Love Today: ‘అలాంటి వారితో సినిమా సాహసమే.. హిట్ కొట్టినా గుర్తింపు రాలేదు’
ABN , First Publish Date - 2023-02-16T11:07:13+05:30 IST
ఏ భాష చిత్రమైనప్పటికీ పట్టించుకోకుండా కంటెంట్ బావుంటే చాలు తెలుగు ప్రేక్షకులు హిట్ చేసేస్తుంటారు.
ఏ భాష చిత్రమైనప్పటికీ పట్టించుకోకుండా కంటెంట్ బావుంటే చాలు తెలుగు ప్రేక్షకులు హిట్ చేసేస్తుంటారు. అలా ఎటువంటి అంచనాలు లేకుండా తెలుగులోనూ సూపర్ హిట్‌గా నిలిచిన చిత్రం ‘లవ్ టుడే’ (Love Today). ప్రదీప్ రంగనాథన్ (Pradeep Ranganathan), ఇవానా (Ivana) హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి ప్రదీప్ దర్శకుడు. సత్యరాజ్, రాధిక తదితరులు నటించారు. యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా.. ఏజీఎస్ బ్యానరుపై అర్చన కల్పాతి, వెంకట్ మాణిక్యం, ఐశ్వర్య కల్పాతి నిర్మించారు. ఈ మూవీ విడుదలై తాజాగా వందరోజులు పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం తాజాగా శతదినోత్సవ వేడుకలను అట్టహాసంగా నిర్వహించింది. ఈ సందర్భంగా చిత్రంలో నటించిన ప్రతి ఒక్క నటీనటులకు, పనిచేసిన టెక్నీషియన్లకు ‘లవ్‌టుడే’ వంద రోజుల షీల్డులు బహుకరించారు.
దర్శక నటుడు ప్రదీప్ మాట్లాడుతూ.. ‘‘కోమాలి’ వంటి హిట్ చిత్రాన్ని నిర్మించిన తర్వాత మరో చిత్రం చేసేందుకు మూడేళ్లు పట్టింది. కాస్త ఆలస్యమైన మంచి సబ్జెక్టుతో రావాలన్న పట్టుదలే దీనికి కారణం. ఒక కొత్త ముఖాన్ని హీరోగా పరిచయం చేయడం అంత సులభంకాదు. ఏజీఎస్ నాపై నమ్మకం ఉంచి ఈ చిత్రాన్ని నిర్మించింది. అదే ఈ సక్సెస్‌కు కారణం. ఇక్కడ హీరోగా విఫలమైతే నా కెరీర్ ముగిసినట్టే. అయినా సరే ‘లవ్‌టుడే’ వంటి అతిపెద్ద కొండను ఎక్కాలన్న పట్టుదలే ఇంతవరకు తీసుకొచ్చింది. ‘కోమాలి’ వంటి భారీ హిట్ చిత్రానికి దర్శకత్వం వహించినా నాకు చిత్ర పరిశ్రమలో తగిన గుర్తింపు లేదు. అలాంటి పరిస్థితుల్లో నాపై నమ్మకంతో ఏజీఎస్ ముందుకు వచ్చింది. వారికి ధన్యవాదాలు’ అని చెప్పుకొచ్చాడు.
ఇది కూడా చదవండి: LoveToday: ‘మీడియాపై ఉన్న నమ్మకమే ఈ విజయం’