Chota K Naidu: ‘పెదకాపు 1’లో జెండాకర్ర పాతే సీన్.. నేను గర్వంగా చెప్పుకునే ఎపిసోడ్ ఇది
ABN , First Publish Date - 2023-09-13T19:03:59+05:30 IST
విరాట్ కర్ణ హీరోగా.. సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ ‘పెదకాపు-1’. ‘అఖండ’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీని రూపొందించిన ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 29న విడుదల కాబోతోన్న ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను కెమెరామెన్ ఛోటా కె నాయుడు మీడియాతో పంచుకున్నారు.
విరాట్ కర్ణ (Virat karrna) హీరోగా.. సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల (Director Srikanth Addala) దర్శకత్వంలో రూపొందుతున్న న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ ‘పెదకాపు-1’ (Peddha Kapu 1). ‘అఖండ’ (Akhanda) వంటి బ్లాక్‌బస్టర్ మూవీని రూపొందించిన ద్వారకా క్రియేషన్స్ (Dwaraka Creations)పై మిర్యాల రవీందర్ రెడ్డి (Miryala Ravinder Reddy) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్ సినిమాపై భారీగా అంచనాలను పెంచేసింది. సెప్టెంబర్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపధ్యంలో చిత్రానికి డివోపీగా పనిచేసిన స్టార్ సినిమాటోగ్రాఫర్ ఛోటా కె. నాయుడు (Chota K Naidu).. మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు.
‘పెదకాపు-1‘ కథ విన్నప్పుడు మీకు ఏమనిపించింది?
శ్రీకాంత్ అడ్డాల తొలి చిత్రం ‘కొత్త బంగారులోకం’ చేసినప్పుడు... మా జర్నీ మొదలైయింది. అప్పటి నుంచి ఇప్పటివరకూ తను చేసిన ప్రతి సినిమా కథ నాకు చెప్తారు. కలిసి చేద్దామని అనుకుంటాం కానీ.. నాకు డేట్స్ కుదరవు. ‘పెదకాపు-1’కి వచ్చేసరికి.. ‘కొత్త బంగారులోకం’లా ఇదొక డిఫరెంట్ ఫిల్మ్.. ఎలాగైనా కలిసి చేయాలి. అవసరమైతే మీ కోసం వెయిట్ చేస్తానని శ్రీకాంత్ అన్నారు. తన సినిమాల్లానే శ్రీకాంత్ చాలా కూల్‌గా వుంటారు. నాకొక కె విశ్వనాథ్‌గారిలా అనిపిస్తారు. అయితే నారప్పతో ఆయనలో ఒక కొత్త ట్రాన్స్‌ఫర్మేషన్ వచ్చింది. ‘పెదకాపు-1‘ కథ చెప్పినప్పుడు కూడా ఇప్పుడు ట్రైలర్‌లో ఏది చూశామో అంత ఇంటెన్స్‌గా చెప్పారు. ఇందులో తను నటన కూడా మొదలుపెట్టారు. శ్రీకాంత్ ఇలాంటి ఒక సినిమా డైరెక్ట్ చేసి ఇలాంటి అవుట్‌పుట్ ఇవ్వడం ఒక కెమెరామెన్‌గా నాకు షాక్ ఇచ్చింది.
ఈ సినిమాకు మీరు బాగా కష్టపడ్డారా?
కష్టం అనే మాట నేను వాడనండీ. పని చేయడం నాకు చాలా ఇష్టం. నేను చాలా ఇష్టపడి పని చేస్తాను. ఈ కథ కొత్త ప్యాట్రన్, కొత్త కలర్స్, మేకింగ్‌ని డిమాండ్ చేసింది. ఇది నాకు సవాల్‌గా అనిపించింది. (Chota K Naidu Interview about Peddha Kapu 1)
వివి వినాయక్ మిమ్మల్ని పీసీ శ్రీరామ్‌తో పోల్చారు.. మీకేం అనిపించింది?
వినాయక్ ఈ సినిమాలో కొన్ని పోర్షన్స్ చూశారు. అందువలన ఆయనకి అలా అనిపించి ఉంటుంది. ఐతే ఒక్కటి మాత్రం నిజం.. పీసీ శ్రీరామ్ గారితో పోల్చుకునేంటంత గొప్పోడినైతే కాదు. పీసీ శ్రీరామ్‌గారు అల్టిమేట్. విఎస్ఆర్ స్వామీగారు, విన్సెంట్‌గారు, పీసీ శ్రీరామ్.. వీళ్ళంతా గొప్పోళ్ళు.
ట్రైలర్ విజువల్‌గా చాలా ఇంపాక్ట్‌గా ఉంది? ఇలాంటి బెస్ట్ అవుట్ పుట్‌కి కారణం?
ఈ విషయంలో క్రెడిట్ దర్శకుడిదే. దర్శకుడి హెల్ప్ తోనే ఇలాంటి అవుట్ పుట్ వస్తుంది. కొత్త బంగారు లోకం విజువల్ కి కూడా ఇలానే మాట్లాడారు. చాలా బాగా తీశారని మెచ్చుకున్నారు. తర్వాత నేను చేసిన సినిమాకి అలా మాట్లాడలేదు. మళ్ళీ ఇప్పుడు శ్రీకాంత్‌తో చేసిన ఈ సినిమా గురించి ఇలా మాట్లాడుతున్నారు. ఇందులో తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. నా గొప్పదనం కంటే డైరెక్టర్ విజన్ ముఖ్యం.
మీరు చాలా పెద్ద స్టార్స్‌తో సినిమాలు చేశారు.. కొత్త హీరో విరాట్‌తో చేయడం ఎలా అనిపించింది?
హీరో స్థానానికి ఎప్పుడూ గౌరవిస్తాను. నాకు కథానాయకుడు ముఖ్యం. చిన్నా పెద్ద అని కాదు.. ఒక కథలో నాయకుడుగానే చూస్తాను. ఆ కథానాయకుడు ఎలా ఉండాలో కెమెరామెన్‌గా నాకొక విజన్ వుంటుంది. విరాట్‌తో పని చేస్తున్నప్పుడు తను కొత్తవాడు అనే ఫీలింగ్ రాలేదు. అనుభవం వున్న నటుడిలానే చాలా అద్భుతంగా చేశాడు. (DOP Chota K Naidu Interview)
ఈ చిత్రంలో అనసూయను మీరే సజస్ట్ చేశారా?
ఇందులో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ వుంది. ఆ పాత్ర కోసం ఎవరిని తీసుకోవాలని చాలా ఆలోచనలు జరిగాయి. ఈ పాత్రలో అనసూయ ఐతే బాగుంటుందని అనుకున్నాం. చాలా మంచి పాత్ర. మేము అనుకున్నదాని కంటే అద్భుతంగా చేసింది తను. ఈ పాత్రే కాదు.. దర్శకుడు శ్రీకాంత్ ఇందులో ప్రతి పాత్రని చాలా చక్కగా డిజైన్ చేశాడు.
శ్రీకాంత్ అడ్డాల గారిని ఒక నటుడిగా చూడటం ఎలా అనిపించింది?
నిజంగా శ్రీకాంత్ నటుడిగా ఆశ్చర్యపరిచాడు. ఎంత కష్టమైన షాట్ అయినా సింగల్ టేక్‌లో చేసేశాడు. ఇందులో శ్రీకాంత్ చేసిన ప్రతి సీన్.. సింగిల్ టేక్‌లో ఓకే అయిపోయేది. శ్రీకాంత్ చేసిన ప్రతి సీన్‌కి మా నిర్మాత రవీందర్ రెడ్డిగారు డైరెక్ట్ చేశారు. షాట్ అవ్వగానే ఓకే అనేవారు( నవ్వుతూ). చాలా సరదాగా చేశాం.
ద్వారక క్రియేషన్స్‌లో అఖండ సినిమా పెద్ద హిట్ అయ్యింది.. ఇప్పుడు పెదకాపు ఎంతవరకూ రీచ్ అవుతుంది?
ఈ సినిమా మామూలుగా మరో నిర్మాత అయితే ఐదు ఆరు కోట్లలో తీయమని అడుగుతారు. కానీ ఈ కథ ముఫ్ఫై నలభై కోట్లు డిమాండ్ చేస్తుంది. రవీందర్ రెడ్డి గారు కాబట్టి ఇంత భారీ బడ్జెట్‌తో చిత్రీకరించారు. నాకంటే, శ్రీకాంత్ కంటే నిర్మాత ఈ కథని బలంగా నమ్మారంటే అర్థం చేసుకోవచ్చు. పెదకాపు 2 కూడా వుందంటే అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా ఎలా వచ్చి ఉంటుందో.
పెదకాపు కథ 1983లో ఎన్టీఆర్‌గారి రాజకీయ ప్రవేశం సమయంలో జరిగిందా?
రామారావుగారు పార్టీ పెట్టినపుడు మొదలైన ఇన్సిడెంట్‌ని ఈ సినిమా కథగా తీసుకున్నాడు శ్రీకాంత్. దర్శకుడు శ్రీకాంత్ నాన్నగారు, రామారావు గారికి పెద్ద అభిమాని. రామారావు గారు పార్టీ పెట్టిన రోజుల్లో శ్రీకాంత్ నాన్నగారి ఎఫర్ట్, ఆయన ప్రవర్తన, ఆయనకి చుట్టుపక్కల నుంచి ఎదురైన సంఘటనలపై శ్రీకాంత్‌కి మంచి పట్టు ఉంది. వాటి స్ఫూర్తితో ఈ కథని రాసుకున్నారు శ్రీకాంత్.
ఈ సినిమా షూటింగ్ చేస్తున్నపుడు మిమ్మల్ని ఎగ్జయిట్ చేసిన అంశాలేంటి?
చాలా వున్నాయి. మీరు ట్రైలర్‌లో చూస్తే ఒక అమ్మాయి ఎండిపోయిన చెట్టుకి హ్యాంగ్ చేయబడి కనిపిస్తుంది. సినిమాలో ఆ సన్నివేశం చాలా కీలకంగా వుంటుంది. రెండు ఎకరాల పొలం అది. మొత్తం బురదతో వుంది. అక్కడ ఒక ఎండిపోయిన చెట్టు పెట్టడం పెద్ద టాస్క్. ఆ బురదలో క్రేన్‌లు పని చేయవు. ఒక చెట్టుని మనుషులు మోయడం ఇంపాజిబుల్. మరి ఎలా పెట్టామనేది మీరు సినిమా చూసిన తర్వాత చెప్తా. అది ఇప్పుడు చెప్పేస్తే కిక్ వుండదు. నిజంగా చాలా పెద్ద టాస్క్ అది. ఆ సన్నివేశంలో దాదాపు వెయ్యి మంది జూనియర్ ఆర్టిస్ట్‌లు వుంటారు. ఒక రోజు మొత్తం ఆ అమ్మాయి (బ్రిగడ) హ్యాంగింగ్ పొజిషన్‌లోనే వుంది. ప్రొడక్షన్ వారి వలనే ఇది సాధ్యపడింది. అలాగే మునకల లంక అనే ఊరు వుంది. అక్కడ ఓ ఇల్లు ఎంపిక చేసి షూట్ చేశాం. వర్షం వస్తే అది మునిగిపోతుంది. మేము షూట్ చేస్తున్న సమయంలో వర్షం వచ్చి ఆ ఇల్లు మునిగిపోయింది. దీని కోసం మళ్ళీ మూడు నెలలు ఆగి నీళ్ళు పోయిన తర్వాత ఆక్కడ షూట్ చేశాం. నేను కెమెరామెన్ ఐతే గోదారిని ఇలా వాడుకోవాలని వుండేది. కొత్తబంగారు లోకంలో గోదారిని ఒక్క స్థాయి వరకే వాడాను. ఈ సినిమాలో పూర్తిగా వాడే ఛాన్స్ దొరికింది. గోదారి ప్రాంతాల్లో పుట్టి పెరిగిన వారికి కూడా తెలియని గోదారిని ఇందులో చూపించాను. నిజంగా చాలా కొత్తగా ఫీలౌతారు. ఎవరూ తిరగని ప్రాంతాలని చూపించాం. హీరో ఇల్లు గోదారి గట్టున వుంటుంది. మేము వుండే హోటల్ నుంచి రెండున్నగంటల ప్రయాణం చేసి అక్కడికి వెళ్లాలి. అయినప్పటికీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వడానికి ప్రయత్నించాం.
ఈ సినిమాలో మరో పెద్ద ఎలిమెంట్.. వూర్లో జెండాకర్ర పాతడానికి హీరో అండ్ బ్యాచ్ పడే స్ట్రగుల్ చాలా ఆసక్తికరంగా వుంటుంది. దీని కోసం అడవిలో ఓ పెద్ద చెట్టుని నరికి తెచ్చి పాతుతారు. ఇది మా అందరికీ పెద్ద టాస్క్. ఈ చెట్టు పాతే ఎపిసోడ్ షూట్ చేయడం నా కెరీర్‌లో ఓ అద్భుతం. దీనికి క్రియేటర్ శ్రీకాంత్ అయితే.. భుజాన మోసింది ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్. నేను చాలా గర్వంగా చెప్పుకునే ఎపిసోడ్ ఇది. 83నాటి వాతావరణం క్రియేట్ చేయడానికి కూడా చాలా హార్డ్ వర్క్ చేశాం. చాలా జాగ్రత్తలు తీసుకున్నాం.
పెదకాపు 1 మ్యూజిక్ గురించి ?
శ్రీకాంత్ అడ్డాల, మిక్కీ జే మేయర్ మధ్య మంచి రాపో వుంది. మిక్కీని బలంగా నమ్మాడు శ్రీకాంత్. మిక్కీ ఇలాంటి నేపధ్య సంగీతం ఇవ్వడం నాకు సర్ ప్రైజ్ చేసింది. అలాగే హీరోయిన్ ప్రగతి కూడా టెర్రిఫిక్‌గా పెర్ఫార్మ్ చేసింది.
మెగాస్టార్ సినిమా ఎప్పటినుంచి వుంటుంది?
చిరంజీవిగారి సినిమా నవంబర్ నుంచి వుంటుంది.
ఇవి కూడా చదవండి:
============================
*A R Rahman: రెహ్మాన్‌కు మద్దతు
************************************
*Dil Raju: ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ కోసం ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా..
************************************
*Samyuktha Menon: కళ్యాణ్ రామ్ ‘డెవిల్’లో సంయుక్త ఫస్ట్ లుక్ వదిలారు
***********************************
*Thalaivar171: రజనీకాంత్ 171వ చిత్రం ఎవరితోనో తెలుసా?
**********************************