Nassar: తమిళ పరిశ్రమ ఎలాంటి నిబంధనలు పెట్టలేదు.. అలా చేస్తే...

ABN , First Publish Date - 2023-07-27T16:02:54+05:30 IST

తమిళ నటులు తమిళ చిత్రాల్లోనే నటించాలి, తమిళనాడులోనే షూటింగ్‌లు చేయాలనే కొత్త నిబంధనలను ఫిల్మ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ (ఫెఫ్సీ-FEFSI) తీసుకొచ్చిందనే వార్తలు కొద్ది రోజులుగా హల్‌చల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే! దీనిపై కొందరు తమిళ నిర్మాతలు, ఆర్టిస్ట్‌లు వ్యతిరేకించారనీ వార్తలొచ్చాయి. ఇదే విషయంపై ఇటీవల జరిగిన ‘బ్రో’ (Bro) ప్రీ రిలీజ్‌ వేడుకలో పవన్‌ కల్యాణ్‌ (Pawan kalyan) కూడా మాట్లాడారు. దీనిపై నడిగర్‌ సంఘం అధ్యక్షుడు, నటుడు నాజర్‌ (Nassar) స్పందించారు.

Nassar: తమిళ పరిశ్రమ ఎలాంటి నిబంధనలు పెట్టలేదు.. అలా చేస్తే...

తమిళ నటులు తమిళ చిత్రాల్లోనే నటించాలి, తమిళనాడులోనే షూటింగ్‌లు చేయాలనే కొత్త నిబంధనలను ఫిల్మ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ (ఫెఫ్సీ-FEFSI) తీసుకొచ్చిందనే వార్తలు కొద్ది రోజులుగా హల్‌చల్‌ చేస్తున్న సంగతి తెలిసిందే! దీనిపై కొందరు తమిళ నిర్మాతలు, ఆర్టిస్ట్‌లు వ్యతిరేకించారనీ వార్తలొచ్చాయి. ఇదే విషయంపై ఇటీవల జరిగిన ‘బ్రో’ (Bro) ప్రీ రిలీజ్‌ వేడుకలో పవన్‌ కల్యాణ్‌ (Pawan kalyan) కూడా మాట్లాడారు. ‘‘పరిశ్రమలో మనవాళ్లే చేయాలి అనే ధోరణి నుంచి బయటకు రావాలి. తెలుగు చిత్ర పరిశ్రమ భాష, ప్రాంతంతో సంబంధం లేకుండా కళాకారులను ఆహ్వానిస్తుంది. కోలీవుడ్‌లో కూడా ఇలాగే కొనసాగితే పరిశ్రమ మంచి స్థాయికి చేరుతుంది. తమిళ పరిశ్రమ తమిళం వారికే అంటే పరిశ్రమ ఎదగదు. ఈరోజున తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుగుతుందీ అంటే అన్ని పరిశ్రమల వారినీ కలుపుకొని వెళ్తుంది కాబట్టే. ఒక్కళ్ళు కాదు, అన్ని భాషల్లో కలయిక ఉంటేనే సినిమా అవుతుంది తప్ప.. ‘ఇది మన భాష. మనమే ఉండాలి’ అంటే.. కుంచించుకుపోతాం. మీరు కూడా తమిళ పరిశ్రమ నుంచి బయటికి వచ్చి ఆర్‌ఆర్‌ఆర్‌ లాంటి సినిమా తీయాలని, మీ పరిశ్రమను విస్తృతం చేసుకోవాలని తమిళ పరిశ్రమ పెద్దలను కోరుకుంటున్నా’’ అని పవన్‌(Pawan kalyan) అన్నారు.

పవన్‌ వ్యాఖ్యలతోపాటు సోషల్‌ మీడియాలో తమిళ పరిశ్రమపై జరుగుతున్న చర్చపై నడిగర్‌ సంఘం అధ్యక్షుడు, నటుడు నాజర్‌ (Nassar) స్పందించారు. ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. ‘‘తమిళ సినిమాల్లో తమిళ నటులే నటించాలని, ఇతరులకు అవకాశం లేదని వస్తున్న వార్తల్లో నిజంలేదు. ఒకవేళ కోలీవుడ్‌లో అలాంటి ప్రతిపాదన వస్తే మొదట ప్రశ్నించే వ్యక్తిని నేనే. ఇప్పుడు మనమంతా పాన్‌ ఇండియా, గ్లోబల్‌ స్థాయి చిత్రాలు చేస్తున్నాం. ఏ సినిమా పరిశ్రమకైనా ఇతర భాషల ఆర్టిస్ట్‌ల అవసరం ఉంటుంది. ఇలాంటి తరుణంలో ఎవరూ ఈ తరహా నిర్ణయాలు తీసుకోరు. అయితే తమిళ చిత్ర పరిశ్రమ కార్మికుల కష్టాలు తీర్చేందుకు సెల్వమణి ఓ బలమైన నిర్ణయం తీసుకున్నారు. అయితే అందులో పర భాషా ఆర్టిస్ట్‌లు ఉండకూడదు అన్న ప్రస్తావనే లేదు. తమిళ చిత్ర పరిశ్రమకు ఓ ట్రెడిషన్‌ ఉంది. ఎస్వీ రంగారావు, సావిత్రమ్మ, వాణిశ్రీలాంటి ఎందరో అగ్రతారలు తమిళ సినిమాలో భాగమై ఉన్నారు. ఆ ట్రెడీషన్‌ ఎప్పటికీ అలాగే ఉంటుంది. దయచేసి అపోహలను నమ్మవద్దు. బాషా బేధాలు లేకుండా అందరం కలిసి పని చేద్దాం. ఇండియన్‌ సినిమాను ఉన్నత స్థాయికి తీసుకెళ్దాం’’ అని అన్నారు.

Updated Date - 2023-07-27T16:02:54+05:30 IST