేదించే వాళ్లను సైతం అక్కున చేర్చుకోగలిగిన గొప్ప గుణం ఎన్టీఆర్‌ గారిది. (NTR 100th Birthday Anniversary)

Daggubati-Purandeswari.jpg

ప్రేమ సంగతి తెలిసి...

నాన్నగారికి అమ్మ ద్వారా... డాక్టర్‌ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారితో నా ప్రేమ విషయం తెలిసింది. తర్వాత ఓ రోజు నన్ను పిలిచి ‘‘డాక్టరుగారితో పెళ్లి ఇష్టమేనా’’ అనడిగారు. ‘‘వివాహం అంటే కేవలం మనకు నచ్చిన వ్యక్తితో జరిగే తంతు మాత్రమే కాదు, ఆ కుటుంబంతో జీవితాంతం కలిసిమెలిసి జీవించడం. తదనుగుణంగా నడుచుకోవాలి కూడా.! కాబట్టి ఒక రోజు సమయం తీసుకొని, అవన్నీ బాగా ఆలోచించి నిర్ణయం తెలియజేయమన్నారు’’. మరుసటి రోజు పిలిచి మళ్లీ అడిగితే, ‘నాకెలాంటి అభ్యంతరం లేదని’ చెప్పాను. ఇలా ప్రతి విషయంలో ఘర్షణలకు తావు లేకుండా, మా అభిప్రాయాలను గౌరవిస్తూ వచ్చారు. ఆదర్శనీయ తండ్రిగా నిలిచారు.

నన్ను కలెక్టరుగా చూడాలని...

నాన్నగారు తరచుగా పెద్దమ్మాయి డాక్టరు, రెండో అమ్మాయి కలెక్టరు, మూడో అమ్మాయి లాయర్‌ అవ్వాలి అంటుండేవారు. మరి చిన్నమ్మాయి ఉమామహేశ్వరిని ఎందుకు వదిలేశారు నాన్న అనంటే, ‘ఆఖరిపిల్ల కదా.! అల్లారు ముద్దుగా పెంచుతాంలే’’ అని నవ్వేవారు. నాన్నగారి కోరిక మేరకు మొదట సివిల్స్‌ ప్రిలిమ్స్‌ కూడా రాశాను. మెయిన్స్‌కు సిద్ధమవుతున్న సమయంలోనే ఎన్టీఆర్‌ గారు రాజకీయాల్లోకి రావడం, డాక్టరు గారు హైదరాబాద్‌కు మారడం... అలా ఆ ప్రయత్నాలు అంతటితో ఆపేశాను.

అంకితభావం...

ప్రజలకు మంచి చేయాలని నిరంతరం పరితపించిన మహానాయకుడు ఎన్టీఆర్‌. ఆయన పేదలకు రెండు రూపాయలకే కిలో బియ్యం ఇవ్వాలి అనుకున్నారు. ‘అది సాధ్యం కాదని’ అధికారులు చెప్పినా, ‘‘దాన్నెలా సుసాధ్యం చేయాలనే విషయం మీద దృష్టిసారించి తగిన సూచనలు ఇవ్వండి’’ అని ఆదేశించారు. ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఎన్టీఆర్‌ గారి అంకితభావం అలాంటిది మరి. ప్రజా ప్రయోజనాల విషయంలో వెనక్కి తగ్గడం ఆయన డిక్షనరీలోనే లేదు. ఇలాంటి ఉదాహరణలు నాన్నగారి రాజకీయ ప్రస్థానంలో కోకొల్లలు.!

ప్రజలమీద పిచ్చి ప్రేమ

నాన్నగారిని ప్రజలు అభిమానించడమే కాదు, ఆయనకూ ప్రజలంటే పిచ్చి ప్రేమ. ఓ సారి నాన్నగారు శ్రీకాళహస్తి పర్యటనకు వెళ్లినప్పుడు, వెంట నేనూ ఉన్నాను. అప్పుడు ఎన్టీఆర్‌ గారిని చూడాలని, స్వర్ణముఖి నదికి అవతలి గ్రామాల నుంచి కూడా పెద్ద ఎత్తున భారీ సంఖ్యలో జనం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా నదిలో ఈదుకుంటూ... ఇవతలి ఒడ్డునున్న మా వ్యాన్‌ దగ్గరకి పరుగులు తీయడం చూసి... ‘‘నేనంటే ఇంత అభిమానం, ప్రేమ కనబరుస్తున్నారు. ఇంత వరకు నాకు సమాజంలో గుర్తింపు, గౌరవం అంతా ఈ ప్రజలే ఇచ్చారు. వీరికి నేనేదైనా మంచి చేయాలి. అది నా జీవితకాలంలో చూడాలి’’ అని నాతో చెబుతూ భావోద్వేగానికి గురైన సంఘటన ఇప్పటికి నా కళ్లముందు మెదులుతోంది.

కృతజ్ఞతాభావం...

నాన్నగారు మొట్టమొదట మద్రాస్‌ వెళ్లినప్పుడు, ఎల్వీ ప్రసాద్‌ గారు స్వయంగా రైల్వేస్టేషన్‌కు వెళ్లి రిసీవ్‌ చేసుకున్నారట. ఆ కృతజ్ఞతా భావంతో ప్రసాద్‌ గారు మా ఇంటికి ఎప్పుడు వచ్చినా, నాన్న గారు గేటు దగ్గరకు ఎదురెళ్లేవారు. తిరిగి అంతే మర్యాదతో సాగనంపేవారు. ఎల్వీ ప్రసాద్‌ గారిని మినహా ఎన్టీఆర్‌ గారు మరెవ్వరిని ‘‘సర్‌’’ అని సంభోదించడం నేను అయితే వినలేదు. అలాగే కాలేజీలో నాన్నగారికి చిన్న సాయం అందించిన ఓ మిత్రుడు కష్టాల్లో ఉన్నారని తెలిసి, వాళ్ల కుటుంబానికి అండగా నిలిచారు. తనకు చదువు చెప్పిన కవిసామ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ గారు, నిర్మాత నాగిరెడ్డి గారు ఇలా... తనకు సాయం అందించిన వ్యక్తుల పట్ల జీవితాంతం కృతజ్ఞతతో మెలిగారు ఎన్టీఆర్‌ గారు.

Purandeswari.jpg

నిత్య విద్యార్థి

‘నర్తనశాల’ సినిమాలో బృహన్నల పాత్ర కోసం వెంపటి చినసత్యం మాష్టారు దగ్గర నాన్నగారు భరతనాట్యం నేర్చుకుంటున్న రోజులవి.! రోజూ వేకువజామున 4.30 గంటలకు గురువు గారు ఇంటికి వచ్చేవారు. అప్పటికే నేను, చెల్లి భువనేశ్వరి వెంపటి చినసత్యం గారి దగ్గరే నృత్య సాధన చేస్తున్నాం. కనుక మాకూ అదే సమయంలో డ్యాన్స్‌ క్లాసు ఉండేది. అయితే, సమయానికి నేను సిద్ధంగా ఉండేదాన్నే కానీ, ఒక్కోరోజు అంత పొద్దున్నే నిద్రలేవడానికి భువన కాస్త బద్ధకించేది. అది గమనించిన నాన్నగారు... ‘‘గురువుగారు వచ్చే సమయానికి తయారుగా ఉండి, వారికి స్వాగతం పలకాలి. అంతేకానీ, గురువు గారు మన కోసం ఎదురుచూడటం మర్యాద కాదు’’ అని మందలించారు. అప్పటికి నాన్నగారు బాగా పేరు ప్రఖ్యాతలు కలిగిన కథానాయకుడు. అయినా, వెంపటి చినసత్యం మాష్టారికి శిష్యుడిలానే మెలిగారు.

బహుభాషల బోధన

నాన్నగారికి చిన్నతనంలోనే వాళ్ల పెదనాన్న షోకుల రామయ్య గారు రామాయణ, మహాభారతాలను పరిచయం చేశారు. తెలుగు ఉచ్ఛారణ స్పష్టంగా ఉండేలా తర్ఫీదు ఇచ్చారు. ఏదైనా పదం తప్పు పలికినా, బెత్తంతో కొట్టేవారట. అలా మా నాన్నగారికి పురాణాల పై జ్ఞానం, మాతృభాష పట్ల మమకారం అలవడ్డాయి. అందుకే మమ్మల్ని కూడా చిన్నతనం నుంచి బహుభాషలు నేర్చుకునేలా ప్రోత్సహించారు. ఆంగ్ల మాధ్యమంలో చదువుతున్న మాకు బొట్టపాటి మాష్టారు వంటి పండితులతో ప్రత్యేకంగా ఇంట్లో తెలుగు, తమిళం నేర్పించారు. జాతీయ భాష హిందీ అవసరాన్ని ఆనాడే మాకు కళ్లకు కట్టారు. ఓ సందర్భంలో ‘‘ఇన్ని భాషలు నేర్చుకోవాలంటారా’’ అని నేను నవ్వితే, ‘‘లేదు.! చిన్నమ్మా.. నేర్చుకోవాల్సిందే’’ అన్నారు. అప్పుడు నాన్నగారు చెప్పిన మాటలు, నేను పార్లమెంటులో అడుగుపెట్టిన తర్వాత కానీ అర్థంకాలేదు.

ఇలా ఎన్టీఆర్‌ గారి గురించి ఒకటి కాదు, రెండు కాదు...కొన్నేళ్ళ పాటు మాట్లాడుకున్నా తరగనన్ని జ్ఞాపకాలున్నాయి. ఆయన ఒక చారిత్రక పురుషుడు. అలాంటి మహనీయులు నూటికో కోటికో ఒక్కరు మాత్రమే ఉంటారు.

- కారుసాల వెంకటేశ్‌

ఇవి కూడా చదవండి:

************************************************

*Jayapradha: ‘ఓసి.. ఆ పిల్లవి నువ్వెనన్నమాట’ అని ఎన్టీఆర్ పెద్దగా నవ్వేశారు

*Shaakuntalam: సినిమా సక్సెస్ కాలేదు కానీ.. ఆ విషయంలో మాత్రం తిరుగులేదు

*The India House: పవర్ ఫుల్ ఫిల్మ్‌తో ఖాతా తెరుస్తోన్న ‘V మెగా పిక్చర్స్’.. మోషన్ వీడియో అదిరింది

*Sharwanand: రోడ్డు ప్రమాదంపై స్పందించిన శర్వానంద్.. ఏమన్నారంటే?

*NTR Centenary: తారక రాముని శతజయంతి - శత విశేషాలు

*LegendNTR: కత్తితో దాడి చేసిన జగ్గారావు.. ఎన్టీఆర్ చేతికి రక్తం కారుతున్నా కూడా..

*NTR Centenary Celebrations: చిరంజీవి ఇలా.. పవన్ కల్యాణ్ అలా!

Updated Date - 2023-05-28T20:49:30+05:30 IST