Nawab: ఎట్ట‌కేల‌కు.. ఆ మ‌ణిర‌త్నం సినిమాకు మోక్షం! ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?

ABN , Publish Date - Dec 31 , 2023 | 05:31 PM

మొత్తానికి మ‌ణిర‌త్నం సినిమాకు ఎట్ట‌కేల‌కు మోక్షం ల‌భించింది. అప్పుడెప్పుడో 2018లో విడుద‌లైన ఈ తెలుగు డ‌బ్బింగ్‌ సినిమా ఇప్పుడు డిజిట‌ల్ స్ట్రీమింగ్ అవుతున్న‌ది.

Nawab: ఎట్ట‌కేల‌కు.. ఆ మ‌ణిర‌త్నం సినిమాకు మోక్షం! ఎందులో స్ట్రీమింగ్ అవుతుందంటే?
nawab

మొత్తానికి మ‌ణిర‌త్నం (Maniratnam) సినిమా డిజిట‌ల్ స్ట్రీమింగ్‌కు ఎట్ట‌కేల‌కు మోక్షం ల‌భించింది. అప్పుడెప్పుడో 2018లో విడుద‌లైన ఈ తెలుగు డ‌బ్బింగ్‌ సినిమాను థియేట‌ర్ల‌లో విడుద‌లైన‌ప్పుడు, ఆ త‌ర్వాత ఇప్ప‌టివ‌ర‌కు ఏ ఒక్క‌రు ప‌ట్టించుకున్న పాపాన పోలేదు. అందుకే ఇదో చిత్రం ఉన్న సంగ‌తి చాలా మందికి తెలియ‌దు. రోబో, పొన్నియ‌న్ సెల్వ‌న్‌1, 2 వంటి బిగ్గెస్ట్ ప్రొడ‌క్ష‌న్ స‌మ‌ర్పించిన ఈ చిత్రాన్ని మ‌ద్రాస్ టాకీస్ (Madras Talkies) బ్యాన‌ర్‌పై మణిరత్నమే నిర్మించారు. త‌మిళంలో చెక్క చివంద వానమ్‌,తెలుగులో న‌వాబ్ (Nawab) పేరుతో సెప్టెంబ‌ర్ 27న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల‌వ‌గా త‌మిళ‌నాట,తెలుగు నాట‌ మంచి ప్రేక్ష‌కాద‌ర‌ణతో హిట్‌గా నిలిచింది.

శింబు (Simbhu), విజయ్​ సేతుపతి (Vijay Sethupathi), అరుణ్ విజ‌య్ (Arun Vijay), అరవింద్‌ స్వామి (Arvind Swamy), ప్రకాష్ రాజ్, జ్యోతిక, ఐశ్వర్య రాజేష్, త్యాగ‌రాజ‌న్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఒకే బంగారం లాంటి హిట్‌, చెలియా వంటి డిజాస్ట‌ర్‌ సినిమాల త‌ర్వాత‌ మణిరత్నం దర్శకత్వం వహించాడు. అంత‌కు ముందే తెలుగులో 2016లో మంచు మ‌నోజ్ హీరోగా రామ్‌గోపాల్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన‌ ఎటాక్ సినిమాను పోలి ఉండడం గ‌మ‌నార్హం. ఆస్కార్ ఆవార్డు గ్ర‌హీత A. R. రెహమాన్ సంగీతం అందించ‌గా సంతోష్ శివన్ సినిమాటోగ్రాఫర్‌గా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్‌గా ప‌ని చేశారు. ఇదిలాఉండ‌గా సినిమాలో లేడీ యాక్ట‌ర్ల క్యారెక్ట‌ర్లు బ‌లంగా లేక పోవ‌డం మైన‌స్‌గా నిలిచింది


ఇక క‌థ విష‌యానికి వ‌స్తే న‌గ‌రంలోనే పెద్ద‌ గ్యాంగ్‌స్ట‌ర్ అయిన భూపతి రెడ్డి (ప్రకాష్ రాజ్)కు ముగ్గురు కొడుకులు వరద (అరవింద్ స్వామి), త్యాగు (అరుణ్ విజయ్), రుద్ర (శింబు) ఉంటారు. ఓరోజు భూప‌తిరెడ్డి ఆయ‌న భార్య‌పై హ‌త్యా ప్ర‌య‌త్నం జ‌రుగుతుంది. దీంతో అల‌ర్టైన‌ కుమారులు తండ్రిని చంపించడానికి ప్ర‌య‌త్నించిన వారిని ప‌ట్టుకునే ప్ర‌య‌త్నంలో త‌మ స‌హ‌చ‌ర మిత్రుడు రసూల్ (విజయ్ సేతుపతి) సాయం తీసుకుంటారు. ఈలోపే తండ్రి చ‌నిపోతాడు. అనంత‌రం అధికారం కోసం ముగ్గురు కొడుకుల మ‌ధ్య గొడ‌వ‌లు ప్రారంభ‌మై తీవ్ర స్థాయికి చేరుకుంటాయి. ఈ క్ర‌మంలో తండ్రి స్థానాన్ని ఎవ‌రు ద‌క్కించుకున్నారు, హ‌త్యాయ‌త్నం చేసిందెవ‌రనే ఇతివృత్తంలో మ‌ణిరత్నం (Maniratnam) మార్క్ టేకింగ్‌, ఎమోష‌న్స్‌తో సాగుతుంది.

అయితే 5 సంవ‌త్స‌రాల త‌ర్వాత 2 గంట‌ల 21 నిమిషాల 56 సెకండ్ల నిడివితో క్రైమ్ థ్రిల్ల‌ర్‌ జాన‌ర్‌లో రూపొందిన ఈ న‌వాబ్ (Nawab) సినిమాను లైకా (Lyca Productions) సంస్థ త‌న యూ ట్యూబ్ ఛాన‌ల్‌లో స్ట్రీమింగ్‌కు తీసుకురాగా త‌క్కువ స‌మ‌యంలోనే 336కే వ్యూస్ సాధించింది. మీరు మ‌ణిర‌త్నం సినిమాల అభిమాని అయినా, ఈ సినిమా విడుద‌ల స‌మ‌యంలో థియేట‌ర్‌లో మిస్స‌యినా వెంట‌నే యూ ట్యూబ్‌లో చూసేయండి. మ‌రో విష‌య‌మేంటంటే.. ఈ సినిమా విడుద‌ల టైంలో సూప‌ర్ స్టార్ మ‌హేశ్‌బాబు ఈ దశాబ్దాపు సినిమా న‌వాబ్ అంటూ ఈ సినిమాను ఆకాశానికెత్తేయ‌డం విశేషం.

Updated Date - Dec 31 , 2023 | 05:56 PM