Hi Nanna: ఓటీటీలోకి నాని లేటెస్ట్ బ్లాక్‌బస్టర్.. ఎప్పటినుంచంటే!
ABN , Publish Date - Dec 27 , 2023 | 10:56 AM
నాని, మృణాల్ ఠాకూర్, బేబీ కియారా ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన హయ్ నాన్న సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది.
ఇటీవల థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్న హయ్ నాన్న సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. నాని (Nani), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur), బేబీ కియారా ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం డిసెంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైంది. ఈ సినిమాను వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, మోహన్ చెరుకూరి నిర్మించగా శౌర్యువ్ దర్శకుడిగా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చాడు.
దసరా వంటి మాస్ చిత్రం తర్వాత ఔట్ అండ్ ఫ్యామిలీ స్టోరీ హయ్ నాన్నతో వచ్చిన నాని ప్రేక్షకులతో ఎమోషనల్ రైడ్ చేయించాడు. తండ్రీకూతురు అనుబంధం నేపథ్యంలో కూతురే ప్రంపంచంగా జీవిస్తున్న ఫొటోగ్రాఫర్ విరాజ్ లవ్ చేసి పెళ్లి చేసుకున్న వర్ష ఎలా దూరమైంది, ఈ తర్వాత యశ్న తన లైఫ్‌లోకి వచ్చిన తర్వాత జరిగిన కథ ఇతివృత్తంతో ఈ సినిమా ఆద్యంతం ఫ్యామిలీ సెంటిమెంట్‌తో నడుస్తూ కుటుంబ ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈ ప్రేమ సరిపోదా అంటూ సాగే డైలాగ్స్‌తో కంటతడి పెట్టిస్తుంది.
రెండు గంటల 35 నిమిషాల నిడివితో సాగే ఈ చిత్రం ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా రూ.70 కోట్లకు పైగా కలక్షన్లను రాబట్టి లాభాల బాట పట్టి ఈ యేడు తెలుగులో భారీ బ్లాక్‌బస్టర్ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. ముఖ్యంగా ఈ సినిమాకు హేషామ్ అబ్దుల్ వహాబ్ (Hesham Abdul Wahab) అందించిన సంగీతం ప్రాణం పోషిందనే విషయంలో అతిశయోక్తి లేదు. కాకపోతే ఈ చిత్రం ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ చిత్రమైననప్పటికీ మధ్యలో వచ్చే ఐదారు లిప్‌లాక్ సన్నివేశాలు కాస్త అసౌకర్యానికి గురి చేయొచ్చు.
సినిమా విడుదలకు ముందే సినిమా మేకర్స్‌తో ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ సినిమాను 40 రోజుల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ తీసుకురావాల్సి ఉంది. ఈ క్రమంలో చిత్రాన్ని జనవరి 19 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు సోషల్ మీడియాల్లో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి.
అయితే జనవరి 12 నుంచి స్ట్రీమింగ్ జరుగనున్నట్లు కూడా నెట్టింట చర్చ నడుస్తున్నది. అధికారికంగా ప్రకటన రావాల్సి ఉన్నది. ఇదిలాఉండగా హయ్ నాన్న సినిమా నెల రోజుల అనంతరం థియేటర్లలో విజయవంతగా నడుస్తుండడంతో ఓటీటీలో విడుదల ఆలస్యమయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ఈ చిత్రం ఓటీటీ రైట్స్ ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ దక్కించుకోగా, శాటిలైట్ రైట్స్ జెమిని టీవీ దక్కించుకుంది. 2024 వేసవిలో ప్రసారం చేయనుంది.