A R Rahman: స్టూడియోలో ప్రతి అంగుళం కష్టంతో సమకూర్చిందే!
ABN , First Publish Date - 2023-08-12T20:59:45+05:30 IST
బంధుప్రీతి (నెపోటిజం)గురించి అన్ని పరిశ్రమల్లోనూ తరచూ వింటుంటాం. దీనిపై ఇప్పటికే చాలామంది తారలు గొంతెత్తి మాట్లాడారు. తాజాగా ఈ విషయంపై ఆస్కార్ గ్రహీత, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ (Ar Rahman) స్పందించారు. తన లెగసీని తన ముగ్గురు బిడ్డలు కొనసాగించాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు.
బంధుప్రీతి (నెపోటిజం)గురించి అన్ని పరిశ్రమల్లోనూ తరచూ వింటుంటాం. దీనిపై ఇప్పటికే చాలామంది తారలు గొంతెత్తి మాట్లాడారు. తాజాగా ఈ విషయంపై ఆస్కార్ గ్రహీత, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ (Ar Rahman) స్పందించారు. తన లెగసీని తన ముగ్గురు బిడ్డలు కొనసాగించాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ ‘‘మన చేసే వృత్తిని తప్పకుండా పిల్లలకు తెలియజేయాలి(nepotism) . ఆ పనిని వారికి నేర్పించాల్సిన బాధ్యత మనపై ఉంది. నా పిల్లలకు నేనే చేసే పనిపై అవగాహన లేకపోతే నేను ఎంతో ఇష్టపడి, కష్టపడి ఏర్పాటు చేసుకున్న నా స్టూడియో అంతా నా తర్వాత గోదాంలా మారిపోతుంది. నేను దీనిలో సంగీత పరికరాలతో పెద్ద ప్రపంచాన్ని నిర్మించుకున్నాను. వాటిని ఎలా వినియోగించాలో నా పిల్లలకు తెలియకపోతే ఇది గోదాంలా మారిపోతుంది. నా స్టూడియోలో ప్రతి అంగుళాన్ని ఎంతో శ్రద్ధతో కష్టపడి నిర్మించుకున్నా. అందుకే భవిష్యత్తులో దీన్ని నా పిల్లలు వినియోగించాలని కోరుకుంటా. వారు ఇదే వృత్తిని కొనసాగిస్తారని ఆశిస్తున్నా. వారసత్వమనేది లేకపోతే ఎన్నో విషయాలు అదృశ్యమవుతాయి. అలాగే ఆర్థికపరమైన విషయాలను కూడా నా పిల్లలతో పంచుకుంటా. ఇదంతా వారిని విసిగించడానికి చేసేది కాదు. వారు అన్ని విషయాలను నేర్చుకోవడం కోసమే ఇలా చేస్తా’’ అని ఏఆర్ రెహమాన్ అన్నారు. దీంతోపాటు కెరీర్ బిగినింగ్‌లో జరిగిన ఓ సంఘటన గురించి కూడా ఆయన చెప్పారు. ‘‘నేను చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చేేస్త నాకు పెద్ద స్థలం ఇస్తానని ఓ అగ్ర నిర్మాత అన్నారు. ఆయన్ని చూసి నవ్వి అక్కడి నుంచి వెళ్లిపోయాను. ఆ తర్వాత నేను బాలీవుడ్ సినిమాలకు సంగీత దర్శకత్వం చేస్తున్న తొలి రోజుల్లో చాలామంది నన్ను హిందీ నేర్చుకోమని చెప్పారు. అలా అయితేనే అక్కడి ప్రజలు నన్ను ఇష్టపడతారని చెప్పారు’’ అని రెహమాన్ అన్నారు.
రెహమాన్ కుమార్తె ఖతిజా (Khatija) ‘పొన్నియన్ సెల్వన్’ చిత్రంలో ఓ పాట పాడారు. కుమారుడు అమీన్ ఇటీవల విడుదలైన ‘మామన్నన్’ చిత్రం కోసం పాడారు. ప్రస్తుతం ఆయన పిల్లలకు సంగీతం మీద ఆసక్తి ఉన్నట్లే కనిపిస్తోంది. రెహమాన్ కోరుకున్నట్లు ఆ లెగసీని కంటిన్యూ చేసేలాగే ఉన్నారు.