Leo: తలపతి విజయ్, లోకేష్ కనగరాజ్ 'లియో' సినిమా ఆడియో వేడుక రద్దు, కారణం ఇదే
ABN , First Publish Date - 2023-09-27T12:03:07+05:30 IST
ఎప్పుడెప్పుడా అని విజయ్ అభిమానులు ఎదురు చూస్తున్న 'లియో' సినిమా ఆడియో ఫంక్షన్ రద్దు చేశారు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ రద్దు వెనక ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేదని చెపుతూ, ఎందుకు ఆలా చెయ్యాల్సి వచ్చిందో నిర్మాతలు సాంఘీక మాధ్యమంలో వివరణ ఇచ్చారు
దర్శకుడు లోకేష్ కనగరాజ్ (LokeshKanagaraj), తమిళ సూపర్ స్టార్, తలపతి విజయ్ (ThalapathyVijay) తో 'లియో' #Leo అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అక్టోబర్ 19న (October19) విడుదలవుతోంది. ఈ సినిమా కోసమని విజయ్ అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే ఈ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ కోసం కూడా అభిమానులు చాలా కాలం నుండి ఎప్పుడప్పుడా అని ఎదురుచూస్తూ, విజయ్ స్పీచ్ కోసం, అతను ఏమి చెప్తాడా వినాలని కుతూహలంతో వున్నారు.
అయితే ఇప్పుడు ఈ ఆడియో ఫంక్షన్ జరపటం లేదని, కొన్ని అనివార్య కారణాల వలన రద్దు చేశామని ఈ సినిమా నిర్మిస్తున్న ప్రొడక్షన్ సంస్థ సాంఘీక మాధ్యమం ట్విట్టర్ లో ప్రకటించింది. "ఈ చిత్ర ఆడియో ఫంక్షన్ కి విజయ్ అభిమానులు చాలామంది వచ్చే అవకాశం వుంది, అలాగే అందరికీ ఎంట్రీ పాస్ లు ఇవ్వడం కుదరకపోవచ్చు. ఇంతమంది అభిమానులు రావటం వలన, భద్రతా కారణాల దృష్ట్యా ఈ ఆడియో రిలీజ్ ఫంక్షన్ రద్దు చెయ్యాలని అనుకున్నాం" అని ఆ చిత్ర నిర్మాతలు సెవెన్ స్క్రీన్ స్టూడియో (SevenScreenStudio) ట్వీట్ చేసింది.
అలాగే ఇంకొక లైన్ కూడా దీనికి జతపరుస్తూ ఈ ఫంక్షన్ రద్దు చెయ్యటం వెనుక ఎటువంటి రాజకీయ ఒత్తిడి లేదని స్పష్టం చేసింది. అయితే సినిమా గురించి అన్ని సమాచారాలు అభిమానులకు ఎప్పటికప్పుడు అందిస్తూ ఉంటామని చెప్పింది. అలాగే చాలామంది అభిమానులు విజయ్ స్పీచ్ మిస్ అయ్యాం అని ఈ ట్వీట్ కి సమాధానంగా పెడుతున్నారు. #WeStandWithThalapathyVIJAY అలాగే విజయ్ తో మేముంటాం, #WeStandWithLEO వియ్ స్టాండ్ విత్ లియో అనే హేష్ టాగ్ లు కూడా జతపరిచి విజయ్ అభిమానులు ట్వీట్ చేస్తున్నారు.