Sorry To Siddharth : నిన్న ప్రకాశరాజ్... నేడు శివన్నా.. క్షమించండి సిద్థార్థ్..
ABN , First Publish Date - 2023-09-30T12:46:08+05:30 IST
కర్ణాటకలో తనకు ఎదురైన చేదు అనుభవంపై హీరో సిద్థార్థ్ స్పందించారు. తన నటించిన చిన్నా చిత్రం ప్రెస్‌మీట్‌ను కావేరీ జలాల వివాదానికి చెందిన నిరసనకారులు అడ్డుకోవడంతో ఎంతో నిరాశ చెందినట్లు ఆయన తెలిపారు.
కర్ణాటకలో తనకు ఎదురైన చేదు అనుభవంపై హీరో సిద్థార్థ్ (Siddharth) స్పందించారు. తన నటించిన చిన్నా చిత్రం ప్రెస్‌మీట్‌ను కావేరీ జలాల వివాదానికి చెందిన నిరసనకారులు అడ్డుకోవడంతో ఎంతో నిరాశ చెందినట్లు ఆయన తెలిపారు. సినిమాకూ అక్కడ జరుగుతున్న జల వివాదానికి ఎలాంటి సంబంధం లేదని ఆయన అన్నారు. ప్రమోషన్స ఆపడం వల్ల సినిమాకు నష్టం వాటిల్లిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సిద్ధార్థ్ మాట్లాడుతూ ‘‘నిర్మాతగా విడుదలకు ముందే నేను ఈ చిత్రాన్ని చాలా మందికి చూపించాలనుకున్నా. అప్పటికే చెన్నైలో కొంతమందికి చూపించాను. బెంగుళూరులో మీడియాకూ ఒక షో ఏర్పాటు చేయాలనుకున్నా. విడుదలకు ముందే 2000 మంది విద్యార్థుల?కు చూపించాలనుకున్నా. ఇప్పటి వరకు ఏ సినిమా దర్శక నిర్మాత ఇలా చేయలేదు. కానీ, బంద్ కారణంగా మేం అన్నింటినీ రద్దు చేశాం. దీనివల్ల మాకు భారీనష్టం వాటిల్లింది. దీని కన్నా బాధాకరమైన విషయం ఏంటంటే మంచి చిత్రాన్ని అక్కడి ప్రజలతో పంచుకోలేకపోయాం. నాకెంతో నిరాశ కలిగించిన విషయమిది. నా ప్రెస్‌మీట్ తర్వాత అందరికీ సినిమా చూపించాల్సి ఉంది. కానీ, అక్కడ ఏం జరిగిందో మీరంతా చూశారు. జరిగిన దాని గురించి నేను మాట్లాడాలనుకోవడం లేదు. సినిమాకు మంచి ప్రేక్షకాదరణ వస్తోంది. నా సినిమాకు ఈ వివాదానికి ఎలాంటి సంబంధం లేదు. నేను తీసే సినిమాల్లో సామాజిక బాధ్యత ఉంటుంది’’ అని సిద్థార్థ్ అన్నారు.
శుక్రవారం మీడియా ముంద నిసరన కారులు చేసిన దానికి కన్నడ ప్రజల తరపున విలక్షణ నటుడు ప్రకాశ రాజ్ (Prakash Raj) ఇప్పటికే క్షమాపణలు తెలిపారు. నిరసన కారులు చేసిన ఈ పనిని చాలామంది తప్పుబట్టారు. తాజాగా సిద్దార్థ్‌కు జరిగిన అవమానంపై కన్నడ నటుడు శివ రాజ్‌కుమార్ (Shivaraj kumar) ఇలా స్పందించారు. ‘‘నిన్న జరిగిన ఈ ఘటన నిజంగా బాధాకరం. మా ఇండస్ర్టీ తరపున సిద్థార్థ్‌కి క్షమాపణలు చెబుతున్నా.. సిద్థార్థ్ క్షమించండి.. చాలా బాధపడ్డాం. ఈ తప్పు ఇంకెప్పుడూ జరగదు’ అంటూ నటుడు సిద్థార్థ్‌కి శివన్న సారీ చెప్పారు. కన్నడ ప్రజలు చాలా మంచివారు. అన్ని భాషల చిత్రాలను ఇష్టపడతారు. కర్ణాటకకు చెందిన వారు మాత్రమే అన్ని భాషల సినిమాలను తమ సినిమాగా భావించి ఆదరిస్తారు. ఈ విషయాన్ని మనం గర్వంగా చెప్పుకోగలం. ఆ గౌరవాన్ని మనం నిలబెట్టుకోవాలి’’ అని ఆయన అన్నారు.
ఇదే సమస్యపై శుక్రవారం ప్రకాశరాజ్ ఏమన్నారంటే.. ‘‘దశాబ్దాల నాటి సమస్యను పరిష్కరించడంలో విఫలమైన రాజకీయ పార్టీలు, నాయకులను నిలదీయకుండా, ప్రభుత్వాలపై ఒత్తిడి తీసుకురాకుండా సామాన్యులు, కళాకారులను ఇబ్బంది పెట్టడం ఎంతవరకూ న్యాయం. ఇలా చేయడం అసలు ఆమోదయోగ్యం కాదు. కర్ణాటకకు చెందిన మనిషిగా ఇక్కడి ప్రజలందరి తరపున సిద్థార్థ్‌కు క్షమాపణల చెబుతున్నాను’’ అని సోషల్ మీడియా ద్వార ప్రకాశ్ రాజ్ తెలిపిన సంగతి తెలిసిందే!