Trisha vs Mansoor Ali Khan: నా వ్యాఖ్యలు వెనక్కి తీసుకోను, క్షమాపణ చెప్పను: మన్సూర్
ABN , First Publish Date - 2023-11-21T14:56:55+05:30 IST
తాను సరదాగా అన్న మాటలను మీడియా వక్రీకరించిందని, త్రిష కూడా ఎడిట్ చేసిన వీడియో షేర్ చేసారని, తాను అన్న మాటలని వెనక్కి తీసుకోను క్షమాపణ చెప్పను అని ఈరోజు చెన్నైలో జరిగిన ప్రెస్ మీట్ లో మన్సూర్ అలీ ఖాన్ చెప్పాడు.
నటుడు మన్సూర్ అలీ ఖాన్ (MansoorAliKhan) నటి త్రిష (Trisha) గురించి అనుచిత వ్యాఖ్యలు చేసారని గత రెండు రోజుల నుండి దుమారం రేగిన సంగతి తెలిసిందే. మన్సూర్ లాంటి నటుడితో పని చేయనందుకు చాలా సంతోషంగా ఉందని, ఇక ముందు అతనితో పని చెయ్యను అని, అతని మీద చర్య తీసుకోవాలని త్రిష సాంఘీక మాధ్యమంలో ఒక ప్రకటన ద్వారా చెప్పిన విషయం కూడా తెలిసిందే. పరిశ్రమనుండి ఎంతోమంది త్రిషకి తమ సంఘీభావం తెలియచేస్తూ, మన్సూర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. (Many people condemns Mansoor Ali Khan's comments on Trisha). చిరంజీవి (Chiranjeevi), నితిన్ (Nithiin) టాలీవుడ్ నుండి స్పందించిన వాళ్లలో వున్నారు.
అయితే తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకునేది లేదని మన్సూర్ అలీ ఖాన్ ఈరోజు చెన్నైలో ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు. అందులో తానెటువంటీ అసభ్యకరమైన వ్యాఖ్యలు చెయ్యలేదని, సరదాగా అన్న మాటలు పట్టుకొని తనని త్రిషతో సహా అందరూ టార్గెట్ చేశారని చెప్పాడు మన్సూర్. తాను క్షమాపణ కూడా చెప్పేది లేదని తేల్చేసాడు.
ఇంకొక ఆసక్తికరం అంశం ఏంటంటే, మీడియాలో తన ఫోటోలు మంచివి వాడలేదని, అంతకంటే మంచి ఫోటోలు నావి దొరకలేదా అంటూ ఆ ప్రెస్ మీట్ లో మీడియావాళ్లని అడిగాడు. తాను ఏమీ తప్పు మాట్లాడలేదని, సినిమాలో రేప్ సన్నివేశాలు గురించి మాత్రమే మాట్లాడాను అని, కానీ మీడియాలో తాను నిజంగానే రేప్ చేసినట్టుగా వార్తలు రాసారని చెప్పాడు మన్సూర్.
సినిమాలో హత్య చేస్తే, అది నిజంగానే చేసినట్టా అని ప్రశ్నించాడు. తన వ్యాఖ్యల్ని మీడియా వక్రీకరించి రాసిందని, అందుకు తాను ఎవరికీ క్షమాపణ చెప్పే ప్రసక్తి లేదని చెప్పాడు. నడిగర్ సంఘం (NadigarSangam) తన మీద నిషేధం విధించడంపై మన్సూర్ మండిపడ్డాడు. వాళ్ళకి నేను నాలుగు గంటలు సమయం ఇస్తున్నాను, వాళ్ళు నిషేధాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పాడు. కనీసం తనని వివరణ అడగకుండా, నోటీసు ఇవ్వకుండా నడిగర్ సంగం తనమీద నిషేధం ఎలా విధిస్తుందని చెప్పాడు మన్సూర్. మన్సూర్ అలీ ఖాన్ క్షమాపణ చెప్పాలని, లేదంటే అతని మీద నిషేధం ఉంటుందని నడిగర్ సంఘం చెప్పింది.
మన్సూర్ క్షమాపణ చెప్పను అని అనటంతో ఈ మొత్తం ఘటన ఇంకొక కోణంవైపు మళ్లిందని పరిశ్రమలో టాక్. అతను త్రిష కేవలం ఎడిట్ చేసిన వీడియో మాత్రమే షేర్ చేసి తన మాటలను వక్రీకరించినట్టుగా మన్సూర్ ఆరోపిస్తున్నాడు.
ఇది కూడా చదవండి:
Chiranjeevi: మన్సూర్ వ్యాఖ్యలని ఖండించిన మెగాస్టార్, త్రిషకు మద్దతు