2018: తెలుగులో రాబోతున్న మలయాళ సంచలన చిత్రం!
ABN , First Publish Date - 2023-05-22T16:49:51+05:30 IST
కేరళ వరదల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘2018’. జూడే ఆంథోని జోసెఫ్ దర్శకత్వంలో టోవినో థామస్, కుంచకో బోబన్, అసిఫ్ ఆలీ, లాల్ తన్వి రామ్ కీలక పాత్రల్లో నటించారు. 2018లో సంభవించిన వరదలు కేరళ రాష్ర్టాన్ని అతలాకుతలం చేశాయి.
కేరళ వరదల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘2018’(Film: 2018). జూడే ఆంథోని జోసెఫ్ దర్శకత్వంలో టోవినో థామస్, కుంచకో బోబన్, అసిఫ్ ఆలీ, లాల్ తన్వి రామ్ కీలక పాత్రల్లో నటించారు. 2018లో సంభవించిన వరదలు కేరళ రాష్ర్టాన్ని అతలాకుతలం చేశాయి. ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. లక్షల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. పెద్ద ఎత్తున ఆస్తి నష్టం సంభవించింది. ఈ విపత్తు ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. తమని తాము రక్షించుకుంటూనే ఎదుటివారికి ఎలా సాయం చేశారన్నది ఈ సినిమా కథ. కావ్య ఫిల్మ్ కంపెనీ, పీకే ప్రైమ్ ప్రొడక్షన్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. ఈ నెల 5న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. 10 రోజుల్లో రూ.100 కోట్లు.. కలెక్ట్ చేసిన ఈ మూవీ ఇప్పుడు మరో సరికొత్త రికార్డు సృష్టించింది. మలయాళ చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. ఇప్పటివరకూ ఈ సినిమా రూ.137 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మోహన్‌లాల్ నటించిన పులి మురుగన్ పేరిట ఈ రికార్డ్ ఉండేది. అయితే ఇప్పుడు ఈ చిత్రం జోరు ఏ మాత్రం తగ్గేలా లేదు. త్వరలో తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కూడా విడుదలకు సిద్ధమవుతోంది. మలయాళంలో ఆదరణ దక్కినట్లుగా ఇతర భాషల్లో కూడా ఆదరిస్తే రూ.200 కోట్లు దాటడం ఖాయమని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఈ సినిమా తెలుగు హక్కుల్ని బన్నీ వాస్ సొంతం చేసుకున్నారు.