Dubbed Movies : తెలుగు నాట తమిళ హీరోల దండయాత్ర
ABN , First Publish Date - 2023-11-07T17:19:37+05:30 IST
తెలుగు రాష్ట్రాలలో తమిళ హీరోలు దండయాత్ర చేస్తున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు డజన్ మందికి పైగా తమిళ, కన్నడ, హిందీ హీరోలు ఒకరి తర్వాత మరొకరు టాలీవుడ్‌పై కన్నేశారు. మూడు నెలల్లో వరుసబెట్టి తమ సినిమాలను స్ట్రెయిట్ తెలుగు చిత్రాలతో పోటీగా విడుదల చేస్తున్నారు.
తెలుగు రాష్ట్రాలలో తమిళ హీరోలు దండయాత్ర చేస్తున్నారు. ఒకరు కాదు ఇద్దరు కాదు దాదాపు డజన్ మందికి పైగా తమిళ, కన్నడ, హిందీ హీరోలు ఒకరి తర్వాత మరొకరు టాలీవుడ్‌పై కన్నేశారు. రానున్న రెండు మూడు నెలల్లో కార్తీ నటించిన ‘జపాన్’ (Japan), లారెన్స్ ( Lawrence) ‘జిగర్తాండ’ (Jigarthanda DoubleX), విక్రమ్ ‘దృవనక్షత్రం, తంగలాన్’, శివ కార్తికేయన్ ‘అయలాన్’, ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్’లతో పాటు సల్మాన్‌ఖాన్ ‘టైగర్3’, షారుక్ ఖాన్ ‘డంకీ’, రణబీర్ కపూర్ ‘యానిమల్’, కన్నడ రక్షిత్ శెట్టి ‘సప్త సాగరాలు దాటి’ వంటివి మూడు నెలల్లో డజనుకు పైగా సినిమాలను స్ట్రెయిట్ తెలుగు చిత్రాలతో పోటీగా విడుదల చేస్తున్నారు.
తెలుగు బడా హీరోల సినిమాల విడుదల ఆలస్యమవుతుండడం, రొటీన్, మూస కథలను ఫాలో అవుతుండడంతో మన ప్రేక్షకులకు మొహమొత్తి డబ్బింగ్ సినిమాలపై ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. అదీగాక కరోనా సమయంలో ఓటీటీల్లో డబ్బింగ్ సినిమాలు, వెబ్‌సీరిస్‌లకు అలవాటు పడిన జనాలకు ఇతర భాషల నుంచి వస్తున్న డిఫరెంట్ కంటెంట్ తెగ నచ్చేయడంతో ప్రతివారం తెలుగు సినిమాలతో పాటుగా డబ్బింగ్ చిత్రాలు రావాలని కోరుకుంటున్నారు.
కరోనా అనంతరం ఇండియా మొత్తం సినీ ఇండస్ట్రీ నిస్తేజంగా ఉన్న సమయంలో మన ప్రేక్షకులు థియేటర్లలో సినిమాలకు బ్రహ్మరథం పట్టడంతో అన్ని ఇండస్ట్రీల చూపు మన తెలుగు రాష్ట్రాలపై పడింది. ఇక ఆ తర్వాత వచ్చిన మన ‘RRR’ పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కి భారీ విజయాన్ని సాధించి ఇతర ఇండస్ట్రీలకు ఓ మార్గం చూపింది. దీంతో నెమ్మదిగా అన్ని భాషల దర్శకులు, హీరోలు తమ సినిమాలను పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తూ అన్ని భాషలలో విడుదల చేస్తు పేరుతో పాటు లాభాలు ఆర్జిస్తున్నారు.
ఇక ఈ క్రమంలోనే వచ్చిన కేజీఎఫ్, కాంతార, చార్లీ777, విక్రమ్(Vikram), వారసుడు, మాస్టర్, 2018, జైలర్(Jailer), లియో, మార్క్ అంటోని జవాన్(JAWAN), పఠాన్ వంటి డబ్బింగ్ సినిమాలను తెలుగు ప్రేక్షకులు బాగా ఆదరించడంతో రెండింతల కలెక్షన్లు రాబట్టాయి. అంతేగాక మరిన్ని సినిమాలు తెలుగులోకి అనువాదం అయ్యేందుకు దోహద పడ్డాయి. ఈ వరుసలో ఈ నెలలో లారెన్స్, సూర్య నటించిన జిగర్తాండ, కార్తీ జపాన్, కాళి వెంకట్ దీపావళి, సల్మాన్ ఖాన్ టైగర్3(TIGER3), ధనుష్ కెప్టెన్ మిల్లర్, రణబీర్ కపూర్ యానిమల్, రక్షిత్ షెట్టి సప్తసాగరాలు దాటి సినిమాలు త్వరలో తెలుగు థియేటర్లలో విడుదల కాబోతున్నాయి.
ఈ నేపథ్యంలో ఆయా భాషల హీరోలు తమ సినిమాల విడుదల సందర్భంగా వారి మాతృకలతో సమానంగా ఇక్కడ ప్రెస్మీట్లు, ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు, ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా తమిళ హీరోలు కార్తీ, లారెన్స్, ఎస్జే సూర్య, విక్రమ్‌లు ఇక్కడ ఈవెంట్లలో పాల్గొని సందడి చేశారు. ప్రత్యేక ఇంటర్య్వూలు ఇస్తూ తమ సినిమాలను ప్రేక్షకులలోకి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు.